‘బీసీ రిజర్వేషన్లు అమలు కావాలంటే అదొక్కటే మార్గం’.. కవిత కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

టీచర్లకు ఇవ్వాల్సిన పీఆర్సీతో పాటు పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) డిమాండ్ చేశారు.

‘బీసీ రిజర్వేషన్లు అమలు కావాలంటే అదొక్కటే మార్గం’.. కవిత కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీచర్లకు ఇవ్వాల్సిన పీఆర్సీతో పాటు పెండింగ్ డీఏలను వెంటనే చెల్లించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) డిమాండ్ చేశారు. టీచర్ల గురించి గొప్పగా మాట్లాడే సీఎం రేవంత్ రెడ్డి కనీసం వారికి సమయానికి జీతాలు కూడా చెల్లిచంటం లేదని మండిపడ్డారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ (TJTF) ను కొత్తగా ఏర్పాటు చేశారు. ఫెడరేషన్ లోగోను జాగృతి కార్యాలయంలో కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్‌ను ఏర్పాటు చేయాలనే ఆలోచన 12 ఏళ్ల క్రితం నాటిదేనని చెప్పారు. అయితే ఇన్నాళ్లకు సమయం వచ్చిందన్నారు. తమ సంస్థ లైక్ మెండెడ్ పీపుల్‌తో కలిసి పనిచేస్తుందని చెప్పారు. తెలంగాణ జాగృతి ఏ విధంగా అందరితో కలిసి పనిచేసిందో అదే విధంగా పాత సంఘాలను కలుపుకొని TJTF పనిచేస్తుందని చెప్పారు.

టీచర్ల సమస్యలపై పోరాడటం మనందరి బాధ్యత

తన ఫేవరేట్ టీచర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని కవిత చెప్పారు. తెలంగాణ ఉద్యమ భావజాల వ్యాప్తిలో ఆయన మనందరికీ టీచర్ మాదిరిగా అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పారన్నారు. తెలంగాణ ఉద్యమంలో టీచర్లు కీలకంగా వ్యవహరించారని ఈ సందర్భంగా కవిత గుర్తుచేశారు. ఆనాటి ప్రభుత్వం నిర్భంధం ఉన్న సరే తెలంగాణ మ్యాప్, ప్రత్యేక క్విజ్ పోటీలు నిర్వహించి భావజాల వ్యాప్తికి కృషి చేశారని చెప్పారు. అలాంటి టీచర్ల సమస్యలపై పోరాటం చేయటం మనందరి బాధ్యత అని కవిత అన్నారు. TJTF టీచర్ల సమస్యలపై పోరాడుతుందన్నారు.

టీచర్లపై అడ్మినిస్ట్రేషన్ వర్క్ భారం

కాంగ్రెస్ ప్రభుత్వం టీచర్లపై అడ్మినిస్ట్రేషన్ భారం పెంచిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్ లైన్‌లో యాప్‌లు తీసుకొచ్చి పాఠాల కన్నా ఎక్కువ అడ్మినిస్ట్రేషన్ పని పెంచారన్నారు. టీచర్స్ గురించి గొప్పగా మాట్లాడే సీఎం వారి సమస్యలను మాత్రం ఎందుకు పట్టించుకోవటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీచర్స్‌కు పీఆర్సీ‌తో పాటు పెండింగ్‌లో ఉన్న 5డీఏలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. టీచర్స్‌కు హెల్త్ కార్డులు లేకపోవటం దారుణమని.. వారికి హెల్త్ కార్డులు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే కార్యాచరణ తీసుకుంటామన్నారు. కేజీబీవీ టీచర్స్‌కు రెండు నెలలుగా జీతాలు లేవని.. దీపావళి లోపైన వారికి జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. వారికి ఇతర టీచర్స్ మాదిరిగానే సమానంగా జీతాలు పెంచాలని కోరారు. గురుకులాల్లో టీచర్లకు హాస్టల్స్‌లో డ్యూటీలు వేయటంపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకోసం ప్రత్యేకంగా కేర్ టేకర్స్, వార్డెన్‌లను నియమించాలన్నారు. గురుకుల టీచర్లకు సోసైటీ నుంచి కాకుండా ప్రభుత్వం తరఫున జీతాలు చెల్లించాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన న్యూ పెన్షన్ స్కీమ్ ను రద్దు చేసి పాత పెన్షన్ స్కీమ్ నే అమలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. పీఈటీ టీచర్ల భర్తీతో పాటు ట్రైబల్ వెల్ఫేర్, సర్వశిక్షా అభినయ్ టీచర్లకు వెంటనే జీతాలు ఇవ్వాలన్నారు. 2010 కి ముందు రిక్రూట్ అయిన టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కవిత కోరారు.

