మహిళలను బీజేపీ మళ్లీ వంచించింది: మోడీ సర్కార్‌పై కవిత ఫైర్

by Gantepaka Srikanth |

లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు.

మహిళలను బీజేపీ మళ్లీ వంచించింది: మోడీ సర్కార్‌పై కవిత ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడంతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. ‘డీలిమిటేషన్ బిల్లుతో మహిళా బిల్లును కలపడంతోనే లోక్ సభలో వీగిపోయింది. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల బిల్లుపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని మరోసారి నిరూపితం అయ్యింది. ప్రతిపక్షాలు అడ్డుకుంటాయనే స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ బీజేపీ కుట్ర పూరితంగా రెండు బిల్లులను కలిపి పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చింది. మహిళా కోటా బిల్లుతో డెలిమిటేషన్ బిల్లును ముడి పెట్టడంతో ప్రతిపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి లోక్ సభలో బిల్లు వీగిపోయేలా చేశాయి. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ఈ ప్రయత్నం చేసింది. కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభం అప్పుడే మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టి పాస్ చేసి దానిని సెన్సెస్‌కు లింక్ చేశారు. ఇప్పుడు 2011 సెన్సెస్ అధారంగా మహిళా రిజర్వేషన్ల బిల్లు ప్రవేశ పెడుతున్నట్టు చెప్పి మరోసారి వంచించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలు బీజేపీ మోసాన్ని గుర్తించండి. పశ్చిమ బెంగాల్‌లో ఒక మహిళ నాయకత్వం వహిస్తోంది.. ఈ మోసకారి బీజేపీని ఓడించి ఆ మహిళను గెలిపించాలని బెంగాల్‌లో ఉన్న మీ ఫ్రెండ్స్‌కు చెప్పండి’ అని కవిత కీలక వ్యాఖ్యలు చేశారు.

Next Story