Kavitha: ప్రశాంత్ కిశోర్, కవిత చేతుల్లో బీఆర్ఎస్ గుట్టు!.. తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతోంది?

by Prasad Jukanti |   (  Updated:2026-01-19 13:39:57  IST  )

బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ ఏర్పాటుకు కసరత్తు వేగవంతం చేశారు. ప్రశాంత్ కిశోర్, రాబిన్ శర్మలతో భేటీల ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.

Kavitha: ప్రశాంత్ కిశోర్, కవిత చేతుల్లో బీఆర్ఎస్ గుట్టు!.. తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతోంది?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయ పరిణామాలు రోజు రోజుకు ఆసక్తిని రేపుతున్నాయి. వరుస ఎన్నికలు, కొత్త రాజకీయ పార్టీల హడావుడితో స్టేట్ పొలిటికల్ సర్కిల్ అంతా హాట్ హాట్‍గా మారింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‍గా ప్రధాన పార్టీలు అస్త్రాలను సిద్ధం చేసుకుంటుంటే మరోవైపు కొత్త పార్టీలు పుట్టుకురావడం ఆసక్తిని రేపుతోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డాటర్ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) వ్యవహారం సంచలనంగా మారింది. బీఆర్ఎస్‍తో తెగదెంపులు చేసుకున్న ఆమె వచ్చే ఉగాది నాటికి రాజకీయ పార్టీని అనౌన్స్ చేసేలా కసరత్తు వేగవంతం చేశారు. ఇందులో భాంగగా ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‍తో (Prashant Kishor) ఆమె ఇటీవల వరుసగా భేటీ అయ్యారనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. అయితే కేవలం పీకేతో మాత్రమే కాకుండా టీడీపీకి వ్యూహకర్తగా వ్యవహరించిన రాబిన్ శర్మతోనూ (Robin Sharma) కవిత మంతనాలు జరిపారనే చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

పీకే, కవిత చేతిలో బీఆర్ఎస్ బలాబలాలు!:

ఏ మాత్రం అవకాశం దొరికినా కవిత బీఆర్ఎస్‍పై నిప్పులు చెరుగుతున్నారు. ప్రారంభంలో తన తండ్రిపై సాఫ్ట్ కార్నర్ చూపిన కవిత ఇక కేసీఆర్ తోనే నేరుగా ఢీ అంటే ఢీ అనేలా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ పై అగ్గిమీద గుగ్గిలం అవుతున్న కవిత పీకేతో చర్చలు జరిపారనే వార్తలు ఆసక్తిని రేపుతున్నాయి. ఈ పరిణామం బీఆర్ఎస్ ను మరింత చిక్కుల్లోకి నెట్టబోతోందా? అనే సందేహాలు రాజకీయ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. నిజానికి ప్రశాంత్ కిశోర్ గతంలో బీఆర్ఎస్‍కు వ్యూహకర్తగా పనిచేశారు. అందువల్ల బీఆర్ఎస్ పార్టీ బలాబలాలు ఏంటో ఆయనకు బాగా తెలుసు. ఇక కవిత టార్గెట్ బీఆర్ఎస్ కావడంతో కేసీఆర్ ను దగ్గరినుండి చూసిన వ్యక్తిగా అధినేత వ్యూహాలు, పార్టీ బలహీనతలు ఆమెకు తెలుసు అనే చర్చ జరుగుతోంది.

కేసీఆర్‍కు మరింత చాలెంజ్ తప్పదా?:

జరుగుతున్న పరిణామాల నేపత్యంలో పీకే, కవిత కాంబినేషన్‍లో పొలిటిక్ స్ట్రాటజీ రూపుదిద్దుకుంటే అది బీఆర్ఎస్‍కు ఏ మేరకు మైనస్ కాబోతోంది అనేది రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు కవిత తన వ్యాఖ్యలతో తీవ్ర స్థాయిలో డ్యామేజ్ చేస్తున్నా బీఆర్ఎస్ అగ్రనాయకత్వం కనీసం స్పందించడం లేదు. ఒకరిద్దరు నాయకులు అగ్రెసివ్‍గా కౌంటర్లు ఇచ్చినా అది కూడా తాత్కాలికంగానే ఉంటున్నాయి. రాష్ట్రంలో అధికారం కోల్పోయాక బీఆర్ఎస్‍కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్‍ను బొందపెట్టడమే తన లక్ష్యం అని పదే పదే చెబుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణుల మద్దతును సైతం ఆయన కోరడం సంచలనం రేపుతోంది. ఇటువంటి పరిణామాల మధ్య గతంలో బీఆర్ఎస్‍తో పని చేసిన పీకే, టీడీపీకి వ్యూహకర్తగా ఉన్న రాబిన్ శర్మలతో కవిత ఎలాంటి వ్యూహరచన చేస్తున్నారు? ఈ పరిణామాలతో గులాబీ బాస్ కేసీఆర్‍కు మరింత చాలెంజ్ తప్పదా అనేది తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠగా మారింది.

Next Story