- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో ‘జమిలి’ సైరన్..! రాజ్యాంగ సవరణ లేకుండానే ఎన్నికలు
సీఎం రేవంత్ రెడ్డి పదేపదే ప్రస్తావిస్తున్నట్లుగా.. లోక్‌సభతో కలిపి ‘జమిలి’ ఎన్నికలు నిర్వహించే దిశగా అడుగులు పడుతున్నాయి.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తున్నది. 2028లో చివర్లో కాకుండా 2029 ఏప్రిల్ లేదా మే నెలలో రాష్ట్రంలో ఎన్నికలు ఉంటాయని సీఎం రేవంత్గత కొంతకాలంగా పదేపదే చెబుతున్న మాట. ఒకేసారి లోక్‌సభ, రాష్ట్రంలోని అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయని ఆయన ధీమాగా ఉన్నారు. తద్వారా తనకు మరో ఆరు నెలల పాలన సమయం అదనంగా కలిసి వస్తుందని అంటున్నారు. దీనిపై న్యాయ నిపుణులు, ఎన్నికల సంఘం అధికారులు సైతం ఎలాంటి రాజ్యాంగ ప్రక్రియ అవసరం లేకుండా కేంద్ర ఎన్నికల సంఘం అనుకుంటే జమిలి ఎన్నికలు నిర్వహించవచ్చని చెబుతున్నారు. మాములుగా తెలంగాణ అసెంబ్లీకి 2028 నవంబర్ లేదా డిసెంబర్‌లో జరగాల్సి ఉంది.
ప్రస్తుత అసెంబ్లీ పదవీకాలం 2028 డిసెంబర్8తో ముగియనుంది. అసెంబ్లీ గడువు ముగిసే ముందు 6 నెలలు కానీ, గడువు ముగిసిన 6 నెలల తరువాత ఎన్నికలు నిర్వహించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. దీని కోసం ప్రత్యేకంగా కేంద్రం ఎలాంటి రాజ్యాంగ సవరణ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. దేశం మొత్తం జమిలి ఎన్నికలు సాధ్యమైనా కాకపోయినా.. రాష్ట్రంలో మాత్రం జమిలి ఎన్నిక సాధ్యం అవుతుందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ఎన్నికల సంఘం ఓకే అంటే చాలని చెబుతున్నారు. తెలంగాణలో పాటుగా రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికలు జరగాల్సి జరగాల్సి ఉంది. ఒకవేళ తెలంగాణలో జాప్యమైతే మిగతా చోట్ల జమిలి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని చెబుతున్నారు. దీనికి తోడు కేంద్ర బలగాలు, ఈవీఎంలు అందుబాటులో ఉంటాయా? లేదా? అనేది ఆలోచించాల్సి ఉంటుందని చెబుతున్నారు.
నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు..
కేంద్రం జనాభా లెక్కల సంవత్సరాన్ని చాలా వ్యూహత్మకంగా, పకడ్భందీగా నిర్ణయించింది. ప్రస్తుతం జరిగేవి 2027 జనాభా లెక్కలుగా పరిగణిస్తారు. 2027 మార్చి 1గా జనాభా లెక్కలను పరిగనలోకి తీసుకుంటారు. రాజ్యాంగం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చట్టంలో 2026 తరువాత జరిగే జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకొని నియోజకవర్గాలను పునర్విభజించాలని 2008 సెగ్మెంట్ల పునర్విభజన సమయంలో పొందుపర్చారు. దీని ద్వారా 2027 జనాభా లెక్కలుగా పరిగణిస్తున్నందున ప్రస్తుతం చేపట్టే జనాభా లెక్కల ద్వారా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టవచ్చు. అదే సమయంలో చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టంలో 2026 తరువాత జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకొని మహిళా బిల్లును అమలు చేయాలని కూడా చట్టంలో పొందుపర్చారు. దీంతో నియోజకవర్గాల పునర్విభజన, చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఒకేసారి అమలు చేసే విధంగా జనాభా లెక్కల తేదీలను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. దీంతో జనాభా లెక్కలు 2027 ఫిబ్రవరి చివర్లో పూర్తవుతాయి. ఆన్లైన్ద్వారానే జనాభా లెక్కలు చేస్తున్నందున నియోజకవర్గాల పునర్విభజన, మహిళా బిల్లుకు అవసరమైన లెక్కలు 6 నెలల్లోపే వస్తాయని తెలుస్తోంది. దీంతో అప్పటికల్లా నియోజకవర్గాల పునర్విభజన కమిషన్‌ను ఏర్పాటు చేసి మార్గదర్శకాలతో సిద్ధంగా ఉంటే అదే ఏడాది పునర్విభజన, మహిళా బిల్లును అమలుచేయవచ్చని చెబుతున్నారు. ఆ తర్వాత తుది నోటిఫికేషన్ ఇచ్చి ఓటరు జాబితాను సిద్ధం చేసి రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను ఒకేసారి జరిగే విధంగా చేయవచ్చని చెబుతున్నారు. దీంతో నాలుగైదు నెలల వ్యవధిలోనే 2 సార్లు 3 నెలల చొప్పున ఎన్నికల కోడ్రాకుండా, అదనపు ఖర్చు లేకుండా ఎన్నికలు నిర్వహించవచ్చని చెబుతున్నారు. 1999 నుంచి 2014 వరకు కూడా ఉమ్మడి రాష్ట్రంలో లోక్‌సభతో పాటుగా అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. రెండు ఎన్నికలు ఒకేసారి జరిగితే కొంత జాతీయ పార్టీలకు అనువైన వాతావరణం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. అవి ఎంత వరకు నిజం అవుతాయో వేచి చూడాల్సిందే.
