- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
JACTO: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి త్వరలో ఉద్యమం : జాక్టో కీలక నిర్ణయం
ఉపాధ్యాయులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని (JACTO) జాక్టో చైర్మన్ జి. సదానందం గౌడ్ డిమాండ్ చేశారు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఉపాధ్యాయులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని (JACTO) జాక్టో చైర్మన్ జి. సదానందం గౌడ్ డిమాండ్ చేశారు. దీని కోసం త్వరలో ఆందోళన బాట పడుతున్నట్టు కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం కాచిగూడలోని ఎస్టీయూ భవన్‌లో ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తైందని, ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు, మొదటి తారీఖున వేతనాలు మినహా మేనిఫెస్టో హామీలు అమలు పరచడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే పీఆర్సీ సిఫార్సులను అమలు చేస్తామని ఇచ్చిన మాట తప్పడం సరికాదన్నారు. ఉద్యోగులకు 51 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. బకాయి పడిన ఐదు డీఏలను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగుల ఆరోగ్య కార్డులు జారీ చేసి సక్రమంగా అమలు చేయాలన్నారు. సీపీఎస్ రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పోరాటానికి సిద్ధం కావాలి..
సమస్యల పరిష్కారానికి జాక్టో ఆధ్వర్యంలో పోరాటానికి సిద్ధం కావాలని ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కొరకు నెలకు 1500 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. మోడల్, గురుకుల, ఎయిడెడ్ పాఠశాలల ఉపాధ్యాయులకు హెల్త్ కార్డులు జారీ చేయాలన్నారు. మోడల్ స్కూల్ టీచర్లకు 010 పద్దు కింద ట్రెజరీల ద్వారా వేతనాలు చెల్లించాలని కోరారు. కేజీబీవీ, యుఆర్ఎస్ టీచర్లకు సమ్మె కాలపు వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమావేశంలో జాక్టో ప్రధాన కార్యదర్శి కె. కృష్ణుడు నాయకులు పి. రాజ భానుచంద్ర ప్రకాష్, కె. మల్లికార్జున్ రెడ్డి, పర్వత్ సత్యనారాయణ, జుట్టు గజేందర్, జయబాబు, సయ్యద్ అస్గర్, జి. నగేష్ యాదవ్, యు. విఠల్, మోయినుద్దీన్, మీర్ ముంతాజ్, గీతాంజలి, శర్మ తదితరులు పాల్గొన్నారు.






