BRS: కవిత వ్యాఖ్యలకు జగదీశ్ రెడ్డి కౌంటర్

by Prasad Jukanti |   (  Updated:2025-08-03 10:49:29  IST  )

కవిత వ్యాఖ్యలకు జగదీశ్ రెడ్డి కౌంటర్

BRS: కవిత వ్యాఖ్యలకు జగదీశ్ రెడ్డి కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జగదీశ్ రెడ్డి లిల్లీపుట్ నాయకుడు అంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kavitha) చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy) స్పందించారు. కవితమ్మ అని సంబోధిస్తూనే విమర్శలు గుప్పించారు. కవిత వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా స్పందించిన జగదీశ్ రెడ్డి.. 'నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితమ్మకు ఉన్న జ్ఞానానికి నా జోహార్లు... కేసీఆర్ శత్రువులైన రేవంత్, రాధాకృష్ణలు నా గురించి మాట్లాడిన మాటల్ని మరొక్కసారి వల్లే వేసేందుకు ఆమె చేసిన ప్రయత్నానికి నా సానుభూతిని తెలియజేస్తున్న' అంటూ ట్వీట్ చేశారు.

ఇటీవల జగదీశ్వర్ రెడ్డి ఓ టీవీ చానల్ లో మాట్లాడుతూ కవిత గురించి తాము సీరియస్ గా తీసుకోవడం లేదని, ఆమె పార్టీలో ఉంటే ఓ ఎమ్మెల్సీ మాత్రమేనని వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఇవాళ స్పందించిన కవిత.. జగదీశ్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. లిల్లీపుట్ నాయకుడు అంటూ జగదీశ్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీని సర్వ నాశనం చేసిందే ఈ లిల్లీపుట్. ఆయన నాగురించి మాట్లాడుతారా అంటూ మండిపడ్డారు. కేసీఆర్ లేకపోతే ఆయన ఎవరు నేను తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు నన్ను విమర్శిస్తున్నవారు ఎక్కడ ఉన్నారు అంటూ ఫైర్ అయ్యారు.

పార్టీలో కుదుపు తప్పదా?

కవిత విషయంలో జగదీశ్ రెడ్డి చేసిన ట్వీట్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తనపై దాడి చేయిస్తున్నది బీఆర్ఎస్ లోని ఓ బడా లీడరేనని కవిత ఆరోపించడం, కవితపై క్రమంగా బీఆర్ఎస్ నేతల విమర్శల దాడి పెరగడం చూస్తే త్వరలోనే బీఆర్ఎస్ లో భారీ కుదుపు తప్పదా అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే పార్టీ అధిష్టానం తీరుపై తీవ్ర అసహనంతో ఉన్న కవిత సొంత ఎజెండాతో ముందుకు వెళ్తున్నారు. ఈక్రమంలో ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ నేతలు కవితపై విమర్శలు చేస్తుండటం ఈ విమర్శలపై సోషల్ మీడియాలో కార్యకర్తలు రెండుగా చీలిపోవడం గులాబీ పార్టీలో ఉత్కంఠ రేపుతున్నది. తాజా పరిణామాల నేపథ్యంలో గులాబీ బాస్ కేసీఆర్ ఎలాంటి డెసిషన్ తీసుకోబోతున్నారనేది ఆసక్తిగా మారింది.

Next Story