లోక్‌సభ, అసెంబ్లీ సీట్ల పెంపు..
నియోజకవర్గాల పునర్విభజన పూర్తయితే తెలంగాణ అసెంబ్లీలో సీట్లు పెరగనున్నాయి. అయితే, ఎన్ని సీట్లు పెరుగుతాయనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. విభజన చట్టంలో 153 సీట్లకు పెంచుతూ గతంలో ప్రతిపాదించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా లోక్‌సభ సీట్లను పెంచాలని కేంద్రంలోని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నది. ఇందుకు అనుగుణంగానే లోక్‌సభలో 866 సీట్లు, రాజ్యసభలో 360 మంది సభ్యులు కూర్చునే విధంగా నిర్మించారు. ఈ ప్రాతిపదికన తెలంగాణలో ఎన్ని సీట్లు పెరుగుతాయి? ఏ ప్రాతిపదికన చేస్తారు? అనే విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. దీనికి తోడు మహిళలకు 33 శాతం సీట్లు రిజర్వ్చేయాల్సి ఉన్నందున అంతే సంఖ్యలో లోక్‌సభలో సీట్లను పెంచుతారని తెలుస్తున్నది. ఈ ప్రకారం 50 లేదా 60 శాతం సీట్లను పెంచుతారని, అందుకగుణంగానే లోక్‌సభలో 866 మంది కూర్చునేలా ముందస్తు అంచనాలతో నిర్మాణం చేపట్టారని గుర్తుచేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రస్తుతం ఉన్న లోక్‌సభ స్థానాలు.. త్వరలోనే పెరిగే స్థానాలకు అనుగుణంగా అసెంబ్లీలో సీట్లు పెరగాల్సి ఉంది. ఈ మేరకు రాష్ట్రంలో 23, 25 లేదా 27 వరకు ఎంపీ స్థానాలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రకారం ఒక్కో లోక్‌సభ కింద 7 అసెంబ్లీ సీట్లను పరిగణలోకి తీసుకుంటే.. అసెంబ్లీలో పెరిగే స్థానాలు 161, 175 లేదా 189 అవుతాయి. అయితే, ఒక్కో లోక్‌సభ నియోజకవర్గం కింద అసెంబ్లీ స్థానాలను 7 చేస్తారా? 6 చేస్తారా? అనేది పునర్విభజన సమయంలో తేలనుంది. ఈ పెరిగిన సీట్లలో 33 శాతం సీట్లు మహిళలకు రిజర్వ్కానున్నాయి. దీంతో 2029లో జరిగే ఎన్నికల అనంతరం తెలంగాణ అసెంబ్లీ మహిళలతో కలకలలాడనుంది.
- Tags
- One Nation One Election
- Revanth Reddy
- 2029 Elections
- Telangana Assembly Elections
- Lok Sabha Elections 2029
- Delimitation of Constituencies
- Women Reservation Bill
- 33 Percent Women Quota
- Election Commission of India
- Census 2027
- Telangana MP Seats Increase
- Telangana MLA Seats Increase
- Constitutional Amendment
- Simultaneous Elections India






