- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Harish Rao Letter : మీ నిరాహారదీక్షకు ఇదేనా ఫలితం : సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ
మల్లన్నసాగర్ నిర్వాసితుల(Mallannasagar Victims) పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ(Harish Rao Letter )రాశారు.

దిశ, వెబ్ డెస్క్ : మల్లన్నసాగర్ నిర్వాసితుల(Mallannasagar Victims) పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు లేఖ(Harish Rao Letter )రాశారు. మీ నిరాహార దీక్షకు ఇదేనా ఫలిమంటూ హరీష్ రావు మల్లన్న సాగర్ నిర్వాసితులకు ప్రభుత్వం సహాయం చేయకపోవడాన్ని ప్రశ్నించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మల్లన్నసాగర్ నిర్వాసితుల పక్షాన రాజకీయం చేసి సిద్దిపేట జిల్లాలో నిర్మించిన శ్రీ కొమురవెల్లి మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్వాసితులకు అండగా ఉంటానని ఏటిగడ్డ కిష్టాపూర్‌లో నిరాహారదీక్ష చేపట్టారని..ప్రస్తుతం ముఖ్యమంత్రి హోదాలో ఉన్నందున ఆ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత మీపై ఉందని హరీష్ రావు తన లేఖలో డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 90 శాతం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ, పునరావాస కాలనీల నిర్మాణం, ఇంటి స్థలాలు, మౌలిక సౌకర్యాలను కల్పించడం జరిగిందని... మిగిలిన 10శాతం సమస్యలు గత ఏడాది కాలంగా పెండింగ్ లోనే ఉన్నాయని హరీష్ రావు గుర్తు చేశారు. మిగతా 10శాతం పనులను పూర్తి చేయడంతో పాటు అక్కడక్కడ మిస్సయినవారికి, కోర్టు తీర్పు ద్వారా పరిహారం రావాల్సిన వారికి వెంటనే పరిహారం చెల్లించాలని లేఖలో కోరారు. మీరు పునరావాస కాలనీలకు మహర్దశ పట్టిస్తారని.. నాడు దీక్ష సందర్భంలో చెప్పినట్లుగా ఇంకా ఎక్కువ పరిహారం చెల్లించాలని నిర్వాసితుల పక్షాన ప్రశ్నిస్తునని లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోసి.. అధికారంలోకి రాగానే నిర్వాసితుల సమస్యలకు దూరంగా ఉండటం విడ్డూరంగా ఉందని రేవంత్ రెడ్డిని నిలదీశారు.
మీ నిర్ణయం కోసం మల్లన్నసాగర్ నిర్వాసితులు ఏడాది కాలంగా ఎదురుచూస్తున్నారని, వారి కోసం గతంలో మీరు నిరాహారదీక్ష చేసి..ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో నిర్వాసితులు మీపైనే ఆశలు పెట్టుకున్నారని పెండింగ్ సమస్యల పరిష్కారంతోపాటుగా మరింత మెరుగైన సౌకర్యాలు, మెరుగైన పరిహారాన్ని అందిస్తారని ఎదురుచూస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆనాడు మీరు నిరాహారదీక్ష చేపట్టిన సమయంలో మా ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారని..ఇప్పుడు మీరు సీఎంగా నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈరోజు నేను కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానని.. నాడు మేము తక్కువ పరిహారం ఇచ్చామని మీరు ఆరోపణలు చేశారని.. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో ఎక్కువ పరిహారం ఇచ్చి నిర్వాసితుల దగ్గర మీ మాట నిలబెట్టుకోవాలని కోరారు.
నిరాహారదీక్ష పేరిట ఆనాడు మీరు చేసింది రాజకీయమా.. న్యాయ పోరాటమా.. అనేది మీ నిర్ణయాన్ని బట్టి తేలిపోతుందన్నారు. ప్రతిపక్షంలో మాట్లాడిన మాటలను అధికారంలోకి రాగానే విస్మరించినట్లు అవుతుందన్నారు. కావున మల్లన్న సాగర్ ను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న మీరు.. ఆ మల్లన్నసాగర్ నిర్వాసితుల పరిస్థితిని మానవతాధృక్పథంతో అర్థం చేసుకొని ఒక ముఖ్యమంత్రిగా వారిని ఆదుకోవాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.
మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణ సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన 2013 భూసేకరణ చట్టంతో నిర్వాసితులకు 121 గజాల ఇంటి స్థలం, ఒక లక్షా 25వేల రూపాయలు మాత్రమే అందించాలనే నిబంధన ఉందని.. లక్షలాది మంది రైతుల కోసం త్యాగాలు చేసిన నిర్వాసితులకు మెరుగైన పరిహారం ఇవ్వడానికి దేశ చరిత్రలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వము అమలు చేయని విధంగా మెరుగైన ప్యాకేజీని మల్లన్నసాగర్ నిర్వాసితుల కోసం నాడు కేసీఆర్ అమల్లోకి తెచ్చారని చెప్పారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కింద ప్రతీ నిర్వాసితుడికి గజ్వేల్ పట్టణ సమీపంలోనే 250 గజాల ఇంటిస్థలం, ఇంటి నిర్మాణానికి 5.04 లక్షల రూపాయలు, 7.50లక్షల పరిహారం అందజేశామన్నారు. 18ఏళ్ల వయసు నిండిన ప్రతీ ఒక్కరికి 5లక్షల రూపాయల పరిహారం, 250గజాల ఇంటి స్థలం కేటాయించడం జరిగిందని వీటితోపాటు పాత ఇండ్ల నిర్మాణ స్ట్రక్చర్‌కు కూడా సరైన లెక్క కట్టించి పరిహారం ఇచ్చామని లేఖలో గుర్తు చేశారు.
ప్యాకేజీతోపాటు నిర్వాసితులకు వారి గ్రామాల పేరిట ఆర్‌అండ్‌ఆర్ కాలనీలను నిర్మించి బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొనసాగేవరకు దాదాపుగా అన్ని వసతులను దశలవారీగా సమకూర్చడం జరిగిందని వివరించారు. ఇందుకోసం 1260 కోట్ల రూపాయలను ఖర్చు చేసి నిర్వాసితులకు అత్యంత ప్రాధాన్యతను కల్పించామని.. ఈ నిధులతో 90శాతం పనులను చకచకా పూర్తిచేయడం జరిగిందని తెలిపారు. మిగితా 10శాతం పనులతో పాటు కోర్టు కేసుల్లో తీర్పు వచ్చినవారికి, అక్కడక్కడ ప్యాకేజీ మిస్సయినవారికి పరిహారం అందించాల్సి ఉందన్నారు. ప్రభుత్వం మారిన క్రమంలో ఆ మిగితా పనులను పూర్తి చేయలేకపోయామని.. ముంపు గ్రామాలకు చెందిన వితంతువులను కూడా కుటుంబంగా పరిగణించి వారికి ప్యాకేజీ ఇవ్వాలని ఇటీవల గౌరవ హైకోర్టు తీర్పు వెల్లడించిందన్నారు.
వెంటనే వితంతువులకు పరిహారం అందించి వారి కుటుంబాలను ఆదుకోవాలని హరీష్ రావు కోరారు. లక్షలాది ఎకరాలకు సాగునీటితోపాటు హైదరాబాద్ సహ అనేక ప్రాంతాలకు తాగునీటి కష్టాలను తీరుస్తున్న మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణం వెనుక నిర్వాసితుల త్యాగాలు ఉన్నాయని.. మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రిజర్వాయర్‌ను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారని గుర్తు చేశారు. హైదారాబాద్ తాగునీటి అవసరాలతో పాటు మూసీ నదిలో గోదావరి జలాలను తరలించడానికి మీరు మల్లన్నసాగర్ పై ఆధారపడ్డారన్నారు. ఇక్కడి నుంచే 20 టీఎంసీల నీటిని హైద్రాబాద్ తరలించేందుకు టెండర్ల ప్రక్రియ కూడా చేపడుతున్నట్లు తెలుస్తున్నదన్నారు. ఒక్క విషయం మీరు అర్థం చేసుకోవాలని.. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని.. కాళేశ్వరంతో ప్రయోజనం లేదని మీరు స్వయంగా విమర్శలు చేశారని.. మరి కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉన్న మల్లన్న సాగర్ రిజర్వాయర్ నీళ్ళ కోసం ఎందుకు తాపత్రయపడుతున్నారని హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డిన లేఖలో ప్రశ్నించారు.






