కాంగ్రెస్‌కు మళ్లీ పిండాలు పెట్టే టైమొచ్చింది.. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య

by Kema Shiva Kumar |

దేవాదుల ప్రాజెక్టు పనుల్లో జాప్యంపై మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు

కాంగ్రెస్‌కు మళ్లీ పిండాలు పెట్టే టైమొచ్చింది.. మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పిండాలు పెట్టే సమయం వచ్చిందని స్టేషన్ ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య (Thatikonda Rajaiah) మండిపడ్డారు. సోమవారం ఆయన వరంగల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దేవాదుల ప్రాజెక్టుపై సీఎం, మంత్రుల మాటలకు ఏమాత్రం పొంతన లేదని విమర్శించారు. రాష్ట్రంలో పంటలు ఎండుతుంటే ప్రభుత్వం రాక్షసానందం పొందుతోందని ధ్వజమెత్తారు.

పిండాలు పెట్టుడు నా వంతు అవుతోంది..

కడియం శ్రీహరి (Kadiyam Srihari) దేవాదుల వద్ద రెండు సార్లు బొంద తవ్వి వెళ్లిపోయాడని, కనీసం తట్టెడు మట్టి కూడా తీయలేదని రాజయ్య ఆరోపించారు. ఆ సమయంలో తాము అక్కడికి వెళ్లి నిరసనగా పిండాలు పెట్టామని గుర్తు చేశారు. 2003లో గంగారం వద్ద చంద్రబాబుతో కలిసి కడియం శ్రీహరి పనులకు శంకుస్థాపన చేశారని.. 17 నెలలు గడిచినా పనులు ప్రారంభించకపోవడంతో అప్పట్లో పిండాలు పెట్టామని ఎద్దేవా చేశారు. ‘ఇలా హామీలు ఇచ్చి పనులు చేయకపోతే పిండాలు పెట్టడం నా వంతు అవుతుంది.. పనులు ఆర్భాటంగా మొదలుపెట్టి వదిలేయడం కడియం వంతు అవుతుంది’ అని సెటైర్లు వేశారు.

దేవాదులను 90 శాతం పూర్తి చేశాం..

తాజాగా హరీశ్ రావు దేవన్నపేట పంప్‌హౌస్‌ను పరిశీలిస్తే.. వెంటనే ఆఘమేఘాల మీద సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దేవాదుల సందర్శనకు వచ్చారని ఆరోపించారు. ఇక దేవాదుల ప్రాజెక్టును బీఆర్ఎస్ 90 శాతం పూర్తి చేసిందని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ (Vinay Bhaskar) అన్నారు. కానీ, రేవంత్ ప్రభుత్వం మిగిలిన 10 శాతం పనులు కూడా చేపట్టలేదని విమర్శించారు. అన్నదాతల సమస్యలు తీర్చేందుకు డబ్బులు లేవంటున్నారని, కానీ కాంగ్రెస్ పెద్దలకు రూ. 1000 కోట్ల విరాళాలు ఇస్తామంటున్నారని ఎద్దేవా చేశారు.

Next Story