- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం దుర్మార్గం.. ప్రభుత్వంపై హరీశ్‌రావు ఫైర్
ఎన్నికల ముందు కాంగ్రెస్ (Congress) తమకు ప్రతి నెలా రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తామని, కమీషన్ పెంచుతామని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రేషన్ డీలర్లు ఆందోళన బాటపట్టిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల ముందు కాంగ్రెస్ (Congress) తమకు ప్రతి నెలా రూ.5 వేల గౌరవ వేతనం ఇస్తామని, కమీషన్ పెంచుతామని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రేషన్ డీలర్లు ఆందోళన బాటపట్టిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చాక రేషన్ కమీషన్ బకాయిలు విడుదల చేయకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో రేషన్ డీలర్ల వ్యథపై మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ వేదికగా ట్వీట్ చేశారు. నెలల తరబడి రేషన్ కమీషన్ చెల్లించకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రేషన్ డీలర్ల జీవితాలతో చెలగాటం ఆడటం దుర్మార్గమని అన్నారు. నిరుపేదలకు రేషన్ బియ్యం పంపిణీ చేస్తూ, వారి ఆకలి తీర్చుతున్న రేషన్ డీలర్లకు కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల తీరుతో పస్తులుండే పరిస్థితి రావడం శోచనీయమని కామెంట్ చేశారు. రేషన్ బియ్యం పంపిణీకి సంబంధించిన కమీషన్ అందక వారు ఇబ్బందులు పడుతుంటే సర్కార్ మొద్దు నిద్ర నటిస్తుండటం దారుణమని అన్నారు. అభయహస్తం పేరిట విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోలో రేషన్ డీలర్లకు రూ.5 వేల గౌరవ వేతనంతో పాటు కమీషన్ పెంపు చేస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. కానీ, అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా హామీలపై నేటికీ అతీగతీ లేదన్నారు. ఎన్నికల ముందు అబద్ధపు హామీలతో నమ్మించి ఇప్పుడు నట్టేట ముంచేస్తున్నారని ఫైర్ అయ్యారు. మాటలు తప్ప చేతలు లేని కోతల ప్రభుత్వం ఇదేనని సైటైర్లు వేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023లో సచివాలయానికి రేషన్ డీలర్లను ఆహ్వానించి వారి సమస్యలను విని పరిష్కరించామని అన్నారు. మెట్రిక్ టన్నుకు ఇచ్చే కమీషన్‌ను రూ.900 నుంచి రూ.1,400 పెంచామని గుర్తు చేశారు. నాడు ప్రభుత్వంపై రూ.139 కోట్ల అదనపు భారం పడుతున్నా.. రేషన్ డీలర్ల సంతోషం కోసం కేసీఆర్ ధీటైన నిర్ణయం తీసుకున్నారని హరీశ్ రావు కొనియాడారు.
రాష్ట్రంలో 17 వేలకు పైగా ఉన్న రేషన్ డీలర్ల ముఖాల్లో చిరునవ్వులు నింపిన ఘటన బీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కిందని హరీశ్ రావు తెలిపారు. కమీషన్ చెల్లించడమే కాదు.. కరోనా సమయంలో సేవలందిస్తూ మరణించిన 100 మంది డీలర్ల వారసులకు కారుణ్య నియామకం కింద డీలర్‌షీప్ మంజూరు చేశామని పేర్కొన్నారు. రేషన్ డీలర్ల వయో పరిమితిని రూ.40 నుంచి రూ.50 ఏళ్లకు పెంచామని అన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన హామీని సైతం అమలు చేయకుండా రేషన్ డీలర్ల పాలిట శకునిలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. రేషన్ డీలర్లకు బతుకమ్మ, దసరా, దీపావళి పండుగల సంబురాన్ని లేకుండా చేస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. 6 నెలలుగా పెండింగ్‌లో ఉన్న కేంద్ర ప్రభుత్వ కమీషన్, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన సెప్టెంబర్ కమీషన్‌ను వెంటనే విడుదల చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు రూ.5 వేల గౌరవ వేతనం, కమీషన్ పెంపు ప్రకటించాలని బీఆర్ఎస్ (BRS) పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని హరీశ్ రావు అన్నారు.






