రిజ్వీ వర్సెస్ జూపల్లి.. కేబినెట్ భేటీకి ముందు హుటాహుటీన భట్టి వద్దకు జూపల్లి

by Prasad Jukanti |

కేబినెట్ భేటీకి ముందు మంత్రి జూపల్లి భట్టి విక్రమార్క వద్దకు వెళ్లడం హాట్ టాపిక్‍గా మారింది.

రిజ్వీ వర్సెస్ జూపల్లి.. కేబినెట్ భేటీకి ముందు హుటాహుటీన భట్టి వద్దకు జూపల్లి
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సీనియర్ ఐఏఎస్ సయ్యద్‌అలీ ముర్తజా రిజ్వీ వర్సెస్ మంత్రి జూపల్లి కృష్ణారావు లేఖ (Rizvi vs Jupally controversy) వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. వ్యక్తిగత కారణాలు చూపుతూ రిజ్వీ వీఆర్ఎస్ తీసుకోగా, రిజ్వీ అవినీతిపరుడైన అధికారి అని ఆయనపై విచారణ చేపట్టాలని సీఎస్‍ను కోరుతూ జూపల్లి రాసిన లేఖ బహిర్గతం అయింది. దీంతో ఈ వ్యవహారంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ కాంగ్రెస్‍ను కార్నర్ చేస్తోంది. ఈ క్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో (Bhatti Vikramarka) భేటీ అయ్యారు. ఇవాళ ప్రజా భవన్‍లో భట్టిని కలిసిన జూపల్లి.. రిజ్వీపై తాను రాసిన లేఖ, తాజా పరిణామాలపై వివరించారు. ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ, ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ తమ పరిధి దాటి వ్యవహరించారని మంత్రిగా తన ఆదేశాలను ఎక్సైజ్ కమిషనర్ కూడా పట్టించుకోలేదని భట్టికి వివరిచినట్లు మాచారం. అయితే మరికాసేపట్లో సెక్రటేరియట్‍లో కేబినెట్ భేటీ (Telangana cabinet meeting) జరగబోతోంది. ఈ భేటీకి ముందు ఇరువురు భేటీ కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.

కేబినెట్ నిర్ణయంపై ఉత్కంఠ:

రిజ్వీ అంశాన్ని బీఆర్ఎస్ తమకు అనుకూలంగా మలుచుకుంటోంది. కాంగ్రెస్ నేతలు రౌడీయిజం, గూండాయిజం చేస్తున్నారంటూ కేటీఆర్ ఈ అంశంపై స్పందిస్తూ అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు. ఐఏఎస్, ఐపీఎస్‍లను కూడా బెదిరిస్తున్నారంటూ ఆరోపించారు. అలాగే నిజాయితీపరుడంటూ రిజ్వీకి కేటీఆర్ సర్టిఫికెట్ సైతం ఇచ్చేశారు. ఈ వ్యవహారం ప్రతిపక్షాలకు ఆయుధంగా మారే అవకాశం ఉండటంతో ఇవాళ జరగనున్న కేబినెట్ భేటీలో ఈ విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోబోతున్నారా? అందులో భాగంగానే హుటాహుటీన భట్టి విక్రమార్క వద్దకు మంత్రి జూపల్లి వెళ్లారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Next Story