Kaleswaram Project: కాళేశ్వరం డీపీఆర్, సర్వేకు రూ.679 కోట్లు! అడ్డగోలుగా బీఆర్ఎస్ సర్కార్ ఖర్చులు

by Kema Shiva Kumar |

కాళేశ్వరం ప్రాజెక్టులో పెట్టిన దుబారా ఖర్చులకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి

Kaleswaram Project: కాళేశ్వరం డీపీఆర్, సర్వేకు రూ.679 కోట్లు! అడ్డగోలుగా బీఆర్ఎస్ సర్కార్ ఖర్చులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టులో పెట్టిన దుబారా ఖర్చులకు సంబంధించిన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఈ ప్రాజెక్టును దాదాపుగా రూ.1.39 లక్షల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. ఇప్పటికే లక్ష కోట్లకు పైగా నిధులు డ్రా చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్, ల్యాండ్ సర్వేలకే రాష్ట్ర ప్రభుత్వం రూ.679 కోట్లను చెల్లించిందని ప్రభుత్వం గుర్తించింది. కాళేశ్వరం కమిషన్‌కు సంబంధించిన ఒక్కో లెక్కను బయటకు తీయగా గత బీఆర్ఎస్ చేసిన అడ్డుగోలు ఖర్చులు బయటికు వస్తున్నాయి. కేవలం సర్వే, డీపీఆర్‌లకే ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేయడంపై అనేక అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భారీ మొత్తంలో చెల్లింపులకు గల కారణాలపై నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. కేసీఆర్ హయాంలో ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును రీడిజైన్​చేశారు.

నిధుల వృథాపై నిపుణుల ఆరా..

ఇందులో మూడు బ్యారేజీలు మినహా మిగిలిన్నవింటినీ అప్పటికే ఉన్న రిజర్వాయర్ల సామర్థ్యాన్ని పెంచుకుంటూ పోయారు. కానీ, అక్కడ కొత్తగా ప్రతిపాదించింది ఏమీ లేదు. అయినప్పటికీ డీపీఆర్‌లకు రూ.679 కోట్లు వ్యయం కావడంపై నీటిపారుదల శాఖ అధికారులు షాక్ అవుతున్నారు.మూడు బ్యారేజీల స్థలం ఖరారు, నీటి లభ్యతను తెలుసుకోవడానికి రూ.679 కోట్ల ఖర్చు అవుతుందా? అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిధుల వృథా, త్వరత్వరగా పూర్తి చేసేందుకు ఎన్ని కోట్లు వృథా చేశారో అని నిపుణులు ఆరా తీస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు గత బీఆర్ఎస్ సర్కారుకు ఏటీఎంలా మారిందని చెప్పడానికి ఇంతకంటే ఆధారాలు ఇంకా ఏమి కావాలంటూ అధికార కాంగ్రెస్​ప్రశ్నిస్తున్నది. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంపై విచారణకు ఆదేశించిందని అధికార పార్టీ నేతలు గుర్తుచేస్తున్నారు.

27 నుంచి కమిషన్ మళ్లీ విచారణ

కాళేశ్వరం కమిషన్​ విచారణ ఈనెల 27 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. గతంలో విచారణకు హాజరైన ముగ్గురు నీటిపారుదల శాఖ కీలక అధికారులను తిరిగి విచారణకు పిలిచారు. వీరిలో ఈఎన్‌సీలు హరిరామ్, వెంకటేశ్వర్లు, నరేందర్​రెడ్డిలు ఉన్నారు. ఈ ముగ్గురు మరోసారి విచారణకు రావాలని కమిషన్​నోటిసులిచ్చింది. వీరి తర్వాత కంప్ట్రోలర్​ఆడిటర్​జనరల్​(కాగ్) అధికారులు, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావును సైతం మరోసారి విచారణకు పిలవాలని నిర్ణయించారు. వీరందరూ ఇప్పటికే ఒకసారి విచారణకు హాజరయ్యారు. గతంలో వీరంతా కమిషన్ ఎదుట​చెప్పిన సమాధానాలు, ఆ తర్వాత కమిషన్​సేకరించిన సమాచారానికి విరుద్ధంగా లిఖిత పూర్వక ఆధారాలు లభ్యమయ్యాయని తెలిసింది. దీంతో వీరిని మళ్లీ పిలిపించి గతంలో చెప్పిన జవాబులు, దొరికిన ఆధారాలు విరుద్ధంగా ఉండటంపై వారిని నిలదీసే అవకాశం ఉందని సమాచారం.

ఏప్రిల్‌లో నివేదిక..

కాళేశ్వరం కమిషన్​గడువును ప్రభుత్వం ఇటీవలే ఏప్రిల్​వరకు పొడగించగా.. కమిషన్ దానిపై విచారణ చేసి, నివేదికను ప్రభుత్వానికి అందించనున్నది. ఇప్పటికే విచారణ పూర్తి అవుతుందని అంచనా వేయగా విచారణ చేస్తున్న కొద్ది కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొత్త ఆధారాలు, నిధుల వినియోగం, పలువురు అధికారులను మరోసారి విచారణ చేయాల్సి రావడంతో ఆలస్యమవుతున్నట్లుగా తెలిసింది. విచారణ చేయడం, ఆ తర్వాత ఎప్పటికప్పుడు నివేదికను తయారు చేస్తున్నట్లు తెలిసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ తానే చెప్పుకున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​, నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీశ్​రావు, ఆర్థిక శాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌లను విచారిస్తారా? లేదా అనేది దానిపై ఇంకా సన్సెన్స్​కొనసాగుతూనే ఉన్నది.

Next Story