- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రైతులు అవస్థలు పడుతున్నా పట్టింపు లేదా.. సర్కార్‌పై ఎమ్మెల్సీ కవిత ఫైర్
రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పంట సాగు కోసం రైతులు యూరియా కొనుగోళ్లకు ఎగబడుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పంట సాగు కోసం రైతులు యూరియా కొనుగోళ్లకు ఎగబడుతున్నారు. తెల్లవారింది మొదలు ప్రాథమిక వ్యయసాయ సహకార పరపతి సంఘాల వద్ద క్యూ లైన్లలో తమ పాదరక్షలు పెట్టి తమ వంతు కోసం కళ్లుకాయలకు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో యూరియా కోసం అన్నదాతలు పడుతున్న కష్టాలపై తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘X’ వేదికగా ఫైర్ అయ్యారు.
వానాకాలం పంట సీజన్ ఆరంభం నుంచే రైతులు అవస్థలు పడుతున్నా.. ప్రభుత్వానికి పట్టింపు లేదా అని ప్రశ్నించారు. పంట సీజన్ మొదలై నెలన్నర తర్వాత వ్యవసాయ శాఖపై సమీక్ష చేసిన సీఎం దేశంలోనే రేవంత్ రెడ్డి ఒక్కరేనేమోనని ఎద్దేవా చేశారు. నేటి వరకు రైతుల కష్టాలు తీరలేదని.. నిత్యం యూరియా కోసం అగచాట్లు తప్పడం లేదని ఆక్షేపించారు. పంట సీజన్‌కు ముందే ప్రభుత్వం అప్రమత్తమై ఉంటే ఇవాళ అన్నదాతలు ఇలా క్యూ లైన్లలో అవస్థలు పడాల్సిన అవసరం ఉండేది కాదుగా అని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి కేంద్ర సర్కార్ నిర్లప్తత తోడు కావడంతో మన రైతులు పొలం పనులు వదిలేసి యూరియా కోసం పరుగులు తీస్తున్నారని ధ్వజమెత్తారు. యూరియా కోసం కేంద్రాన్ని బెదిరించడం కాదు.. రాష్ట్రానికి రావాల్సిన కోటా కోసం కోట్లాడి అయినా రైతుల కష్టాలు తీర్చాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.






