- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముమ్మాటికీ అది తప్పుడు ప్రసారమే... ఐపీఎస్ అధికారుల సంఘం
మహిళా ఐఏఎస్ అధికారులపై ఆధారంలేని ఆరోపణలతో కొన్ని మీడియా వేదికల్లో ప్రసారమైన కార్యక్రమాన్ని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: మహిళా ఐఏఎస్ అధికారులపై ఆధారంలేని ఆరోపణలతో కొన్ని మీడియా వేదికల్లో ప్రసారమైన కార్యక్రమాన్ని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ విషయంలో ఇప్పటికే నిరసన వ్యక్తం చేసిన ఐఏఎస్ అధికారుల సంఘానికి సంఘీభావం ప్రకటిస్తూ, ఆ ప్రసారాన్ని బాధ్యతారహితమైనది, దురుద్దేశపూరితమైనది, ఉద్దేశపూర్వకంగా చేసిన దుష్ప్రచారంగా పేర్కొంది. జర్నలిజం ముసుగులో వ్యక్తిత్వ హననం చేయడం, మహిళా అధికారులపై అపవాదులు మోపడం తీవ్రమైన ఘోరమని ఐపీఎస్ సంఘం పేర్కొంది. ధృవీకరించని కథనాలు, కల్పిత కథలు, పరిపాలనా ప్రక్రియల్ని వక్రీకరించి ప్రసారం చేయడం మహిళా అధికారుల గౌరవం, గోప్యత, వృత్తిపరమైన ప్రతిష్ఠకు భంగం కలిగిస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది రాజ్యాంగ పాలన, చట్టపాలన, ప్రజాసేవ పునాదులనే దెబ్బతీసే చర్యగా అభివర్ణించింది.
మహిళా అధికారులు కఠిన పరిస్థితుల్లోనూ నిబద్ధత, ధైర్యం, వృత్తిపరమైన సమగ్రతతో సేవలందిస్తున్నారని సంఘం గుర్తుచేసింది. వారి పోస్టింగులు, వ్యక్తిగత ప్రవర్తనలపై ఊహాగానాలు, లీక్ చేసిన లేదా కల్పిత సమాచారంతో అపఖ్యాతి పాలు చేయడం నైతికంగా, చట్టపరంగా, సామాజికంగా అసహ్యకరమని పేర్కొంది. ఇటువంటి మీడియా కథనాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సంబంధిత మీడియా సంస్థలు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని, సంబంధిత కంటెంట్‌ను అన్ని వేదికల నుంచి తొలగించాలని, జర్నలిజం విలువలకు కట్టుబడి వ్యవహరించాలని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి తప్పుడు కంటెంట్ ప్రచారం చేస్తే చట్టపరమైన పౌర, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. మహిళా అధికారుల పట్ల అగౌరవంగా వ్యవహరిస్తే సహించేది లేదని... తప్పుడు కథనాల ద్వారా అధికారులను బెదిరించే లేదా దూషించే ప్రయత్నాలను ఐక్యంగా, కఠినంగా ఎదుర్కొంటామని ఐపీఎస్ అధికారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి విక్రమ్ మాన్ సింగ్ హెచ్చరించారు.






