టెన్షన్ పెట్టిస్తున్న జూబ్లీహిల్స్ బై పోల్.. ఎన్నికల అధికారికి BRS ఫిర్యాదుల పర్వం

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-11 04:32:25  IST  )

జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై బీఆర్ఎస్‌లో కలవరం మొదలైనట్లు కనిపిస్తోంది.

టెన్షన్ పెట్టిస్తున్న జూబ్లీహిల్స్ బై పోల్.. ఎన్నికల అధికారికి BRS ఫిర్యాదుల పర్వం
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉపఎన్నికపై బీఆర్ఎస్‌లో కలవరం మొదలైనట్లు కనిపిస్తోంది. నేడు ఈ నియోజకవర్గానికి పోలింగ్ జరుగుతుండగా.. గెలుపోటములపై గులాబీ పార్టీలో నేతలు మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తున్నది. అందులో భాగంగానే నిత్యం ఎన్నికల అధికారి వద్దకు పరుగులు పెట్టారనే చర్చ జరుగుతున్నది. ఓ వైపు ఓటమి భయం.. మరోవైపు పార్టీ భవిష్యత్తుపై ఆలోచనతో నిత్యం అధికార పార్టీపై ఫిర్యాదు చేసేందుకే నేతలు ఆసక్తి చూపారు. కేవలం రాష్ట్ర ఎన్నికల అధికారికే కాకుండా.. ఏకంగా ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం అధికార కాంగ్రెస్ పార్టీపై వరుసగా ఫిర్యాదులు అందించారు.

అధికారులు పట్టించుకోవడం లేదని..

ఉపఎన్నికలో అధికారులు, పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని బీఆర్ఎస్ నేతలు ముందు నుంచీ ఆరోపిస్తున్నారు. అయితే.. ఆ ఆరోపణలు కేవలం మాటలకే పరిమితం కాకుండా ఏకంగా ఎన్నికల సంఘానికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారితోపాటు ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి సైతం ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీలు ఢిల్లీలో ఫిర్యాదు లేఖను అందించారు. అయితే.. స్థానిక పోలీసులు, అధికారులను టార్గెట్ చేస్తూ వీరి ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. స్థానిక పోలీసులకు, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అటు అధికార పార్టీ నేతలు ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తున్నారంటూ పేర్కొన్నారు. అంతేకాకుండా స్థానిక పోలీసులపై నమ్మకం లేదని.. కేంద్ర బలగాలను ఎన్నికల విధుల్లోకి దింపాలని విజ్ఞప్తులు చేశారు.

ఎందుకింత ఆందోళన?

అయితే.. బీఆర్ఎస్ రోజుకు రెండు మూడు బృందాలు కలిసి ఫిర్యాదులు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చీటికిమాటికి అధికార పార్టీ మీద ఫిర్యాదులు చేయడం.. అధికారులు, పోలీసులను లక్ష్యంగా చేసుకొని కంప్లయింట్స్ ఇవ్వడంపై పార్టీలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. బీఆర్ఎస్ పార్టీకి ఓటమి భయం పట్టుకున్నదా? అన్న అనుమానాలూ వ్యక్తం చేశారు. పోలింగ్ ముందు రోజు కూడా ఎన్నికల సంఘాన్ని కలవడంపై చర్చకు దారితీసింది.

READ MORE ....

జూబ్లీహిల్స్ బై పోల్ అప్‌డేట్.. 11 చోట్ల ఈవీఎంల మొరాయింపు

Next Story