బీఆర్ఎస్ వలలో జీవన్ రెడ్డి.. కేసీఆర్ ఎందుకు రావాలో చెప్పాలి: మల్లు రవి

by Ramesh Naini |

బీఆర్ఎస్ వలలో జీవన్ రెడ్డి చిక్కుకున్నారని, మళ్లీ కేసీఆర్ ఎందుకు రావాలో జీవన్ రెడ్డి చెప్పాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్ వలలో జీవన్ రెడ్డి.. కేసీఆర్ ఎందుకు రావాలో చెప్పాలి: మల్లు రవి
X

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ వలలో జీవన్ రెడ్డి చిక్కుకున్నారని, మళ్లీ కేసీఆర్ ఎందుకు రావాలో జీవన్ రెడ్డి చెప్పాలని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి డిమాండ్ చేశారు. న్యూ ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతాలకు అనుకూలంగా పార్టీలో ఆయన ఎదిగారని, ఇటీవల రాజ్యసభకు వెళ్లే అవకాశం రాలేదని కాంగ్రెస్ పార్టీని వదిలి, రాజకీయ శత్రువైన బీఆర్ఎస్‌లోకి వెళ్లడం బాధగా ఉందన్నారు. చాలామంది నాయకులు బీఆర్ఎస్ లో చేరారు.. కేవలం చేరిన ఒక్కరోజే పండుగ రోజు.. ఆ తర్వాత అన్ని దండగ రోజులే.. ఈ విషయాన్ని జీవన్ రెడ్డి గుర్తుంచుకొని మాట్లాడితే మంచిదని మల్లు రవి హితవు పలికారు. జీవన్ రెడ్డికి, ఆయన ప్రాతినిధ్యం వహించిన కరీంనగర్ జిల్లా నేతలకు కాంగ్రెస్ పార్టీ ఎన్నో పదవులు ఇచ్చిందన్నారు. నియంతృత్వ పార్టీలోకి వెళ్లే మీరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం పోయి దేనికోసం బీఆర్ఎస్ రావాలో ప్రజలకు చెప్పాలని మల్లు రవి నిలదీశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని సంక్షేమాన్ని హరీశ్‌రావు, కేటీఆర్ చూడలేకపోతున్నారని, అందుకే పొద్దున లేచింది మొదలు కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారని ఆయన మండిపడ్డారు.

రైల్వే బోర్డు చైర్మన్‌తో భేటీ..

డోర్నకల్-గద్వాల నూతన రైల్వే లైన్ గురించి రైల్వే బోర్డు చైర్మన్‌తో చర్చించినట్లు మల్లు రవి వెల్లడించారు. ఈ లైన్‌కు సంబంధించిన ఎలైన్‌మెంట్, డీపీఆర్ గురించి, రైల్వే బోర్డు మీటింగ్ నిర్వహించి రిపోర్టు తయారుచేసి క్యాబినెట్‌కు పంపాలని మల్లు రవి ఛైర్మన్‌ను కోరారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ రైల్వే లైన్ మంజూరు అయ్యేలా చూడాలని చైర్మన్‌ని కోరినట్టుగా మల్లు రవి వివరించారు.ఈ అంశంపైన రైల్వే బోర్డు చైర్మన్ సానుకూలంగా స్పందించారని, త్వరితగ డీపీఆర్‌ను ఎగ్జామిన్ చేసి క్యాబినెట్ కు పంపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లుగా మల్లు రవి చెప్పారు.

Next Story