జూబ్లీహిల్స్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా!.. వారి ఆరోపణల్లో నిజమెంత?

by Gantepaka Srikanth |

దీపావళి పండుగ తర్వాత జూబ్లీహిల్స్​ఉప ఎన్నిక ప్రచారం జోరందుకోనుంది. మంగళవారంతో నామినేషన్స్ గడువు ముగియనుంది.

జూబ్లీహిల్స్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందా!.. వారి ఆరోపణల్లో నిజమెంత?
X

దిశ, తెలంగాణ బ్యూరో: దీపావళి పండుగ తర్వాత జూబ్లీహిల్స్​ఉప ఎన్నిక ప్రచారం జోరందుకోనుంది. మంగళవారంతో నామినేషన్స్ గడువు ముగియనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు​దాఖలు చేశారు. నవంబర్ 11న ఎన్నికలు, 14న ఓట్ల లెక్కింపు ఉండనుంది. అయితే జూబ్లీహిల్స్‌లో​ప్రచారం చేస్తున్న పలు పార్టీలు స్థానిక సమస్యలను మరిచి ఒకరిపై మరొకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. తమ హయాంలోనే అభివృద్ధి జరిగిందంటే.. లేదు లేదు మా హయాంలోనే అంటూ సవాళ్లు విరుసుకుంటున్నాయి.

మ్యాచ్ ఫిక్సింగ్ అంటూ..

జూబ్లీహిల్స్ ఉప​ఎన్నికల్లో కాంగ్రెస్,​బీజేపీ పార్టీలు ఒక్కటయ్యాయని, బీఆర్‌ఎస్‌ను ఓడించేందుకు ఈ రకమైన ఒప్పందానికి దిగుతున్నాయని గులాబీ పార్టీ ఆరోపిస్తున్నది. మరో వైపు బీజేపీ, బీఆర్‌ఎస్​ఒక్కటేనని, సీటు బీఆర్‌ఎస్‌కు వదిలేయాలని ఆ రెండు పార్టీల మధ్య ఒప్పందం జరిగిందని కాంగ్రెస్​ఆరోపిస్తుంది. ఇదే విషయంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. దీనికి బలం చేకూరుస్తూ బహిషృత బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్​సైతం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని దొప్పి పొడుస్తూ ‘బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తారా లేదా కాంగ్రెస్‌ను గెలిపిస్తారా’ అంటూ వ్యంగ్యంగా కామెంట్స్ చేశారు. కాంగ్రెస్​గుర్తుపై ఎంఐఎం అభ్యర్థి పోటీ చేస్తున్నాడంటూ బీజేపీ ఆరోపిస్తున్నది. ఎవరు ఎవరికి బహిరంగంగా, అంతర్గతంగా మద్దతు తెలుపుతున్నారో అంటూ నియోజకవర్గ ప్రజలు గందరగోళంలో పడిపోయారు.

ముస్లిం ఓట్లపై కాంగ్రెస్, బీఆర్ఎస్ ఫోకస్

జూబ్లీహిల్స్​నియోజకవర్గంలో ముస్లిం ఓట్లు గణనీయంగా ఉన్నాయి. వీరిపై కాంగ్రెస్, బీఆర్ఎస్‌ ఫోకస్​పెట్టాయి. వీరి ఓట్లు గెలుపు ఓటములను ప్రభావతం చేస్తాయని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో ముస్లిం మైనార్టీలను మచ్చిక చేసుకునేందుకు రెండు పార్టీలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇక్కడి నుంచి ఎంఐఎం పోటీ చేయకుండా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ వైపే ముస్లిం మైనార్టీ ఓటర్లు మొగ్గు చూపుతారని నేతలు చెబుతున్నారు. సిట్టింగ్​సీటును కాపాడుకునేందుకు బీఆర్‌ఎస్​ప్రయత్నాలు చేస్తుండగా.. మరో స్థానాన్ని తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నది. దీని కోసం ఆ పార్టీ ప్రత్యేక వ్యూహన్ని రచించి ముగ్గురు మంత్రులతో కమిటీ వేసి ప్రచారం ప్రారంభించింది. ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలకు పెద్ద ఎత్తున శంకుస్థాపనలు చేసింది. నిధులు సైతం విడుదల చేసింది.

వచ్చే నెల మొదటి వారంలో సీఎం ప్రచారం

నవంబర్ 9వ తేదీ సాయంత్రం ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్​అభ్యర్థికి మద్దతుగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రచారం చేయనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా కార్నర్​మీటింగులు ఏర్పాటు చేసే ఛాన్స్ ఉన్నట్టు తెలిసింది. వీటిని విజయవంతం చేయడం ద్వారా గెలుపు సునాయాసం చేసుకోవడంతో పాటు భారీ మెజార్టీ సాధించాలని కాంగ్రెస్​వ్యూహం రచిస్తుంది. కేసీఆర్‌ను ప్రచారానికి తీసుకొని రావాలని బీఆర్ఎస్ ఆలోచిస్తున్నా.. పార్టీ అధినేత రావడంపై స్పష్టత లేదని చెబుతున్నారు. ఒక వేళ కేసీఆర్ ప్రచారానికి వస్తే బీఆర్‌ఎస్​ఊపు మరింత పెరుగుతుందని చెబుతున్నారు. ఇప్పటి వరకు కేటీఆర్, హరీశ్‌రావులే ప్రధాన ప్రచారకర్తలుగా ఉన్నారు. బీజేపీ నుంచి కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ప్రచారం చేయనున్నట్టు కమలం నేతలు చెబుతున్నారు.

Next Story