- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Politics: జూబ్లీహిల్స్ బై పోల్ బాద్ షా ఎవరు?.. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ముందు అసలైన సవాల్
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సీఎం రేవంత్ రెడ్డి, కేసీఆర్ మధ్య బిగ్ ఫైట్ మొదలుకానుంది.

దిశ, డైనమిక్ బ్యూరో/ హైదరాబాద్ బ్యూరో : తెలంగాణలో మరో ఉప ఎన్నిక రాజకీయ వేడి రాజేస్తోంది. జూబ్లీహిల్స్ (Jubilee Hills Bypoll) ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మృతితో హైదరాబాద్ నగరంలో బై పోల్ అనివార్యంగా మారింది. ఆర్నెళ్లలోపు ఎన్నికలు జరిగే అవకాశం ఉండగా ఎన్నిక ఏకగ్రీవం కాబోతుందా? సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఎలాంటి ఎత్తులు వేయబోతున్నదనేది? కంటోన్మెంట్ మాదిరిగా కాంగ్రెస్ కైవసం చేసుకోనుందా?, బీజేపీ, ఎంఐఎం వ్యూహాలేంటనేది ఆసక్తిగా మారింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎవరిని బరిలోకి దింపబోతున్నాయి? ఆశావహులకు టికెట్లు దక్కకపోతే వాళ్లు ఏ మేరకు సహకరిస్తారనే చర్చ మొదలైంది.
భారీగా ఆశావహుల జాబితా..
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం అధికారికంగా ఎటువంటి కసరత్తు మొదలుకాకపోయినా రాజకీయంగా మాత్రం ఆశావహులు టికెట్ల కోసం తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఆయా పార్టీల నేతలు తమ గాడ్ ఫాదర్ల ద్వారా అధిష్టానం పెద్దల వద్ద లాబీయింగ్ మొదలుపెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితి ఎప్పుడొచ్చినా బీఆర్ఎస్ వారి కుటుంబ సభ్యులకే టికెట్ ఇస్తూ వస్తోంది. అదే జరిగితే మాగంటి సునీత (గోపీనాథ్ భార్య)కు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక రేసులో పీజేఆర్ తనయుడు, మాజీ ఎమ్మెల్యే పి.విష్ణువర్థన్‌రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి వంటి నేతల పేర్లు గులాబీ పార్టీలో వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన టీమిండియా మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్, పీజేఆర్ కూతురు పి.విజయారెడ్డి, నవీన్ యాదవ్ పేర్లు సైతం తెరపైకి వస్తున్నాయి. బీజేపీలో గత ఎలక్షన్స్‌లో బరిలో నిలిచిన లంకల దీపక్‌రెడ్డితో పాటు జూటూరు కీర్తిరెడ్డి, డా.పద్మ వీరపనేని, బండారు విజయ లక్ష్మి పేర్లు ఆశావహుల జాబితాలో ఉన్నాయి. జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌లో ముస్లిం మైనార్టీ ఓట్లు నిర్ణయాత్మకం కానున్నాయి. గత ఎన్నికల్లో ఎంఐఎం తరఫున రషీద్ ఫరాజుద్దీన్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అయితే తాజా రాజకీయ పరిస్థితుల దృష్ట్యా అధికార పార్టీతో సన్నిహితంగా ఉంటున్న ఎంఐఎం కనుక పోటీకి దూరంగా ఉంటే హస్తం పార్టీకి విజయావకాశాలు పెరుగుతాయనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పతంగి పార్టీ పోటీ చేస్తుందా లేదా? పోటీకి దూరంగా ఉంటే ఆ పార్టీ మద్దతు కాంగ్రెస్‌కా లేక బీఆర్ఎస్‌కా అనేది వేచి చూడాలి.
ఆ రెండు పార్టీలకు సవాల్..
ప్రస్తుతం ప్రధాన పార్టీల మధ్య రాజకీయం రంజుగా సాగుతోంది. తామిచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం దృష్టి సారించింది. ఒక్కో స్కీమ్ అమలు చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. మరోవైపు రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత పెరిగిపోయిందని, రాష్ట్రంలో ఉప ఎన్నిక అంటూ వస్తే గెలుపు తమదేనని బీఆర్ఎస్, బీజేపీ సవాల్ చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌లో బై ఎలక్షన్ రావడంతో కారు, కమలం పార్టీలకు చాలెంజ్‌గా మారనుంది. గెలిస్తే అదనపు ప్రయోజనం, లేదా ఓడితే కాంగ్రెస్‌కు వచ్చే నష్టమేమీ లేదు, కానీ బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కోల్పోతే ఇన్నాళ్లు తమ బలం పెరిగిందంటూ చేసుకుంటున్న ప్రచారం అంతా వట్టిదేనని ప్రజాక్షేత్రంలోకి సంకేతాలు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇక రాష్ట్రంలో తమకు మద్దతు పెరుగుతోందని, రేవంత్ సర్కార్‌పై ప్రజల్లో వ్యతిరేక వస్తోందని బీజేపీ (BJP) సైతం ఆరోపణలు గుప్పిస్తోంది. ఈ వాదన నిజమే అనేందుకు ఈ ఎన్నికల్లో ఆ పార్టీ సైతం సత్తా చాటాల్సి ఉంటుంది. దీంతో ఈ ఎన్నిక బీజేపీ సైతం సవాలుగా మారనుంది. ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఎలాంటి వ్యూహాలు అమలు చేయబోతున్నారు?, కంటోన్మెంట్ అనుభవంతో కేసీఆర్ (KCR) కొత్త స్కెచ్ ఏంటి? కమలం పార్టీ కార్యాచరణ ఎలా ఉండనుందనేది పొలిటికల్ హైప్‌ను క్రియేట్ చేస్తోంది.






