ఫుడ్ సేఫ్టీ అధికారుల రెయిడ్స్.. రెండు ప్రముఖ రెస్టారెంట్లకు నోటీసులు

by Prasad Jukanti |

సైబరాబాద్ పరిధిలోని కంచి కేఫ్, కోడికూర చిట్టిగారె రెస్టారెంట్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించి నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు.

ఫుడ్ సేఫ్టీ అధికారుల రెయిడ్స్.. రెండు ప్రముఖ రెస్టారెంట్లకు నోటీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫుడ్ సేప్టీ అధికారులు తనిఖీలు చేపడుతున్నా కొంత మంది రెస్టారెంట్ యాజమాన్యాల తీరు మారడం లేదు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడటాన్ని ఆపడం లేదు. తాజాగా సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (CMC) ఫుడ్ సేఫ్టీ బృందాలు జూన్ 22న పలు హోటళ్లు, రెస్టారెంట్లు మరియు ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్‌పై జరిపిన దాడుల్లో ప్రముఖ రెస్టారెంట్లలో నిబంధనల ఉల్లంఘనలు, తీవ్రమైన లోపాలను గుర్తించారు. తక్షణమే లోపాలను సరిదిద్దుకోవాలని ఇంప్రూవ్‌మెంట్ నోటీసు జారీ చేశారు.

కంచి కేఫ్ (పుప్పాలగూడ):

పుప్పాలగూడలోని 'కంచి కేఫ్'లో అధికారులు జరిపిన తనిఖీల్లో షాకింగ్ విషాలు వెలుగు చూశాయి. కిచెన్, స్టోర్ రూమ్ మధ్యలో ఎలాంటి మూతలు లేకుండా ఓపెన్ డస్ట్‌బిన్లు ఉంచడంతో ఆ ప్రాంతమంతా తీవ్రమైన దుర్వాసన వస్తూ ఈగలు ముసురుతున్నాయి. అలాగే ఆహార పదార్థాలను నిల్వ చేయడంలో సరైన పద్ధతులు పాటించకపోవడాన్ని గుర్తించారు. వంటగది, స్టోర్ రూమ్‌లలో ఈగలు, బొద్దింకలు తిరుగుతుండటంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ ఫిట్‌నెస్, పెస్ట్ కంట్రోల్, వాటర్ టెస్టింగ్, ప్యాకేజింగ్ మెటీరియల్ టెస్టింగ్‌కు సంబంధించిన ఎలాంటి రికార్డులు రెస్టారెంట్ యాజమాన్యం వద్ద అందుబాటులో లేవని గుర్తించారు. హైజీన్ అసెస్‌మెంట్‌లో ఈ కేఫ్‌కు 94 పాయింట్లకు గాను కేవలం 56 పాయింట్లు మాత్రమే ఈ రెస్టారెంట్ కు వచ్చింది. దీంతో తక్షణమే లోపాలను సరిదిద్దుకోవాలని అధికారులు ఇంప్రూవ్‌మెంట్ నోటీసు జారీ చేశారు.

కోడికూర చిట్టిగారె (నల్లగండ్ల):

నల్లగండ్లలోని కోడికూర చిట్టిగారె రెస్టారెంట్‌లో ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించినట్లు అధికారులు కనుగొన్నారు. అక్కడ ఎలాంటి లేబుల్స్ లేని ఆహార పదార్థాలను వాడటం, అధ్వాన్నమైన నిల్వ పరిస్థితులు, అపరిశుభ్రత ఉన్నట్లు గుర్తించారు. లేబుల్స్ లేని ఆహార పదార్థాలను అధికారులు అక్కడికక్కడే పారవేయడమే కాకుండా, సదరు రెస్టారెంట్‌కు ఇంప్రూవ్‌మెంట్ నోటీసు ఇచ్చారు. ఈ అవుట్‌లెట్‌కు హైజీన్ రేటింగ్‌లో 98 కి గాను 60 పాయింట్లు వచ్చాయి. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఆహార భద్రతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించారు. సైబరాబాద్ వ్యాప్తంగా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు.

Next Story