బీఆర్ఎస్‌కు ‘కాళేశ్వరం’ టెన్షన్.. పార్టీ భవితవ్యంపై నీలినీడలు

by Kema Shiva Kumar |

బీఆర్ఎస్‌లో ఒక్కసారిగా అలజడి మొదలైంది.

బీఆర్ఎస్‌కు ‘కాళేశ్వరం’ టెన్షన్.. పార్టీ భవితవ్యంపై నీలినీడలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్‌లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ఆ పార్టీ అధినేత కేసీఆర్‌కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు పంపించడంపై రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ వాతావరణం కనిపించింది. ఏం జరుగుతున్నది..? ఏం జరగబోతున్నది..? అంటూ ఎక్కడ చూసినా ఇదే చర్చ వినిపిస్తున్నది. కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీశ్‌రావుకు సైతం నోటీసులు జారీ కావడం మరింత చర్చనీయాంశం అయ్యింది. వారిని వచ్చే నెలలో వరుసగా విచారణకు రమ్మని పిలవడంతో.. ఇద్దరు ఎంక్వయిరీకి హాజరవుతారా? లేదా? అన్నది ప్రశ్నగా మారింది.

7వ బ్లాకులో కుంగుబాటు

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేశారు. గతంలో కాంగ్రెస్ హయాంలో తుమ్మిడిహెట్టి దగ్గర నిర్మించతల పెట్టిన ప్రాణహితను కాళేశ్వరం వద్దకు షిఫ్ట్ చేశారు. దానికి సంబంధించి ప్లానింగ్, నిర్మాణాలు, డిజైన్లు తదితర వాటన్నింటినీ ఆయన నేతృత్వంలో జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే రూ.వేల కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు అక్టోబర్ 21, 2023న మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ మీటరున్నర వరకు భూమిలోకి కుంగింది. ఈ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని విచారణకు ఆదేశించింది. 2024 మార్చిలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి పీసీ ఘోష్ నేతృత్వంలో ఎంక్వయిరీ కమిషన్‌ ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఇప్పటివరకు కమిషన్ 109 మంది అధికారులు, నిర్మాణం, నిర్వహణ, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, పే అండ్ అకౌంట్స్, నీటిపారుదల, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులను విచారించింది. వారంతా తాము కేసీఆర్ సూచనల మేరకే నడుచుకున్నట్లు స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. ఈ మేరకు కమిషన్ కేసీఆర్‌తో పాటు అప్పటి నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌రావు, ఆర్థిక శాఖ మంత్రి అయిన ఈటల రాజేందర్‌కు నోటీసులు జారీ చేసింది.

విచారణకు హాజరయ్యేనా?

గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలైనప్పటి నుంచి కేసీఆర్ ఎర్రవెల్లిలోని ఫాంహౌజ్‌కే పరిమితం అయ్యారు. ఏడాదిన్నర కాలంగా ఆయన అక్కడే ఉండిపోయారు. మధ్యలో ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే ప్రజల్లోకి వచ్చారు. అయితే.. తాజాగా కాళేశ్వరం మీద కమిషన్ ఎంక్వయిరీకి ఆదేశించడంతో ఆయన విచారణకు హాజరవుతారా..? లేదా? అన్న ప్రశ్నలు కార్యకర్తల్లో వినిపిస్తున్నాయి. ఒకవేళ హాజరు కాకుంటే.. ప్రభుత్వం తదుపరి ఏం చర్యలు తీసుకోబోతున్నది? భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? అని కార్యకర్తలు ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నారు.

పార్టీ గడ్డు పరిస్థితి ఎదుర్కొనబోతోందా..

ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ముందు ముందు లోకల్ బాడీస్, మున్సిపల్ ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్‌కు నోటీసులు రావడంపై పార్టీ భవిష్యత్తు ఎలా ఉండబోతున్నదన్న చర్చ తీవ్రతరం అయింది. విచారణకు హాజరైతే కేసీఆర్ ఏ నిర్ణయాన్ని వెల్లడించబోతున్నారు? పార్టీ పట్ల ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారు? అనే చర్చ పార్టీ ఆఫీస్ వేదికగా వినిపించడం ఆసక్తికరంగా మారింది.

Next Story