టెట్‌పై ఢిల్లీలో జాతీయస్థాయిలో ఉమ్మడి పోరాటం: ఏ.వీ.సుధాకర్

by Naga Rani Yarlagadda |

ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలని, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో చట్ట సవరణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఉమ్మడి పోరాటం చేస్తున్నట్లు ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఏ.వి.సుధాకర్ తెలిపారు.

టెట్‌పై ఢిల్లీలో జాతీయస్థాయిలో ఉమ్మడి పోరాటం: ఏ.వీ.సుధాకర్
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపునివ్వాలని, పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో చట్ట సవరణకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జాతీయ స్థాయిలో ఢిల్లీలో ఉమ్మడి పోరాటం చేస్తున్నట్లు ఎస్టీయూటీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు ఏ.వి.సుధాకర్ తెలిపారు. ఆదివారం స్థానిక ఎస్టీయూ భవన్ లో నిర్వహించిన రంగారెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశానికి వారు హాజరై మాట్లాడుతూ.. విద్యాహక్కు చట్టం అమలు తేదీకి ముందు నియామకమైన ఉపాధ్యాయులు రెండేళ్లలో టెట్ పాస్ కావాలని సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని అన్నారు. జాతీయ ఉపాధ్యాయ శిక్షణా సంస్థ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి తీర్పు వచ్చిందని వారు అభిప్రాయపడ్డారు. తీర్పు వచ్చి నాలుగు నెలలు గడుస్తోందని, దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని విమర్శించారు. టెట్ పై కొందరు ఎంపీ లు పార్లమెంటులో ప్రస్తావించినప్పటికి ఫలితం లేదన్నారు. ఈ నేపథ్యంలో అల్ ఇండియా జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్ ఆర్గనైజేషన్స్ (ఏఐజాక్టో) అధ్వర్యంలో ఉమ్మడి ఉద్యమం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఢిల్లీ లో ఫిబ్రవరి 5 న జంతర్ మంతర్ వద్ద మహా ధర్నా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా రాష్ట్రాల నుండి వేలాది మంది ఉపాధ్యాయులు పాల్గొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story