BREAKING: పార్టీ ఫిరాయింపు కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-04 06:02:44  IST  )

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇచ్చారు.

BREAKING: పార్టీ ఫిరాయింపు కేసులో మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్
X

దిశ, వెబ్‌డెస్క్:తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసులో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మరో ఎమ్మెల్యేకు క్లీన్ చిట్ ఇచ్చారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారినట్లుగా పిటిషన్ దాఖలవ్వగా.. దానిపై స్పీకర్ విచారణ చేపట్టారు. ఈ క్రమంలో సంజయ్ పార్టీ మారారనేందుకు సరైన ఆధారాలు లేవని స్పీకర్ స్పష్టం చేశారు. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపుల పిటిషన్లు దాఖలవ్వగా.. ఇప్పటి వరకూ 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇచ్చారు. మరో ఇద్దరు ఎమ్మెల్యేలైన దానం నాగేందర్, కడియం శ్రీహరిలపై స్పీకర్ నిర్ణయం తెలియాల్సి ఉంది. నేడు కడియం శ్రీహరిని స్పీకర్ విచారించనున్నారు.

పార్టీ ఫిరాయింపు కేసులో తనకు క్లీన్ చిట్ రావడంపై ఎమ్మెల్యే సంజయ్ స్పందించారు. తాను బీఆర్ఎస్ పార్టీ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచానని, ఇప్పటికీ ఆ పార్టీ ఎమ్మెల్యేగానే ఉన్నానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా తాను అందుకుంటున్న జీతంలో రూ.5 వేలు బీఆర్ఎస్ పార్టీకే వెళ్తున్నాయన్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ బిల్లులు ప్రవేశపెట్టి విప్ జారీ చేస్తే ఆ పార్టీ ఎమ్మెల్యేగానే మద్దతు ఇస్తానన్నారు.

ఎమ్మెల్యే వివేకానంద వాదనలు

స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద అనర్హత పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై నేడు స్పీకర్ విచారణ చేయనుండగా.. వివేకానంద తన వాదనలను వినిపించనున్నారు. కడియం బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, కాంగ్రెస్ పార్టీలో చేరారని వివేకానంద ఆరోపిస్తున్నారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కు పిటిషన్ సమర్పించారు. ఇప్పటికే 8 మందికి క్లీన్ చిట్ ఇచ్చిన స్పీకర్.. కడియం శ్రీహరి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారోనని ఉత్కంఠ నెలకొంది.

వీరికే క్లీన్ చిట్

ఇప్పటి వరకూ స్పీకర్ గడ్డం ప్రసాద్ 8 మందికి పార్టీ ఫిరాయింపుల కేసులో క్లీన్ చిట్ ఇచ్చారు. భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ , పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీలు క్లీన్ చిట్ పొందారు.

Next Story