కాళేశ్వరం మరమ్మతులు చేపట్టాలి.. కొత్త ప్రాజెక్టులు వద్దు! సీఎంకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ

by Ramesh Naini |

రాష్ట్రంలో భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై కనీసం రెండేళ్లపాటు విరామం ప్రకటించాలని సీఎం రేవంత్‌రెడ్డికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి లేఖ రాశారు.

కాళేశ్వరం మరమ్మతులు చేపట్టాలి.. కొత్త ప్రాజెక్టులు వద్దు! సీఎంకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భారీ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంపై కనీసం రెండేళ్లపాటు విరామం ప్రకటించాలని సీఎం రేవంత్‌ రెడ్డికి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభ రెడ్డి లేఖ రాశారు. ప్రపంచవ్యాప్తంగా భారీ సాగునీటి ప్రాజెక్టుల అనుభవాలు ఆశాజనకంగా లేవని ఆయన పేర్కొన్నారు. భారీ పెట్టుబడులు, దీర్ఘకాల నిర్మాణ వ్యవధి, పర్యావరణ నష్టం, భూసేకరణ సమస్యలు, అవినీతి ఆరోపణలు వంటి అంశాలు ప్రతి భారీ ప్రాజెక్టుతో ముడిపడి ఉంటున్నాయని తెలిపారు. రాష్ట్రంలో కాలువల ద్వారా నీటి లభ్యత పెరగడం, ఉచిత విద్యుత్ ఆధారిత భూగర్భ జలాల వినియోగం అధికం కావడంతో రైతులు వరి సాగు వైపు మళ్లుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వరి అధికోత్పత్తి కారణంగా కొనుగోలు సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. నూనె గింజలు, పప్పుధాన్యాలు, ఉద్యానవన పంటల సాగు వైపు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించాలని సూచించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులపై లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం ఖర్చు చేసినప్పటికీ ఆశించిన ఫలితాలు కనిపించడం లేదని విమర్శించారు.

90 శాతం పూర్తయిన ప్రాజెక్టులను మాత్రమే కొనసాగించి, మిగతా ప్రాజెక్టులను తాత్కాలికంగా నిలిపివేయాలని సూచించారు. అలాగే ప్రభుత్వం ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును ప్రారంభించాలని యోచిస్తున్నట్లు తెలిసిందని.. 2006లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టుపై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తర్వాత దానిని నిలిపివేసి, 2014లో కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించారని గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ నిర్మాణ లోపాల కారణంగా అది ప్రస్తుతం పూర్తి స్థాయిలో పనిచేయడం లేదని తెలిపారు. ఈ పరిస్థితుల్లో కొత్తగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును చేపట్టడం అనవసరమని.. దాని బదులు కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతులు చేపట్టి తిరిగి పనిచేసేలా చేయాలని కోరారు.

Next Story