ఉపఎన్నిక సీఎం రేవంత్​రెడ్డికి జీవన్మరణ సమస్య : దాసోజు శ్రవణ్

by Naga Rani Yarlagadda |

సీఎం రేవంత్​రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం ఘన విజయంగా చూపించుకోవడం..

ఉపఎన్నిక సీఎం రేవంత్​రెడ్డికి జీవన్మరణ సమస్య : దాసోజు శ్రవణ్
X
  • మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పెద్ద సంఖ్యలో మోహరింపు
  • రేవంత్​రెడ్డిని కాదని, నవీన్​యాదవ్​ను చూసి జనం ఓట్లు వేశారు
  • రాజకీయ కూటములే కాంగ్రెస్ గెలుపుకు కారణం

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్​రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం ఘన విజయంగా చూపించుకోవడం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్​ఆరోపించారు. ఉప ఎన్నికల్లో అధికార పార్టీ గెలవడం సర్వసాధారణమని దీనిని ప్రజల ఆమోదంగా చెప్పుకోవడం అవివేకమన్నారు. ఈ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డికి జీవన్మరణ సమస్యగా మారడంతో 15 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, డీజీపీ వరకు యంత్రాంగం మోహరించిందని మండిపడ్డారు. శనివారం తెలంగాణ భవన్​లో మీడియా మాట్లాడుతూ ఎన్నికల్లో జరిగిన అవకతవకలు బీహార్, రాయలసీమ, పాతబస్తీ లాంటి ప్రాంతాల్లో కనిపించిన విధంగానే ఉన్నాయని తెలిపారు. ఆడబిడ్డపై దాష్టీకం జరగడం నుండి రూ. 200 కోట్ల వరకు ఖర్చు పెట్టడం వరకు ప్రతి దశలో అధికార దుర్వినియోగం జరిగిందన్నారు.

ప్రజలు రేవంత్ రెడ్డిని కాదని, నవీన్ యాదవ్‌ను చూసి ఓటు వేశారన్నారు. 2023లో ఓడిపోయిన అజహారుద్దీన్‌కు టిక్కెట్ ఇవ్వకపోవడం, రాష్ట్రం మొత్తం ప్రచారం చేసిన గద్దర్‌ను కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో పక్కనపెట్టడం కాంగ్రెస్‌లో జరుగుతున్న అసలు రాజకీయాలని విమర్శించారు. కాంగ్రెస్‌లో రేవంత్ రెడ్డి మిత్రులకు మాత్రమే టిక్కెట్లు, పదవులు లభిస్తున్నాయని, సీనియర్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, నదీమ్ జావేద్ వంటి నాయకులను సహించలేకపోతున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలతో, నాయకులతో అవమానకర పదజాలం ఉపయోగించడం అతని అహంకారానికి నిదర్శనమని అన్నారు.బండి సంజయ్‌తో కుమ్మక్కై బీజేపీ ఓట్లు కాంగ్రెస్‌కు మళ్లించారని, అసదుద్దీన్ ఒవైసీని బ్రతిమిలాడి బోగస్ ఓట్లు వేసేలా చేసి గెలుపు సాధించారని ఆరోపించారు. బీహార్‌లో ఇండియా కూటమి ఓటమికి కారణమైన ఎంఐఎంనే ఇక్కడ పొగడడం ముఖ్యమంత్రి ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. లగచర్ల బాధితులకు న్యాయం చేయకపోవడం, హెచ్‌సియు చెట్ల నరికివేత, హైడ్రా, మూసీ పేరుతో ఇళ్ల కూల్చివేతలు, సీఎం రమేష్‌కు కాంట్రాక్టులు ఇచ్చి కమీషన్లు తీసుకోవడం, ఎన్నికల కమిషన్‌కు 20 ఫిర్యాదులు ఇచ్చినా చర్యలు తీసుకోకపోవడం విషయాలు ప్రజలు మరచిపోరని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో మంత్రులు పొంగులేటి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు సీఎం సీటు కోసం కాపు కాస్తున్నారని, మంత్రులు రేవంత్ రెడ్డి విఫలం కావాలనే చూస్తున్నారని, ఆయన రెడ్డి కుర్చీ కింద ఉన్న కుంపట్లు ఎంత అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోందన్నారు. జూబ్లీహిల్స్‌లో ప్రజాస్వామ్యం నిలిచి విషయంపై రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్ విజయం రేవంత్ రెడ్డికి ప్రజలు ఇచ్చిన సర్టిఫికెట్ కాదని అధికార దుర్వినియోగం, ఒత్తిడి, రాజకీయ కూటముల ఫలితం మాత్రమేనన్నారు.

Next Story