- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దందా ఆపకపోతే ఈడీకి ఫిర్యాదు చేస్తాం: కవిత హెచ్చరిక
సీఎం రేవంత్‌రెడ్డి జీహెచ్ఎంసీని అవినీతికి కేరాఫ్‌గా మార్చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.

దిశ, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్‌రెడ్డి జీహెచ్ఎంసీని అవినీతికి కేరాఫ్‌గా మార్చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. టెండర్లు లేకుండానే కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్ట్‌లను తన అనుచరులకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏలో జరుగుతున్న అవినీతిపై శుక్రవారం బంజారాహిల్స్‌లోని జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక దాదాపుగా రూ.1,148 కోట్ల కాంట్రాక్టులను నామినేషన్ పద్ధతిలో ఇచ్చారని చెప్పారు. రూ.5 లక్షలకు మించి ఉండే ఏ పని అయినా సరే టెండర్లు పిలవాల్సి ఉన్నా.. నిబంధనలు ఉల్లంఘిస్తూ కోట్ల రూపాయల పనులను టెండర్లు లేకుండానే కట్టబెడుతున్నారని ఆరోపించారు. ఇది తెలంగాణ స్టేట్ ఫైనాన్షియల్ కోడ్‌ను ఉల్లంఘించటమేనని చెప్పారు. టెండర్లు లేకుండా కాంట్రాక్ట్ ఇవ్వవద్దని 2023 లో ఏర్పాటైన కమిటీ కూడా స్పష్టం చేసిందని కవిత గుర్తు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.480 కోట్ల పనులను ఇదే విధంగా కట్టబెడితే.. రేవంత్‌రెడ్డి సర్కార్ దాన్ని కొనసాగిస్తూ రూ.1,148 కోట్ల పనులను తన అనుచరులకు నామినేషన్ పద్ధతిలో ఇచ్చిందని చెప్పారు. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు.
ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ఓ కంపెనీపై వేసిన సిట్ ఏమైందని ప్రశ్నించారు. సీఎంతో సిట్టింగ్ అవటంతో ఆ సిట్‌ను పత్తా లేకుండా చేశారా అని అనుమానం వ్యక్తం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డును కాంట్రాక్టర్ కు అప్పగించి...అక్కడి మెయింటెనెన్స్ ను ప్రభుత్వం చేస్తుండటం అత్యంత దారుణమని విమర్శించారు. జీహెచ్ఎంసీ అంటే గుంపు మేస్త్రీ అవినీతికి అడ్డా అన్నట్లు ఈ విభాగాన్ని తయారు చేశారని మండిపడ్డారు. హెచ్ఎండీఏ పరిధిలో రూ.35 వేల కోట్ల రూపాయల విలువైన భూములను అమ్మేసి.. హైదరాబాద్ అభివృద్ధికి రూపాయి కూడా ఖర్చు చేయలేదని చెప్పారు. పైగా తన అవినీతిని మరింత పెంచుకునేందుకు ఈ ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ అంటూ హంగామా చేస్తున్నారన్నారు. హైడ్రా పేరుతో ఇప్పటికే రియల్ ఎస్టేట్ వ్యాపారులను హడలెత్తించటమే కాకుండా స్క్వేర్ ఫీట్‌కు 150 రూపాయలంటూ వారి వద్ద వసూలు చేస్తున్నారని విమర్శించారు. వెంటనే ఈ బ్లాక్ మెయిల్ దందా ఆపకపోతే ఈడీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
కమీషన్ల కోసం కాళేశ్వరం మరమ్మతులు...
కాళేశ్వరం ప్రాజెక్ట్ మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావటాన్ని స్వాగతిస్తున్నామని కవిత చెప్పారు. అయితే.. కమీషన్ల కక్కుర్తి కోసం కాకుండా చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. కాళేశ్వరం ఫెయిల్ అయ్యిందని చెప్పేందుకు ఎనిమిదిన్నర లక్షల ఎకరాల భూమిని ఎండబెట్టిన కర్కోటక ప్రభుత్వం ఇది అని విమర్శించారు. కేవలం కమీషన్ల కోసమే కాళేశ్వరం మరమ్మతులను ఈ ప్రభుత్వం చేపడుతున్నట్టుగా తాను భావిస్తున్నానని అన్నారు. కాళేశ్వరం ప్రయోజనాలను రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు విషయంలో బీజేపీ మోసపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. 2027 జన గణన తర్వాతనే మహిళా బిల్లు అమలు చేయాలని.. అదే విధంగా ఓబీసీ మహిళలకు సబ్ కోటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై బీసీ మహిళలంతా కూడా పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. డ్రాఫ్ట్ బిల్లును పరిశీలిస్తామని.. అవసరమైతే ఢిల్లీకి కూడా వెళ్తామన్నారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ తన గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈ నెల 25న జరగనున్న పార్టీ ఆవిర్భావ సభ ఏర్పాట్ల పర్యవేక్షణకు 21 కమిటీలు వేశామని కవిత చెప్పారు. ఒక్కో కమిటీలో 30 మంది సభ్యులుంటారన్నారు. అదే విధంగా 500 మంది వాలంటీర్లు ఉంటారన్నారు.






