Jupalli: మాది కాదు మీదే దద్దమ్మ ప్రభుత్వం.. కేసీఆర్ కు జూపల్లి కౌంటర్

by Prasad Jukanti |

బీఆర్ఎస్ పూర్తిగా బలహీనమైందనే కేసీఆర్ బయటకు వచ్చారని మంత్రి జూపల్లి విమర్శించారు.

Jupalli: మాది కాదు మీదే దద్దమ్మ ప్రభుత్వం.. కేసీఆర్ కు జూపల్లి కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ బలహీనమైందని గ్రహించే ఇక ప్రతిష్ట కాపాడుకోవడం కోసమే బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చారని మంత్రి జూపల్లి కృష్ణరావు ఆరోపించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ రెండేళ్ల పాలనకు రిఫరెండం అని చెప్పారు. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసి పని చేశాయి. ఈ రెండు పార్టీలు కలిసి పని చేసినా మూడింట ఒక వంతు సీట్లు కూడా రాలేదు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు ఆరోపణలు తప్పు అని ప్రజలు తీర్పు ఇచ్చారు. దీంతో పార్టీని కాపాడుకోవడం కోసమే బయటకు వచ్చారు తప్ప పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయం ఏమి కాదని ఎద్దేవా చేశారు. ఇవాళ గాంధీ భవన్ లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరితో కలిసి మీడియాతో మాట్లాడిన జూపల్లి.. నిన్న కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

మాది కాదు మీది దద్దమ్మ ప్రభుత్వం:

రెండేళ్ల తర్వాత బయటకు వచ్చిన కేసీఆర్ వచ్చి రాగానే తోలు తీస్తానని చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ కండలు కరిగిపోయి తోలు మాత్రమే మిగిలిందని సెటైర్ వేశారు. వందలాది మంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో బాధ్యతారాహిత్యమైన పరిపాలన చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన మీదే దద్దమ్మ ప్రభుత్వం అని కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం సమర్ధత ప్రభుత్వం కాబట్టే ఇన్ని అప్పులకు వడ్డీలు కడుతూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలో రెండేళ్ల అయిందని మాకు మరో మూడేళ్ల సమయం ఉందన్నారు. యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వ కక్షపూరిత చర్యలే కారణం అన్నారు.

పదేళ్లు ఎందుకు పూర్తి చేయలేదు?:

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కుర్చి వేసుకుని కట్టిస్తామని చెప్పిన కేసీఆర్ పదేళ్లు పాలించి ఎందుకు పూర్తి చేయలేదని జూపల్లి ప్రశ్నించారు. రూ.8 లక్షల కోట్లు అప్పులు చేసినా కేసీఆర్ ఎకరా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డిని సుప్రీంకోర్టులో తాగునీటి ప్రాజెక్టు అని కేసు వేసిన కేసీఆర్ ఇప్పుడు సాగునీటి ప్రాజెక్టు అని అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. 299 టీఎంసీలు చాలు అని నాడు కేసీఆర్ ఎలా సంతకం పెట్టారని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో ప్రధాన కాలువలు కూడా పూర్తి చేయలదేని మీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని దద్దమ్మలెవరు అని ప్రశ్నించారు. 2023 ఎన్నికల వేళ ఒక మోటార్ ఆన్ చేసి పాలమూరు ప్రాజెక్టు జాతికి అంకితమన్నారు. నీటి కేటాయింపులు, అనుమతులు లేకుండా ప్రాజెక్టును ఎలా అంకితమిచ్చారని ప్రశ్నించారు. పాలమూరు ప్రాజెక్టు డీపీఆర్ తిరస్కరించినట్లు కేసీఆర్ ఆరోపిస్తున్నారు. గత కాంగ్రెస్ పాలనలోనే జూరాల నుంచి 70 టీఎంసీలకు మంజూరైందన్నారు.

పాలమూరు ప్రాజెక్టు పూర్తి కావాలంటే మరో రూ. 40-50 వేల కోట్లు కావాలని పర్యావరణ అనుమతులు తీసుకుంటే మన నీళ్లు మనం వాడుకునే పరిస్థితి ఉందన్నారు. ఈ ప్రాజెక్టు సాగుకు కాదు తాగునీటి కోసమని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తాగునీటి కోసం పనులు మొదలు పెట్టవచ్చని 2025లో కోర్టు తీర్పు చెప్పింది. ఇరు రాష్ట్రాలు కలుపుకుని 811 టీఎంసీలు అని విభజన చట్టంలో ఉంది. నదీ పరివాహక ప్రాంతం ఉన్నంత మేరకు నీటి కేటాయింపులు జరగాలి. రాష్ట్రానికి ర299 టీఎంసీలు చాలు 512 టీఎంసీలు ఏపీ వాడుకోవాలని పదేళ్లు కేసీఆర్ వదిలేశారని ఆరోపించారు.

Next Story