కామారెడ్డి డిక్లరేషన్ కాదు.. అది ముమ్మాటికీ ముస్లిం డిక్లరేషనే: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ చేసింది కామారెడ్డి డిక్లరేషన్ కాదని.. అది ముమ్మాటికీ ముస్లిం డిక్లరేషనే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు.

కామారెడ్డి డిక్లరేషన్ కాదు.. అది ముమ్మాటికీ ముస్లిం డిక్లరేషనే: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ చేసింది కామారెడ్డి డిక్లరేషన్ కాదని.. అది ముమ్మాటికీ ముస్లిం డిక్లరేషనే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేశారు. బీసీ రిజర్వేషన్ల సాధనకు ఇవాళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా దిగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ చేపడుతోన్న ధర్నా బీసీల కోసం కాదని.. ముస్లిం రిజర్వేషన్ల కోసమేనని ఎద్దేవా చేశారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో బీసీలకు పూర్తిగా 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిందని అన్నారు. తీరా చూస్తే బీసీ బిల్లు పేరుతో అందులో 10 శాతం రిజర్వేషన్లను ముస్లింలకు కట్టబెట్టాలనుకుంటోందని ఆరోపించారు. మిగిలిన 32 శాతం రిజర్వేషన్లను మాత్రమే బీసీలకు ఇవ్వాలనుకుంటోందని అన్నారు. వాస్తవానికి మోదీ ప్రభుత్వం ఇప్పటికే బీసీలకు 27 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తోంది. కాంగ్రెస్ తెచ్చిన బీసీ బిల్లుతో బీసీలకు వచ్చేది 5 శాతం రిజర్వేషన్లు మాత్రమేనని బండి సంజయ్ అన్నారు.

ముస్లింలకు 100 శాతం రిజర్వేషన్లు అమలు చేసి హిందువులను మైనారిటీలుగా చేసే కుట్రకు కాంగ్రెస్ పాల్పడుతోందని బండి సంజయ్ ఆరోపించారు. కాంగ్రెస్ జంతర్‌మంతర్ ధర్నాకు బీసీల మద్దతు కరువైందని కామెంట్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తేనే తాము బిల్లులకు మద్దతిస్తామని తేల్చి చెప్పారు. బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఎన్నడైనా ఓ బీసీని ప్రధాని చేశారా అని ధ్వజమెత్తారు. ఉమ్మడి ఏపీలో 48 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క బీసీని కూడా ముఖ్యమంత్రిని చేసిన పాపాన పోలేదని.. నేడు మళ్లీ బీసీ రిజర్వేషన్లపై మొసలి కన్నీరు కారుస్తున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర కేబినెట్‌‌తో పాటు నామినేటెడ్ పదవులను ఎంతమంది బీసీలకు ఇచ్చారో చర్చకు సిద్ధమా అని ఆయన ప్రభుత్వ పెద్దలకు సవాల్ విసిరారు. బీసీని ప్రధాని చేసిన ఘనత బీజేపీదేనని.. కాంగ్రెస్ నేతలు బీసీల గురించి మాకు నీతులు చెప్పేదేందని అన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశం పేరుతో కేంద్రంపై నెపం మోపి కాంగ్రెస్ గేమ్ ఆడేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో యూపీ, బెంగాల్, బీహార్ తరహాలోనూ తెలంగాణలోనూ కాంగ్రెస్‌కు కనుమరుగవడం తథ్యమని బండి సంజయ్ అన్నారు.

Next Story