Bandi Sanjay: రేవంత్ రెడ్డి ఆ విషయం మర్చిపోయావా?.. కంచె గచ్చిబౌలి భూములపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2025-04-01 05:29:38  IST  )

కంచె గచ్చిబౌలి భూములు అటవీ శాఖ పరిధిలోనివి అని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bandi Sanjay: రేవంత్ రెడ్డి ఆ విషయం మర్చిపోయావా?..  కంచె గచ్చిబౌలి భూములపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సమీపంలోని కంచె గచ్చిబౌలి భూములపై (Kanche Gachibowli Lands) వివాదం రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తోంది. ఈ భూములపై తాజాగా కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయాలనుకున్న 400 ఎకరాల భూమి అటవీ (Forest Department) పరిధిలోనిదని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. అటవీ లక్షణాలు కలిగిన ఏ భూమినైనా కేంద్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా నరికివేయలేమని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయన్నారు. ఈ మేరకు ఇవాళ ప్రకటన విడుదల చేసిన ఆయన ఈ భూములకు సంబంధించి సంబంధించి ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తోందన్నారు. వట ఫౌండేషన్‌ అనే ఎన్ జీవో దాఖలు చేసిన కేసులో ఏప్రిల్ 7 నాటికి కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందని అందువల్ల ఆ భూములను వేలం వేయడం కుదరదన్నారు. ఈ విషయం తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం భూముల చదను పేరుతో కోర్టు ధిక్కరణకు పాల్పడుతోందని, చెట్లను తొలగిస్తూ, మొక్కలను పీకేస్తూ పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతోందని ధ్వజమెత్తారు.

కంచె గచ్చిబౌలి భూములను డీఫారెస్టైజేషన్ చేసి అమ్మి వేల కోట్లు దండుకోవాలనుకోవడం దుర్మార్గం అని బండి సంజయ్ మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మించి కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్నారు. ప్రజా ప్రయోజనాలకు కాకుండా ప్రభుత్వ భూములను అడ్డగోలుగా విక్రయించడాన్ని రేవంత్ రెడ్డి (Revanth Reddy) గతంలో వ్యతిరేకించిన సంగతి మర్చిపోయారా? అని ప్రశ్నించారు. కంచె గచ్చిబౌలి భూముల విక్రయం కాంగ్రెస్ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ట అని తక్షణమే గచ్చిబౌలి భూముల అమ్మకంపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజలే తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.

Next Story