గజ్వేల్ నుంచి పోటీ చేస్తా: కవిత సంచలన నిర్ణయం

by Gantepaka Srikanth |

ఎక్కడ నుంచి పోటీ చేయాలనే నిర్ణయం ఇంకా తీసుకోలేదని.. సిద్దిపేటనే కాకుండా గజ్వేల్ మహిళలకు రిజర్వ్ అయినా అక్కడి నుంచి పోటీ చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

గజ్వేల్ నుంచి పోటీ చేస్తా: కవిత సంచలన నిర్ణయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఎక్కడ నుంచి పోటీ చేయాలనే నిర్ణయం ఇంకా తీసుకోలేదని.. సిద్దిపేటనే కాకుండా గజ్వేల్ మహిళలకు రిజర్వ్ అయినా అక్కడి నుంచి పోటీ చేస్తానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. శుక్రవారం జాగృతి భవన్‌లో మీడియా సమావేశం అనంతరం ఆమె చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మా ప్రథమ శత్రువు కాంగ్రెస్. మా పోరాటం ఆ పార్టీపైనే..’ అని అన్నారు. సిద్దిపేటలో రేవంత్‌రెడ్డి, గుంట నక్క మధ్య ఒప్పందం ఉన్నదన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నన్ని డబ్బులు తమ దగ్గర లేవని చెప్పారు. ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్‌రెడ్డి హైదారబాద్‌ను ఆగం చేస్తున్నారన్నారు. పార్టీ ఆవిర్భావ వేదికపై తమ ఎజెండా చెప్తామని.. తమ పార్టీ నాయకులతోపాటు ఉద్యమకారులు వేదికపై ఉండే అవకాశం ఉన్నదని చెప్పారు.

ఆవిర్భావ సభకు ఇతర పార్టీల నేతలను ఆహ్వానించడం లేదని.. పార్టీ ఆవిర్భావ సభకు ముందు, తర్వాత కూడా జాయినింగ్స్ ఉంటాయని తెలిపారు. తమ పార్టీలో యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని.. బీఆర్ఎస్ పార్టీ స్లీపింగ్ మూడ్‌లో ఉన్నదని అన్నారు. మహిళా రిజర్వేషన్లు తమకు, తమ పార్టీకి గొప్ప అవకాశమని తెలిపారు. గోవాలో 25 వేల మందికి ఒక ఎమ్మెల్యే ఉంటే.. మన దగ్గర 7 లక్షల మందికి ఒక ఎమ్మెల్యే ఉన్నారని అన్నారు. ఒక్కో రాష్ట్రంలో ఉన్న సీట్లలో 50 శాతం సీట్ల పెంపు ఎలా సహేతుకం అవుతుందని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి గతంలో మహారాష్ట్ర, బీహార్‌కు వెళ్లి ప్రచారం చేస్తే కాంగ్రెస్ ఓడిపోయిందని.. ఇప్పుడు కేరళలోనూ అలాంటి ఫలితమే వస్తుందని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారెంటీల అమలు గురించి ఆయన కేరళ ప్రజలకు చెప్పడం విడ్డూరంగా ఉన్నదన్నారు.

ఫీజుల దోపిడీ నుంచి రక్షించాలి...

ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు ఒకేసారి 30 శాతం నుంచి 40 శాతం ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రులను దోపిడీ చేస్తున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సెషన్ నిర్వహించి బిల్లు పాస్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల తల్లితండ్రులపై ప్రైవేట్ స్కూల్స్ అడ్డగోలుగా ఫీజుల భారం మోపుతున్నాయని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫీజుల నియంత్రణ చట్టం తేవటంలో విఫలమైందంటూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండి ఫీజుల నియంత్రణ చట్టం ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు అయినా ఇప్పటి వరకు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకువచ్చే ప్రయత్నమే చేయలేదన్నారు. విద్యా కమిషన్ చెత్త నివేదిక ఇచ్చిందని.. ఆ కమిషన్ ఇచ్చిన నివేదికలో ప్రైవేట్ స్కూళ్లు, జూనియర్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు చట్టం చేయాలనే సిఫార్సు మాత్రమే ఆమోదయోగ్యమైనదని తెలిపారు. ఫీజుల దోపిడీని ప్రోత్సహిస్తే బీఆర్ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్‌కు పడుతుందని హెచ్చరించారు. కార్పొరేట్, నార్త్ ఇండియన్ స్కూల్స్ ఏర్పాటుతో తెలంగాణ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా కాలేజీల యాజమాన్యాలు ఇక్కడి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డే విద్యాశాఖ మంత్రి కావడం మన ఖర్మ అన్నారు. విద్యావ్యవస్థ ఆగమవుతుంటే కనీసం రివ్యూ కూడా చేయటం లేదన్నారు.

Next Story