- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీకి సవాలుగా జూబ్లీహిల్స్ బై పోల్.. ఆ ఇద్దరికీ అగ్ని పరీక్షే!
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బీజేపీకి కొత్త టెన్షన్ పుట్టిస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బీజేపీకి కొత్త టెన్షన్ పుట్టిస్తోంది. ఈ ఎన్నికలో గెలుపు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుకు ఓ పరీక్షగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కిషన్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్లోక్సభ పరిధిలోనే జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉన్నది. కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్న ఆయన.. తన లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో జరిగే ఉపఎన్నికలో పార్టీ అభ్యర్థిని గెలిపించుకోలేకపోతే ఓ వైపు పార్టీలో, మరో వైపు కేంద్రం పెద్దల వద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాబోయే జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లోనూ దీని ప్రభావం పడుతుందని టెన్షన్ పడుతున్నట్టు సమాచారం. దీంతో ఈ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిని గెలిపించుకోవడం కేంద్రమంత్రికి సవాల్‌గా మారనుంది. అందుకే ఆయన ప్రతి శని, ఆదివారాల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటిస్తున్నట్టు తెలిసింది. అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు పార్టీ కేడర్‌ను కలిసి వారిని ఎన్నికకు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
బీజేపీ స్టేట్ చీఫ్‌కు సైతం పరీక్షే..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్ రావు నియామకమైన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక ఇది. ఈ స్థానంలో పార్టీ అభ్యర్థి గెలవడం లేదంటే ఎన్ని ఓట్లు సాధించారనే అంశం స్టేట్ చీఫ్ పనితీరుకు కొలమానంగా నిలవనుంది. ఆయన నియామకంపై పార్టీ కేడర్‌లో ఇప్పటికే తీవ్రస్థాయిలో నిరాశ, నిస్పృహ నెలకొంది. ఈ నేపథ్యంలో ఫలితం ఏమైనా తారుమారైతే ఆయనపై విమర్శలకు మరింత బలం చేకూరుతుందని పార్టీ నాయకులు అభిప్రాయపడుతున్నారు. జూబ్లీహిల్స్ బై పోల్ కోసం ఆయన ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించారు. బూత్ స్థాయి కేడర్‌లో కదలిక తీసుకువచ్చే పనిలో ప్రస్తుతం నిమగ్నమైనట్టు తెలుస్తున్నది.
గత ఎన్నికల్లో మూడో స్థానానికే పరిమితం..
గత ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన దీపక్ రెడ్డి 25,866 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. దీంతో తాము గతం కన్నా బలపడ్డామని పార్టీ అంచనా వేసింది. ఈ సారి గతం కన్నా ఎక్కువ ఓట్లు వస్తాయని, విజయం సాధిస్తామనే ధీమాను వ్యక్తం చేస్తున్నది. అదంతా బయటకే అయినా.. లోలోపల మాత్రం వారిని భయం వెంటాడుతున్నది. గత ఎన్నికలకు, ఇప్పటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ట్రెండ్స్ ఆధారంగా పార్టీలకు ఓట్లు పడతాయని, ఉపఎన్నికల్లో ఓటింగ్ప్రత్యేకంగా ఉంటుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. గత టర్మ్‌లో దుబ్బాక, హుజురాబాద్‌లో వెలువడిన ఫలితాలను అందుకు ఉదాహరిస్తున్నారు.
అవకాశం సద్వినియోగం చేసుకుంటారా?
ప్రస్తుతం ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బీజేపీకి ఎమ్మెల్యేలు లేరు. ఉన్న ఒక్క ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అధిష్టానం పార్టీ నుంచి సస్పెండ్‌చేసింది. కీలకమైన జీహెచ్‌ఎంసీ పరిధిలో కమలం పార్టీ మూడు లోక్‌సభ స్థానాల్లో గెలుపొందింది. బీజేపీకి ఎమ్మెల్యే సీటు గెలవడం కన్నా ఎంపీ సీట్లు గెలవడం సులవుని టాక్ ఉంది. ఎందుకంటే ఆ పార్టీ నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రమే సీరియస్‌గా పనిచేస్తారని ప్రచారంలో ఉన్నది. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే చెబుతున్నట్లు తెలిసింది. ఎంపీ స్థానాల్లో గెలవడంపై ఉన్న శ్రద్ధ మిగిలిన ఎన్నికలపై ఉండదని సొంత పార్టీ నాయకులే బహిరంగంగా విమర్శిస్తున్నారు. దీంతో ఇప్పుడు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారా..లేదా? అనేది చూడాలి.






