నెలాఖరులో జూబ్లీహిల్స్ బైపోల్ నోటిఫికేషన్..! అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం

by Kema Shiva Kumar |

ఈ నెలాఖరులో జూబ్లీహిల్స్ బైపోల్ నోటిఫికేషన్ విడుదల కానుందని, ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సంకేతాలు అందినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

నెలాఖరులో జూబ్లీహిల్స్ బైపోల్ నోటిఫికేషన్..! అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకం
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెలాఖరులో జూబ్లీహిల్స్ బైపోల్ నోటిఫికేషన్ విడుదల కానుందని, ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సంకేతాలు అందినట్లు అధికార వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఇప్పటికే తుది ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేసిన ఈసీ.. ఈనెల మూడో వారంలో ఫైనల్ ఓటరు లిస్టును రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తున్నది. ఆ తర్వాత ఏ క్షణమైన ఉపఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే, దీపావళి తర్వాత పోలింగ్ జరిగే అవకాశం ఉంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపినాథ్ మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆ సెగ్మెంట్‌లో విజయం కోసం అన్ని ప్రధాన పార్టీలు ఫోకస్ పెట్టాయి.

నవంబరు 7లోపు ఫలితం..

బిహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జూబ్లీహిల్స్ బై పోల్ షెడ్యూలు విడుదల కానుంది. అక్కడ రెండు లేదా మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించే చాన్స్ ఉంది. సాధారణంగా ఉప ఎన్నికలను చివరి దశ పోలింగ్‌తో నిర్వహించే సంప్రదాయం కొనసాగుతున్నది. దీంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దీపావళి తర్వాత జరిగే అవకాశం ఉంటుదని చర్చ ఆఫీసర్లలో ఉంది. ఫలితం మాత్రం నవంబరు తొలి వారంలో ప్రకటించాల్సి ఉంటుంది. ఎందుకంటే బిహార్ అసెంబ్లీ నవంబరు 7 లోపు ఏర్పడాలి. అందుకని ఈసీ ఈలోపే పోలింగ్ పూర్తి చేసి రిజల్ట్ ప్రకటించేందుకు కావాల్సిన క్యాలండర్‌ను తయారు చేస్తున్నట్లు తెలిసింది. ‘ఉపఎన్నికల కోసం మేం అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే ముసాయిదా ఓటరు లిస్టును రిలీజ్ చేశాం. ఈనెల 23 తర్వాత ఫైనల్ ఓటరు లిస్టు ప్రకటిస్తాం. అనంతరం ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయొచ్చు’ అని ఎన్నికల సంఘంలోని ఓ సీనియర్ ఆఫీసరు వెల్లడించారు.

మూడు పార్టీలకు చాలెంజ్

జూబ్లీహిల్స్ ఎన్నిక కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చాలెంజ్‌గా మారింది. ఈ ఎన్నికల్లో గెలిచిన పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో శాసించనుంది. త్వరలో జరుగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సొంతం చేసుకుని, మేయర్ సీటును కైవసం చేసుకోడానికి కావాల్సిన బూస్టింగ్ ఈ ఎన్నిక ద్వారా వస్తుందని పార్టీలు అంచనా వేస్తున్నాయి. మూడు ప్రధాన పార్టీలు జూబ్లీహిల్స్‌లో గెలుపు కోసం ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నాయి. అందుకోసం కాంగ్రెస్ బలమైన అభ్యర్థిని బరిలోకి దించేందుకు కసరత్తు చేస్తున్నది. పలువురి పేర్లను పరిశీలించిన కాంగ్రెస్ చివరికి స్థానికంగా పట్టున్న ఓ బీసీ లీడరు పేరును ఖరారు చేసినట్లు తెలుస్తున్నది.

కాంగ్రెస్ ముందంజ..

ఈ మధ్య సీఎం రేవంత్ జూబ్లీహిల్స్ ఎన్నికపై రివ్యూ చేసి అక్కడ పట్టున్న బీసీ నేతను పోటీకి రెడీగా ఉండాలని సంకేతాలు ఇచ్చినట్లు తెలిసింది. బీఆర్ఎస్ నుంచి గోపినాథ్ భార్య సునితకు టికెట్ ఇస్తున్నట్లు ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ సంకేతాలు ఇచ్చారు. ఇక బీజేపీ నుంచి మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు విజయలక్ష్మి, లంకెల దీపక్ రెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. జూబ్లీహిల్స్ గెలుపు కోసం కాంగ్రెస్ చాలా కాలంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నది. ముగ్గురు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, వివేక్‌కు ఇన్‌చార్జి బాధ్యతలను అప్పగించారు. వీరంతా రెగ్యూలర్‌గా నియోజకవర్గంలో పర్యటిస్తూ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. దీంతో ఈనెల రోజుల్లో కాంగ్రెస్ గ్రాఫ్ పెద్ద ఎత్తున పెరిగిందని, పలు సంస్థలు నిర్వహించిన రిపోర్టులో వెల్లడైనట్లు మంత్రులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Next Story