కాంగ్రెస్ కేడర్‌లో జోష్.. లీడర్లలో పరేషాన్!

by Disha Web Desk 4 |
కాంగ్రెస్ కేడర్‌లో జోష్.. లీడర్లలో పరేషాన్!
X

దిశ, తెలంగాణ బ్యూరో : కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయంతో తెలంగాణలోనూ అదే రిపీట్ అవుతుందని పీసీసీ చీఫ్ రేవంత్ ఇటీవల ధీమా వ్యక్తం చేశారు. అక్కడి గెలుపుతో హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లోనూ సంబురాలు జరిగాయి. పలువురు సీనియర్ నేతలు కూడా హాజరయ్యారు. కర్ణాటక విజయంతో తెలంగాణలోని కాంగ్రెస్ కేడర్‌లో జోష్ పెరిగింది. కానీ వారిని నడిపించే సీనియర్ నాయకులు మాత్రం స్తబ్దుగా ఉన్నారు. పట్టీపట్టనట్లుగా సైలెంట్ అయిపోయారు.

రేవంత్‌కు క్రెడిట్ వెళ్తుందనే...

కర్ణాటకలో పార్టీ విజయానికి అన్ని స్థాయిల్లోని లీడర్లు ఐక్యంగా ఉండడమే కారణమని గొప్పగా చెప్పుకుంటున్నా తెలంగాణలో యూనిటీపై మాత్రం పెదవి విరుస్తున్నారు. ఐక్యంగా ఉండి పనిచేసి తెలంగాణలో పార్టీని పవర్‌లోకి తెచ్చినా ఆ క్రెడిట్ మొత్తం పీసీసీ చీఫ్‌కు వ్యక్తిగతంగా దక్కుతుందనే భావనతో ఉన్నారు. ఈ కారణంగానే సీనియర్లు ఎవరికివారే అనే తరహాలో ఉండిపోయారు. తెలంగాణలో అధికార పార్టీ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, అది కాంగ్రెస్‌కు కలిసొస్తుందనే అభిప్రాయంలో నేతల మధ్య ఎలాంటి తేడాలూ లేవు. అందరూ గట్టిగా కొట్లాడితే బీఆర్ఎస్‌ను ఓడించడం ఖాయమనే భావనతోనే ఉన్నారు. కానీ ఐక్యం కావడంలో ఎవరి అభిప్రాయాలు వారికున్నాయి.

గెలిస్తే రేవంత్ హీరో అయిపోతారని, విడివిడిగా సీనియర్లు చేసిన కృషికి తగిన గుర్తింపు లేకుండా పోతుందనేది పలువురి సీనియర్ల వాదన. ఈ కారణంగానే సీనియర్లు చాలామంది పార్టీకి సంబంధించిన ఉమ్మడి కార్యాచరణలో పాలుపంచుకోడానికి సుముఖంగా లేరు. పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జున్ ఖర్గే లాంటి నేతలు వచ్చినప్పుడు మాత్రం వేదికల మీద కనిపిస్తున్నారు.

కార్యాచరణ కరువు..

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని సీనియర్ నేతలు కోరుకుంటున్నప్పటికీ కర్ణాటక విజయాన్ని స్థానికంగా మైలేజ్ పొందేలా యాక్టివిటీస్ చేపట్టలేదు. జిల్లాల్లో ర్యాలీలు, సంబురాలు లాంటి సెలబ్రేషన్స్ చేయకుండా సైలెంట్‌గా ఉండిపోయారు. సొంత జిల్లా, నియోజకవర్గ స్థాయిలో ఇలాంటి ప్రోగ్రామ్స్ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ప్రజల్లో వ్యక్తిగతంగా గుర్తింపు పొందే అవకాశమున్నా ఆ దిశగా ఆలోచించలేదు. రాష్ట్ర పార్టీ నాయకత్వం సైతం జిల్లాల్లో విజయోత్సవ ర్యాలీల తరహాలో ప్లానింగ్ ఇవ్వలేదు. పీసీసీ చీఫ్‌తో చాలామంది సీనియర్లు అంటీ ముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నారు.

చాలా కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొనడం లేదు. రకరకాల కారణాలతో గైర్హాజరవుతున్నారు. దీనికి తోడు వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోడానికి పాదయాత్రలు చేసుకుంటున్నారు. కర్ణాటకలో విభేదాలను పక్కన పెట్టి పార్టీ కోసం ఐక్యంగా ఉండడం ద్వారానే విజయం సాధ్యమైందని జాతీయ, రాష్ట్ర నేతలంతా బహిరంగంగానే చెప్తున్నారు. కానీ తెలంగాణ విషయంలో అలాంటి ఐక్యత సాధ్యమేనా అనే అనుమానాలు ఉన్నాయి.

వేరుకుంపటి పాలిటిక్స్..

సోషల్ మీడియా ద్వారా ఉద్దేశపూర్వకంగానే తన ప్రతిష్టను దిగజార్చే పనులు జరుగుతున్నాయంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల వ్యాఖ్యానించారు. అలాంటి పోస్టులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు కంప్లైంట్ కూడా చేశారు. ఇక పలువురు సీనియర్ నేతలు గాంధీభవన్‌కు రావడమే గగనమైపోయింది. వ్యక్తిగతంగా ఇమేజ్ పెంచుకోవడం, వారి స్థానాన్ని పదిలం చేసుకోవడంపై చూపించిన ఆసక్తిని పార్టీ కోణం నుంచి ఆలోచించడంలేదనే వాదన బలంగా వినిపిస్తున్నది.

అన్ని స్థాయిల్లోని నాయకత్వాన్ని కలుపుకుపోవడంలో పీసీసీ చీఫ్ విఫలమయ్యారనేది సీనియర్ల వాదన. పార్టీ నాయకత్వాన్ని జీర్ణించుకోలేక వేరుకుంపటి పాలిటిక్స్ నడిపిస్తున్నారన్నది రేవంత్ ఆరోపణ. ఈ రెండు రకాల అభిప్రాయాలతో పార్టీ సమిష్టి పనివిధానం వర్కవుట్ కావడంలేదని, ఆశించిన స్థాయిలో ఫలితాలు రావడం లేదన్నది హైకమాండ్ ఆవేదన. అగ్రనేతలతో భారీ స్థాయి మీటింగుల నిర్వహణ, డిక్లరేషన్‌లతో వివిధ సెక్షన్ల ప్రజలకు దగ్గరవ్వాలన్నది రేవంత్ ప్లాన్. సొంత పార్టీ నాయకుల సహకారం ఉన్నా లేకున్నా ప్రజాబలంతో పైచేయి సాధించాలని, పవర్‌లోకి రావాలని భావిస్తున్నారు.

Next Story