రిటైర్డ్ ఉద్యోగుల బెన్ ఫిట్స్ వెంటనే చెల్లించాలి

రాష్ట్రంలో రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా తయారైందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్ మెంట్ బెనిఫిట్స్ రెండేళ్లు అవుతున్న ఇవ్వకుండా వారిని ఇబ్బందికి గురి చేయటమేమిటనీ ప్రశ్నించారు. ఇల్లు కోసమో, పిల్లల పెళ్లిల కోసమో రిటైర్ మెంట్ బెన్ ఫిట్స్ ను ఉపయోగించుకోవాలని ప్రతి ఉద్యోగి ప్లాన్ చేసుకుంటారని కానీ వాళ్లకు సమయానికి వాటిని అందించటం లేదని మండిపడ్డారు. ఈ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేశారని.. కానీ అప్పుడే 6 నెలలకైనా బెన్ ఫిట్స్ వచ్చేవని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం రెండేళ్లైనా ఉద్యోగులకు రిటైర్ మెంట్స్ బెన్ ఫిట్స్ ఇవ్వటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ ఎంపీలు పదవులు త్యాగం చేయాలే

బీసీ బంద్‌కు బీజేపీ మద్దతు తెలపటం పై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్లు ఇవ్వాల్సిన వాళ్లే ధర్నాలో పాల్గొంటే ఎలా అని ప్రశ్నించారు. కేంద్రంలో మోడీ సర్కార్ మైనార్టీలో ఉందని.. ఈ సమయంలో తెలంగాణ లోని 8 మంది బీజేపీ ఎంపీలు రిజైన్ చేస్తే బీసీ రిజర్వేషన్ల బిల్లు నడుచుకుంటూ వస్తదన్నారు. బీజేపీ ఎంపీలు పదవులను త్యాగం చేయాలని కవిత డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో కూడా కాంగ్రెస్ నాయకులు రాజీనామా చేస్తేనే ఉద్యమం హీటెక్కిందని గుర్తు చేశారు. బీజేపీ ఎంపీలు రిజైన్ చేయకపోతే వాళ్లపై ఒత్తిడి పెంచే కార్యక్రమం చేస్తామన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఇప్పటికే చాలా ధర్నాలు చేశామని.. ఇక జరగాల్సింది పొలిటికల్ ప్రాసెస్ మాత్రమేనని కవిత అన్నారు. లేదంటే తెలంగాణ ఉద్యమం మాదిరిగా బీసీ రిజర్వేషన్ల కోసం ఉద్యమం చేస్తామని చెప్పారు. 25 నుంచి జరిగే 'జనం బాట' కార్యక్రమంలో కూడా బీసీ నాయకులను కలిసి మాట్లాడుతామని చెప్పారు.

నా కొడుకు వయసు చిన్నది.. ఇప్పుడే రాజకీయాలు లేవు

బీసీ బంద్ కార్యక్రమంలో తన కుమారుడు పాల్గొనటంపై కవిత స్పందించారు. కేవలం సామాజిక బాధ్యత నేర్పే క్రమంలోనే తన కొడుకును ఇవ్వాళ్టి బీసీ బంద్ కార్యక్రమానికి తీసుకొచ్చానని చెప్పారు. బీసీల రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్నామంటే తాను పోరాటంలో పాల్గొంటానని అన్నాడన్నారు. మన ఇంటి నుంచే సామాజిక బాధ్యత నేర్పాలనే ఉద్దేశంతోనే బంద్ కార్యక్రమానికి తీసుకొచ్చానని చెప్పారు. తన కొడుకు వయసు చిన్నదని.. ఇప్పుడే రాజకీయాలు ఏమీ లేవని చెప్పారు. ముఖ్యమంత్రి కోటరీపై కొండా సురేఖ వ్యాఖ్యలపై తానేమీ స్పందించనని కవిత అన్నారు. నా కోటరీ తోనే డీల్ చేయటమే నాకు కష్టమవుతుందని... సంబంధం లేని అంశంపై ఏమీ మాట్లాడలేనని అన్నారు. కార్యక్రమంలోTJTF అధ్యక్షులు మోరం వీరభద్రరావు, అడ్ హక్ కమిటీ కమిటీ సభ్యులు ఘనపురం దేవేందర్, జాడి శ్రీనివాస్, తానిపర్తి తిరుపతి రావు, ఎం. కవిత, సుజాత, ఉపాధ్యాయులు ఈరవేణి రాజ్ కుమార్, విష్ణువర్ధన్, దుర్గములత, ఎస్ ఆర్ సతీష్ కుమార్, కే గంగరాజు, కోటగిరి గంగా ప్రసాద్, కంచరి రవికుమార్, చిట్యాల సుజాత, నాగమల్ల ఉమాదేవి, జీ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story