సమ్మక్క - సారక్క జాతరలా బీఆర్ఎస్ సభ.. మాజీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2025-04-25 10:37:32  IST  )

వరంగల్‌లోని ఎల్కతుర్తి వేదికగా బీఆర్ఎస్(BRS) ఆధ్వర్యంలో నిర్వహించబోయే రజతోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి(Jagadish Reddy) అన్నారు.

సమ్మక్క - సారక్క జాతరలా బీఆర్ఎస్ సభ.. మాజీ మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్‌లోని ఎల్కతుర్తి వేదికగా బీఆర్ఎస్(BRS) ఆధ్వర్యంలో నిర్వహించబోయే రజతోత్సవ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి(Jagadish Reddy) అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచైనా ఎల్కతుర్తికి సజావుగా చేరుకునేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కేసీఆర్(KCR) ప్రతీ రోజు సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారని అన్నారు. 1200 ఎకరాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. కాంగ్రెస్ వ్యతిరేక సభగా ప్రజలు భావించి స్వచ్చంధంగా రావడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారని అన్నారు. అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్‌పై ప్రజలు కసితో ఉన్నారు.. అందుకే బీఆర్ఎస్ సభను.. వారి సొంత సభగా ఫీలవుతున్నారు.. దేశంలో ఏ రాజకీయ పార్టీకి ఇంత ప్రజాధారణ ఉండదేమో అని అన్నారు. చరిత్రలో ఏ సభ లేనట్లుగా నిర్వహించి.. రికార్డులు బద్దలు కొడతామని జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.


‘ఎల్కతుర్తి మట్టిని ముట్టుకోవాలనే తపన ప్రజల్లో కనిపిస్తోంది. వృద్ధులు కూడా సభకు రావాలనే ఉత్సాహంలో ఉన్నారు. అయితే ఎండల దృష్ట్యా మేమే వారితో వద్దని వారిస్తున్నాం. రైతులు, మహిళలు, యువతలో ఉత్సాహం ఎక్కువగా ఉంది’ అని జగదీశ్ రెడ్డి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, బీజేపీల సభపై ఏనాడూ ఇంతలా చర్చ జరుగలేదని అన్నారు. అందుకే బీఆర్ఎస్ సభకు జాతరలా కదులుతున్న జనాన్ని చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించారు. సమ్మక్క - సారక్క జాతరను తలపించేలా సభ ఉంటుందని వెల్లడించారు. సభ కచ్చితంగా విజయవంతం అవుతుంది.. లెక్కకు మించి జనం వస్తారు.. రాష్ట్రంలోని ప్రతీ గ్రామం నుంచి ప్రజలు సభకు వస్తారని అన్నారు.

మేడిగడ్డపై NDSA నివేదికపై స్పందన :

మేడిగడ్డ, కాళేశ్వరం, సుందిళ్లపై రిపోర్ట్ ఇచ్చింది ఎన్‌డీఎస్‌ఏ కాదని.. అది ఎన్డీఏ ప్రభుత్వ రిపోర్ట్ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీలు కలిసి ఇచ్చిన నివేదిక అని విమర్శించారు. ఎన్నికలపుడు హడావుడి చేశారు. మళ్ళీ ఇపుడు చేస్తున్నారు. కేసీఆర్‌ను దెబ్బ తీసేందుకు ఈ రిపోర్ట్ ఇచ్చారు. ‘బడే భాయ్ - చోటే భాయ్’ నాటకంలో భాగంగా ఈ రిపోర్ట్ ఇచ్చారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇలాంటి రిపోర్టే ఇచ్చారు. అది పనికిమాలిన నివేదిక. ఆ నివేదకను పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని జగదీశ్ రెడ్డి అన్నారు.

Next Story