రాజ్యసభ చాన్స్ కోసం జగ్గారెడ్డి రాయబారం.. ఈసారైనా వర్కౌట్ అయ్యేనా?

by Prasad Jukanti |

కాంగ్రెస్‍లో రాజ్యసభ సీట్ల కోసం పోటీ అప్పుడే మొదలైంది. ఈ క్రమంలో జగ్గారెడ్డి ఢిల్లీకి వెళ్లడం హాట్ టాపిక్‍గా మారింది.

రాజ్యసభ చాన్స్ కోసం జగ్గారెడ్డి రాయబారం.. ఈసారైనా వర్కౌట్ అయ్యేనా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాజ్యసభ ఎన్నికల (Rajya Sabha Elections) ప్రకటన వెలువడటంతో తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య టికెట్ కోసం పోటీ మొదలైంది. రాష్ట్రం నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న బీఆర్ఎస్‍కు చెందిన ఎంపీ సురేశ్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ సింఘ్వీ పదవి కాలం వచ్చే ఏప్రిల్ లో పూర్తికాబోతోంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 16న ఈ స్థానాలకు ఎన్నికలుజరగబోతున్నాయి. ఈ సారి ఈ రెండూ స్థానాలు కాంగ్రెస్ దక్కించుకునే అవకాశం ఉండటంతో ఈసారి ఎలాగైనా రాజ్యసభ చాన్స్ దక్కించుకునేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు తమ ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇందులో భాగంగా అవకాశం కోసం అధిష్టానానికి లేఖలు రాయడం, పార్టీ పెద్దల మద్దతు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంతో అధికార పార్టీలో రాజ్యసభ టికెట్ల అంశం ఉత్కంఠగా మారింది.

జగ్గారెడ్డి రాయబారం:

ఈసారి రాజ్యసభకు వెళ్లే అవకాశం తనకి కల్పించాలని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ ఇప్పటికే అధిష్టానానికి లేఖ రాయగా మరో వైపు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) ఢిల్లీ బాట పట్టడం ఆసక్తిగా మారింది. ఇవాళ ఆయన రైలు మార్గంలో హస్తినాకు బయలుదేరారు. పార్టీ సీనియర్ నేతలు వీహెచ్ (VH Hanumantha Rao), జెట్టి కుసుమ కుమార్‍కు (Kusuma Kumar) రాజ్యసభ అవకాశం ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేయబోతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కోటాలో ఈ ఇద్దరికీ చాన్స్ ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఢిల్లీ ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులంతా పార్టీ అధిష్టానంతో ఇవాళ ఉదయం భేటీ అయ్యారు. రాష్ట్రంలోని పరిస్థితులపై కీలక చర్చలు జరిపారు. ఈ సమావేశం వేళ జగ్గారెడ్డి ఒంటరిగా ఢిల్లీ బాట పట్టడం ఆసక్తిగా మారింది.

ఈసారైనా వర్కౌట్ అవుతుందా?:

కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి రూటే సపరేట్. ఆయనేం చెప్పాలనుకుంటారో నిర్మోహమాటంగా చెప్పేస్తారనే టాక్ ఉంది. అలాంటి జగ్గారెడ్డి పార్టీ సీనియర్ల తరపున అధిష్టానం వద్ద రాయబారం సాగించడం హస్తం పార్టీలో ఉత్కంఠ రేపుతోంది. అయితే కుసుమకుమార్‍కు పదవి ఇవ్వాలని జగ్గారెడ్డి గతంలోనూ కోరారు. గతేడాది రాష్ట్రంలో ఎమ్మెల్సీ అవకాశం ఉండగా ఆ స్థానాన్ని జెట్టి కుసుమకుమార్ కు అవకాశం కల్పించాలని బహిరంగగానే కోరారు. కుసుమ కుమార్ కాంగ్రెస్ లో 30 ఏళ్ల నుంచి ఉన్నారని కమ్మ సామాజిక వర్గం నుంచి ప్రస్తుతం మండలిలో ఒక్కరు కూడా లేరని అందువల్ల అదే సామాజిక వర్గానికి చెందిన కుసుమ కుమార్ కు అవకాశం కల్పించాలని జగ్గారెడ్డి గతంలో కోరారు. అయితే జగ్గారెడ్డి రికమండేషన్ చేసినా అప్పుడు కుసుమ కుమార్‍కు అవకాశం దక్కలేదు. ఇప్పుడు రాజ్యసభకు కుసుమకుమార్‍తో పాటు వీహెచ్ పేరును ఆయన తెరపైకి తీసుకువస్తున్నారు. ఏకంగా ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలను కలిసి ఈ ప్రతిపాదన వారి ముందు ఉంచబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి జగ్గారెడ్డి రికమండేషన్ ఈసారైనా వర్కౌట్ అవుతుందా లేదా చూడాలి.

Next Story