ఫీజుల దోపిడీకి చెక్.. కోర్టు ఆర్డర్స్ పాటించాల్సిందే!

by Ajay Maddhiboyina |

ప్రైవేట్ పీజీ మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఫీజుల పేరిట ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్ యూహెచ్ఎస్) తేల్చిచెప్పింది.

ఫీజుల దోపిడీకి చెక్.. కోర్టు ఆర్డర్స్ పాటించాల్సిందే!
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేట్ పీజీ మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఫీజుల పేరిట ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం (కేఎన్ఆర్ యూహెచ్ఎస్) తేల్చిచెప్పింది. పీజీ మెడికల్, డెంటల్ (2025–26) ఫీజుల వసూలు విషయంలో హైకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. ఈ మేరకు వర్సిటీ నుంచి గురువారం అన్ని కాలేజీల ప్రిన్సిపాల్స్‌కు స్పష్టమైన ఆదేశాలతో కూడిన సర్క్యులర్ జారీ అయ్యింది. అదనపు ఫీజుల బాదుడుపై పలువురు విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించగా.. న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

అయితే ఈ ఉత్తర్వుల అమలుపై హెల్త్‌కేర్ రిఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) ఇటీవల వర్సిటీ దృష్టికి తీసుకెళ్లింది. దీనిపై సానుకూలంగా స్పందించిన వర్సిటీ.. హైకోర్టు ఉత్తర్వులకు లోబడి మాత్రమే ఫీజులు వసూలు చేయాలని, లేదంటే కఠిన చర్యలు తప్పవని యాజమాన్యాలకు అల్టిమేటం జారీ చేసింది. తమ విజ్ఞప్తి మేరకు తక్షణమే స్పందించి, హైకోర్టు ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని సర్క్యులర్ జారీ చేసిన వర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ రమేశ్ రెడ్డికి హెచ్ఆర్డీఏ కృతజ్ఞతలు తెలిపింది. విద్యార్థుల హక్కులను కాపాడేందుకు, పారదర్శకమైన విద్యా విధానం కోసం తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని అసోసియేషన్ స్పష్టం చేసింది. వర్సిటీ తీసుకున్న ఈ చర్య విద్యార్థులకు ఎంతో ఊరటనిస్తుందని పేర్కొంది.

Next Story