- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశారదన్‌ను ఎక్కడకు తీసుకెళ్లారో తెలియదు: కవిత కీలక వ్యాఖ్యలు
వెలుగుమట్ల బాధితులకు ఇళ్లు కూల్చిన చోటే కొత్త ఇళ్లు కట్టించి ఇవ్వాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: వెలుగుమట్ల బాధితులకు ఇళ్లు కూల్చిన చోటే కొత్త ఇళ్లు కట్టించి ఇవ్వాల్సిందేనని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. మంగళవారం వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలంటూ జాగృతి కార్యాలయంలో దీక్ష కొనసాగించారు. సోమవారం రాత్రి ఖమ్మంలో నిరాహార దీక్ష ప్రారంభించగా.. పోలీసులు మంగళవారం ఉదయం అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు. వెలుగుమట్లలో కూల్చిన ఇళ్ల స్థానంలోనే కొత్త ఇళ్లు కట్టిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వాలని.. అప్పటివరకు నిరాహార దీక్ష కొనసాగుతుందని చెప్పారు. భూదాన్ భూములను ఆక్రమించుకునే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిదని నిలదీశారు. ఈ రాష్ట్రంలో పేదల భూములను ప్రభుత్వమే కబ్జా చేస్తున్నదని అన్నారు. వెలుగుమట్లలో భూముల రేట్లు పెరగటంతో పేదల ఇళ్లు కూల్చి ఆ స్థలాన్ని పెద్దలకు కట్టబెట్టే కుట్ర జరుగుతున్నదని ఆరోపించారు. రాజ్యాంగం పట్టుకొనే మాట్లాడే రాహుల్‌గాంధీ ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. వెలుగుమట్ల వ్యవహరంలో వాస్తవాలను తెలుసుకోవాలన్నారు.
అడిగే వాళ్లు లేరనుకుంటున్నారా..?
పేదలంటే కాంగ్రెస్‌కు లెక్క లేకుండా పోయిందని.. అడిగే వాళ్లు లేరనుకుంటున్నారా అని నిలదీశారు. ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు, సీఎం వెంటనే స్పందించాలన్నారు. పేదవాళ్లకు ఇచ్చిన భూమిలో ప్రభుత్వం, కలెక్టర్ కర్కషంగా వ్యవహరించారని.. టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ ఉండే ఇలాంటి సమయంలో అర్ధరాత్రి బుల్డోజర్లతో 750 ఇళ్లను కూలగొట్టారని అన్నారు. విద్యార్థుల హాల్ టికెట్లు ఉన్న ఇళ్లను కూడా కూల్చేశారని.. ఇప్పుడు ఆ విద్యార్థులు ఎగ్జామ్స్ ఎలా రాయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులందరినీ అంబేడ్కర్ భవన్‌లో పెట్టారని.. ఒక పశువు కొట్టంలోకి వారందరినీ తోలినట్లు తోలారని.. అక్కడ పిల్లలకు దద్దుర్లు వస్తున్నాయని.. వారి ఆరోగ్యం పాడయ్యే పరిస్థితి ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులంతా కూలీ పని చేసుకునే వాళ్లేనని.. ఎన్నో ఏళ్లు కష్టపడి ఇళ్లు కట్టుకుంటే నిమిషాల్లో కూల్చేశారని.. వారి పరిస్థితి చూస్తుంటే చాలా ఆవేదన కలిగిందన్నారు. వారికి కనీసం భోజనం కూడా పెట్టటం లేదని.. తినటానికి కూడా దాతలపై ఆధారపడే పరిస్థితి ఉన్నదన్నారు. అంబేడ్కర్ విగ్రహం సాక్షిగా నిరాహార దీక్ష చేస్తుంటే.. 600 మంది పోలీసులు వచ్చి తమను అరెస్ట్ చేశారని అన్నారు. తామేదో టెర్రరిస్టులం అన్నట్లుగా హైదరాబాద్‌కు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విశారదన్‌ను ఎక్కడకు తీసుకెళ్లారో తెలియదని.. ఆచూకీ తెలిశాక ఆయన సైతం పోరాటం చేస్తారని చెప్పారు.






