మొక్కలను నాటండి ..భూమాతను రక్షించండి

by Ajay Maddhiboyina |

ప్రస్తుత జీవనాన్ని మెరుగుపరచడంలో, భవిష్యత్తు తరాన్ని సంరంక్షించడంలోనూ చెట్లతో పెరిగే వన సంపద కీలక పాత్ర పోషిస్తుందని, చెట్లు గాలి, నీడ, ఆహారం, ఔషధాలను అందించడంతో పాటుగా నేల సంరక్షణకు, నీటి నిల్వకు సహాయపడతాయని ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఇస్కీ) డైరెక్టర్ డాక్టర్ జి.రామేశ్వర్ రావు అన్నారు.

మొక్కలను నాటండి ..భూమాతను రక్షించండి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రస్తుత జీవనాన్ని మెరుగుపరచడంలో, భవిష్యత్తు తరాన్ని సంరంక్షించడంలోనూ చెట్లతో పెరిగే వన సంపద కీలక పాత్ర పోషిస్తుందని, చెట్లు గాలి, నీడ, ఆహారం, ఔషధాలను అందించడంతో పాటుగా నేల సంరక్షణకు, నీటి నిల్వకు సహాయపడతాయని ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఇస్కీ) డైరెక్టర్ డాక్టర్ జి.రామేశ్వర్ రావు అన్నారు. కేంద్ర రోడ్ రవాణా హై వేస్ ప్రతిపాదించిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ అంటే, తల్లి పేరు మీద ఒక చెట్టు నాటండి నినాదంతో ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్న డైరెక్టర్ స్థాయి నుండి కింది స్థాయి వరకు పనిచేసే ప్రతి సిబ్బంది మంగళవారం కాలేజ్ ఆవరణలో పెద్ద ఎత్తున మొక్కలను నాటారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ చెట్లు కాలుష్యాన్ని తగ్గించడంలోను, జీవవైవిధ్యాన్ని కాపాడడంలోను, ఆరోగ్యకరమైన పర్యావరణాన్ని కల్పించడంలో తోడ్పడతాయని, ఒక చెట్టును కూల్చితే వంద చెట్లు నాటే విధంగా ప్రతి మనిషిలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు రామేశ్వర రావు. కేంద్ర రవాణా హై వేస్ దేశం మొత్తం మీద గుర్తించిన పన్నెండు ప్రముఖ సంస్థల్లో హైదరాబాద్ లోని ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా ఒకటని, ఈ పన్నెండు సంస్థల్లో మొదటి రోజున కార్యాలయ పరిసర ప్రాంతాలను పరిశుభ్రం చేసుకోవడం, రెండవ రోజున కార్యాలయ ప్రాంగణాల్లో పెద్ద ఎత్తున మొక్కలను నాటడం చేయగా, నిన్న ఈరోజు జరిగిన ఈ రెండు కార్యక్రమాల్లో ఎస్కి సిబ్బంది మొత్తం పాల్గొన్నారన్నారు.

స్వచ్ఛ భారత్ కోసం ఈ కార్యక్రమాలు అవసరమని, ఇందుకోసం ఎస్కీ లో ఇకముందు ప్రతీ నెలలో ఒకరోజు తప్పనిసరిగా కేటాయిస్తామన్నారు. సమావేశం ప్రారంభంలో స్వచ్ఛ భారత్ కోసం మహాత్మా గాంధీ కలలుగన్న సందేశాన్ని కాలేజ్ సిబ్బందిచే కాలేజ్ డైరెక్టర్ డాక్టర్ రామేశ్వర్ రావు ప్రతిజ్ఞ చేయించారు. వారానికి రెండు గంటల చొప్పున ఏడాది కాలంలో వంద గంటలు స్వచ్ఛత కోసం పనిచేస్తానని, నేను, నా కుటుంబం, నా ప్రాంతం, నా గ్రామం, నేను పనిచేస్తున్న ప్రదేశంలో స్వచ్ఛతను పాటిస్తానని, నేను చేస్తున్న ప్రతిజ్ఞ మరొక వంద మందితో చేయిస్తానని డాక్టర్ రామేశ్వర్ రావు కాలేజ్ సిబ్బందిచే ప్రమాణం చేయించారు.

Next Story