కచ్చితంగా ఇది అన్యాయం చేసే కుట్రే: కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో బీజేపీ మోసపూరితంగా వ్యవహరిస్తున్నదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.

కచ్చితంగా ఇది అన్యాయం చేసే కుట్రే: కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో బీజేపీ మోసపూరితంగా వ్యవహరిస్తున్నదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మహిళా కోటాకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన నేపథ్యంలో గురువారం ఆమె వీడియో సందేశం విడుదల చేశారు. ఈ బిల్లు అమలులో 2011 జనాభా లెక్కలను ప్రతిపాదికగా తీసుకుంటామని చెప్పటం మహిళా లోకాన్ని మోసం చేయటమేనన్నారు. ప్రస్తుతం చేపట్టే జనగణనలో ఓబీసీ గణన చేయాలని డిమాండ్ చేశారు. జనగణనలో కులం కాలం ఉన్నా వాళ్లు ఓబీసీలకు చెందుతారనే క్లాసిఫికేషన్ లేదని పేర్కొన్నారు. దీంతో బీసీల జనాభా ఎంత అనే లెక్క తేలదన్నారు. జనగణనలో ఓబీసీలను లెక్కించి ఆ తర్వాతే మహిళలకు చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. మహిళా కోటా విషయంలో బీజేపీ చేస్తున్న అన్యాయంపై పోరాటానికి బీసీ మహిళలంతా సిద్ధం కావాలని కవిత పిలుపునిచ్చారు.

మహిళా రిజర్వేషన్ల బిల్లు అమలు కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పార్లమెంట్ సమావేశాలకు ముందే డ్రాప్ట్ బిల్లును అన్ని పార్టీలకు ఇవ్వాలని కోరారు. లేదంటే అభ్యంతరాలు చెప్పే అవకాశం ఉండదన్నారు. బిల్లుపై చర్చ జరిగే రోజు ఉదయమే సభ్యులకు బిల్లు పత్రులను ఇస్తామని చెప్పడమంటే కచ్చితంగా ఇది అన్యాయం చేసే కుట్ర అని మండిపడ్డారు. డ్రాఫ్ట్ బిల్లును ముందే ఇచ్చే విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు దేశంలోని జాతీయ పార్టీల నేతలతో మాట్లాడతానని చెప్పారు. పార్లమెంట్‌లో మహిళ బిల్లు విషయంలో బీజేపీ వైఖరిని నిరసిస్తూ మహిళలకు న్యాయం చేసే విధంగా అన్ని పార్టీలు ఒక్కటవ్వాలని కోరారు. దేశంలో మహిళా రిజర్వేషన్ల బిల్లు రావటంలో జాగృతిది కీలక పాత్ర ఉన్నదని చెప్పారు.

Next Story