- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీఆర్ఎస్‌ను భయపెడుతోన్న ‘జూన్’.. ఇదే నెలలో వరుస ఎంక్వైరీలు
రాష్ట్రంలో అత్యంత ఆసక్తికరంగా మారిన మూడు అంశాల్లో బీఆర్ఎస్‌కు చెందిన ముగ్గురు కీలక నేతలు ఈ నెలలో విచారణను ఎదుర్కోనున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అత్యంత ఆసక్తికరంగా మారిన మూడు అంశాల్లో బీఆర్ఎస్‌కు చెందిన ముగ్గురు కీలక నేతలు ఈ నెలలో విచారణను ఎదుర్కోనున్నారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా రేస్ అంశాల్లో ప్రభుత్వం తరఫున విచారణ జరగనుంది. కాళేశ్వరం అంశంలో మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు హరీశ్ రావు, ఈటల రాజేందర్, ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు, ఫార్ములా ఈ కారు రేస్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణను ఎదుర్కొనున్నారు. దీంతో జూన్‌ను ‘ఎంక్వయిరీ మాసం’గా వర్ణిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతున్నది.
‘కమిషన్’ ముందు కేసీఆర్!
కాళేశ్వరం విచారణలో భాగంగా ఈ నెలలోనే ముగ్గురు కీలక వ్యక్తుల నుంచి కమిషన్ సమాచారాన్ని సేకరించనున్నది. ఈనెల 5న విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ కు కమిషన్ సూచించింది. ఈ నెల 6న బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, 9న మాజీ మంత్రి హరీశ్ రావులు హాజరు కావాలని వారికి నోటీసులు జారీ చేసింది. వీరు ముగ్గురు కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో కీలక హోదాల్లో ఉన్నారు. దీంతో వారి పాత్రపై విచారణ చేయనున్నారు. కాగా, ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ విచారణను ఎదుర్కొన్న అధికారులు మాజీ సీఎం కేసీఆర్ పేరును ప్రస్తావించారు. దీంతో కమిషన్ ఎదుట తొలిసారిగా ఆయనే హాజరవుతున్నందున.. కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.
ప్రభాకర్ రావు స్టేట్‌మెంట్‌పై ఉత్కంఠ
సీఎంగా కేసీఆర్, ఎస్ఐబీ చీఫ్‌గా ప్రభాకర్ రావు ఉన్నప్పుడు పలువురి ఫోన్లను ట్యాప్ చేశారని ఆరోపించిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే ఈ అంశంపై విచారణకు ఆదేశించింది. సిట్ దర్యాప్తునకు హాజరైన పోలీసు అధికారులు చాలా మంది ప్రభాకర్ రావు పేరును ప్రస్తావించారు. ఆయన ఆదేశాల ప్రకారమే ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పారు. అయితే అప్పటికే ప్రభాకర్ రావు అమెరికా వెళ్లిపోయారు. 14 నెలల నుంచి అక్కడే ఉన్నారు. దీంతో ప్రభాకర్ రావును ఆమెరికా నుంచి రప్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆయన పాస్ పోర్టును రద్దు చేయించి, రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయించింది. మరోవైపు అమెరికా ప్రభుత్వం తీసుకువస్తున్న నిబంధనలతో ఆయన భారతదేశానికి రాకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రభాకర్ రావు చివరికి సుప్రీంకోర్టును ఆశ్రయించి పాస్ పోర్టు పొందారు. ఈ నెల 5న సిట్ విచారణకు హాజరవుతానంటూ సమాచారం అందించారు. అయితే, విచారణలో ప్రభాకర్ రావు ఎలాంటి స్టేట్ మెంట్ ఇస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఆయన ఎవరి పేరు చెబుతారనేది ఆసక్తికరంగా మారింది. అప్పటి సీఎం కేసీఆర్, అప్పటి డీజీపీ లేదా ఇతర పోలీసు ఉన్నతాధికారుల పేర్లు చెబుతారా? అనే చర్చ జరుగుతున్నది. పోలీసు శాఖలో తన కంటే ఉన్నతాధికారులున్నా.. తననే ప్రధాన నిందితుడిగా చూపించడం ఏమిటని ఆయన కొన్ని రోజులుగా ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ కేసు ఎటు నుంచి ఎటు వైపు వెళ్తుందనేది ఉత్కంఠగా మారింది.
ఈ ఫార్ములా రేస్ కేసులో కేటీఆర్..
ఈ ఫార్ములా కారు రేసు కేసులో మాజీమంత్రి కేటీఆర్‌ను పోలీసులు విచారించనున్నారు. మే 28న విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. అయితే, ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాలకు హాజరుకావాల్సి ఉన్నందున.. హైదరాబాద్‌కు రాగానే విచారణకు హాజరవుతానని కేటీఆర్ సమాధానం చెప్పారు. దీంతో ఆయనకు మరో తేదీని సూచిస్తూ త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నారు. గతంలో విచారణకు హాజరైనప్పుడే కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారంటూ ప్రచారం జరిగింది. అయితే, అలాంటిదేమీ జరగలేదు. ఈసారి విచారణ తరువాత అరెస్ట్ చేసే అవకాశాలు లేకపోలేదని ప్రచారం జరుగుతున్నది. ఫార్ములా ఈ కార్ రేస్‌లో ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, మాజీ మంత్రి కే తారక రామారావులే కీలకం. ఈ నేపథ్యంలో విచారణలో పోలీసులు ఏం తేల్చనున్నారో ఆసక్తికరంగా మారింది.






