జేఎన్టీయూ-హెచ్‌లో అవకతవకలు.. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు

by Naga Rani Yarlagadda |

విద్యాసంస్థలకు అటానమస్ హోదా, అఫిలియేషన్ స్టేటస్ కేటాయింపులో జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ-హెచ్)లో పారదర్శకత లోపించిందనే ప్రచారం జరుగుతున్నది.

జేఎన్టీయూ-హెచ్‌లో అవకతవకలు.. విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: విద్యాసంస్థలకు అటానమస్ హోదా, అఫిలియేషన్ స్టేటస్ కేటాయింపులో జవహర్ లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (జేఎన్టీయూ-హెచ్)లో పారదర్శకత లోపించిందనే ప్రచారం జరుగుతున్నది. అకడమిక్ ప్రమాణాలపై దృష్టి సారించకుండా.. రాజకీయ అండదండలు ఉండి.. పైరవీలు చేస్తూ భారీగా డబ్బులు ముట్టజెప్పిన విద్యాసంస్థల వైపే ఆఫీసర్లు మొగ్గుచూపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. సాంకేతిక విద్యలో అగ్రగామిగా పేరుగాంచిన ఈ వర్సిటీ అధికారుల తీరుపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాల వల్ల విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడుతున్నదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. గత బీఆర్ఎస్ హయాం నుంచే జేఎన్టీయూ హెచ్ లో అడ్మినిస్ట్రేషన్ విఫలమైందనే విమర్శ ఉన్నది. ప్రభుత్వ యూనివర్సిటీలకు నిధులు ఇవ్వకపోవడమే కాకుండా.. ప్రయివేటు కాలేజీలకు అటానమస్ హోదా ఇవ్వడం వల్ల.. విద్యార్థుల్లో నైపుణ్యాల కొరత, ప్లేస్ మెంట్లు దొరక్కపోవడం వంటివి జరుగుతున్నాయని విద్యార్థి సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా జేఎన్టీయూహెచ్ లో గతంలో డేటాబేస్ ఎడిట్ చేసి, మార్కులు ట్యాంపరింగ్ చేసిన సందర్భాలను విద్యార్థి సంఘాలు ఆధారాలతో సహా నిరూపించాయి.

‘హోదా’ల కేటాయింపులో అక్రమాలు

జేఎన్టీయూ పరిధిలోని కళాశాలలకు అఫిలియేషన్, అటానమస్ హోదా కేటాయింపులో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. అకడమిక్ ప్రమాణాలను ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని, పైరవీలు చేస్తున్న కళాశాలలకు మాత్రమే ఈ హోదాలు లభిస్తున్నాయని పేర్కొంటున్నాయి. ఈ అక్రమాల వల్ల అర్హత లేని కళాశాలలు అటానమస్ హోదాలు పొంది, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో విఫలమవుతున్నాయని చెబుతున్నారు.

మౌలిక సదుపాయాల కొరత

జేఎన్టీయూ పరిధిలో సుమారు 290 కాలేజీలుంటే.. ఇందులో 175 కళాశాలలు రాజకీయ నాయకులవే కావడం గమనార్హం. ఈ కళాశాలల్లో సరైన మౌలిక సదుపాయాలు లేవనే చర్చ ఉన్నది. కొన్ని కాలేజీలకు సరైన బిల్డింగులు, అనుమతులు లేకపోయినప్పటికీ.. ఏఐసీటీఈ పర్మిషన్ కోసం భారీ ఎత్తున పైరవీలు చేస్తున్నట్లు తెలుస్తున్నది. మరోవైపు ఏఐసీటీఈ అనుమతి రాలేదని ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ప్రొగ్రాం(ఐడీపీ)కు చెందిన నాలుగు కోర్సులను రద్దు చేస్తున్నట్లు జేఎన్టీయూ హెచ్ ప్రకటించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

నైపుణ్యాల కొరత

జేఎన్టీయూహెచ్ పరిధిలో చదువుతున్న విద్యార్థులు డిగ్రీలు పొందినప్పటికీ, జాబ్ మార్కెట్లో అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో వెనకబడుతున్నట్లు తెలుస్తున్నది. వర్సిటీ అకడమిక్ అంశాలపై దృష్టి సారించకపోవడం, ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ను మార్చకపోవడం వంటి కారణాల వల్ల విద్యార్థులు నష్టపోతున్నట్లు చర్చ జరుగుతున్నది. దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంలో పడుతున్నదని, సరైన ఉద్యోగ అవకాశాలు లభించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ప్రయివేటు కాలేజీలతో పోలిస్తే జేఎన్టీయూలో క్యాంపస్ ప్లేస్మెంట్లు కూడా తక్కువే. విద్యార్థుల్లో నైపుణ్యాలు కొరవడడంతో.. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత కూడా విద్యార్థులు మళ్లీ బయట కోచింగ్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి.

Next Story