- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రైతుల భూములు రాయించుకుంటున్నారు’.. కల్వకుంట్ల కవిత కీలక డిమాండ్
రాష్ట్రంలో విత్తన పంటలు సాగు చేస్తున్న రైతుల సమస్యలను తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, సభ్యులను కలిసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వివరించారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో విత్తన పంటలు సాగు చేస్తున్న రైతుల సమస్యలను తెలంగాణ రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, సభ్యులను కలిసి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) వివరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. రైతులు 60 రకాల విత్తనాలను పండిస్తూ 'సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా'గా తెలంగాణను చేసేందుకు కృషి చేస్తున్నారు. కానీ వారికి 2007లో పాసైన కాంట్రాక్ట్ ఫార్మింగ్ అనే చట్టం ప్రకారం ఉండాల్సిన హక్కులు ఉండటం లేదు. రైతుకు మేలు చేసే విధంగా ఆ చట్టాన్ని వాడకోవటం లేదు. ముఖ్యంగా సీడ్ పత్తి రైతులకు ఇచ్చే అడ్వాన్స్‌ను కూడా ఇంటరెస్ట్ తీసుకుంటూ భూములు రాయించుకుంటున్నారు. జిల్లా కలెక్టర్లు, వ్యవసాయాధికారులు రైతుల పక్షాన నిలవటం లేదు. చట్టంలో ఉన్న లోటు పాట్లను సరిచేయాల్సిన అవసరం ఉంది. చాలా మంది సీడ్ పండిస్తున్న రైతులు మన రాష్ట్రంలో ఉన్నందున మంచి సీడ్ చట్టం రావాల్సి ఉంది. రైతు కమిషన్ చైర్మన్‌గా సీడ్ పండించే రైతులకు మంచి జరిగేలా మీరే చూడాలి. కరీంనగర్‌లో వరి సీడ్ పండిస్తున్న రైతులకు ఎకరానికి 75 వేలు ఇస్తున్నారు. కానీ గద్వాల్‌లో సీడ్ పత్తి పండించే రైతులకు అడ్వాన్స్, ఫెస్టిసైడ్స్‌కు ఇచ్చే డబ్బులకు కూడా భూమి తనఖా పెట్టించుకుంటున్నారు. పైగా 250 గ్రాముల తరుగు కూడా తీస్తున్నారు.
రూ.200 కోట్లు రావాల్సి ఉంది..
కరీంనగర్‌లో వరి సీడ్ పండించే రైతులకు ప్రొక్యూర్ చేసిన తర్వాత మిగిలిన వాటిని కమర్షియల్‌గా అమ్ముకునే ఫ్రీడమ్ ఉంది. కానీ గద్వాల్‌లో సీడ్ పత్తి రైతులను మల్టీ లెవల్‌లో మోసం చేస్తున్నారు. సీడ్ పత్తి ఆర్గనైజర్స్, మీడియేటర్లు రైతులను పట్టి పీడిస్తున్నారు. ఎకరానికి ఎంత ఇస్తారో చెప్పిన తర్వాత పంట వచ్చినా రాకపోయిన రైతులకు డబ్బులు ఇవ్వాలి. పంట రాకపోతే రైతులు పడే మానసిక ఆందోళనను కూడా పట్టించుకోవాలని చట్టంలో ఉంది. కానీ కంపెనీలు, ఆర్గనైజర్లు పట్టించుకోవటం లేదు. గద్వాల్ జిల్లాలో పరిస్థితిని మేము ప్రత్యక్షంగా చూడటం జరిగింది. కరీంనగర్‌లో వరికి ఎకరానికి 75 వేలు ఇచ్చినట్లే, గద్వాల్‌లో రైతులకు కూడా ఇప్పించాలి. సీడ్ ఇచ్చిన తర్వాత అది ఫెయిల్ అయితే దానికి రైతుకు సంబంధం ఉండకూడదు. కంపెనీ వాళ్లు ఇచ్చే సీడ్ ఫెయిల్ అయితే దానికి కంపెనీయే బాధ్యత వహించాలి. కానీ మీరు సరిగా నాటలేదంటూ రైతులను ఇబ్బంది పెడుతున్నారు. పైగా గద్వాల్ జిల్లాలో 10 వేల మంది సీడ్ పత్తి రైతులకు రూ. 2 వందల కోట్లు రావాల్సి ఉంది. మీరు జోక్యం చేసుకోని రైతులకు మంచి జరిగేలా చూడాలి. మోస్ట్ పాయిజన్ ఫెస్టిసైడ్స్ కూడా మన రాష్ట్రంలో బ్యాన్ కాలేదు. కనీసం వాటిని లిమిటెడ్ గా అమ్మేలా అయిన చర్యలు తీసుకోవాలి’ అని కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు.






