పూలే మళ్లీ పుట్టాడా? అదే స్థాయిలో బీసీల కోసం జాగృతి పోరాటం: కవిత

by Ramesh Naini |

కేంద్రంలోని బీజేపీ పాలకులకు బీసీలంటే భయం లేకపోవటంతోనే మహిళ రిజర్వేషన్ బిల్లులో బీసీ సబ్ కోటా పెట్టలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు.

పూలే మళ్లీ పుట్టాడా? అదే స్థాయిలో బీసీల కోసం జాగృతి పోరాటం: కవిత
X

దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్రంలోని బీజేపీ పాలకులకు బీసీలంటే భయం లేకపోవటంతోనే మహిళ రిజర్వేషన్ బిల్లులో బీసీ సబ్ కోటా పెట్టలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. మహిళ రిజర్వేషన్ బిల్లు కోసం జాగృతి ఎంత కమిట్ మెంట్ తో ఉద్యమం చేసిందో బీసీ సబ్ కోటా కోసం అంతే కమిట్ మెంట్ తో పనిచేస్తుందని తేల్చిచెప్పారు. శనివారం పూలే జయంతి పురస్కరించుకుని తమ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ ఉప కోటా కోసం కేంద్రం వెన్నులో వణుకు పుట్టేలా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. మహాత్మా పూలేనే మళ్లీ పుట్టారా అనే స్థాయిలో తమ పోరాటం ఉంటుందన్నారు. దేశంలో మహిళ రిజర్వేషన్ బిల్లు రావటంలో జాగృతి ఉద్యమమే కీలకం అన్న విషయాన్ని మనమంతా సగర్వంగా చెప్పుకోవాలన్నారు. అంతటితో ఆగకుండా బీసీలకు ఉప కోటా వచ్చే వరకు పోరాడుదామన్నారు. ఈ నెల 16, 17, 18 తేదీల్లో మహిళ రిజర్వేషన్ బిల్లుపై పార్లమెంట్ లో చర్చ జరగనున్న నేపథ్యంలో అవసరమైతే ఢిల్లీకి వెళ్తామని చెప్పారు. బీసీ కోటా కోసం అన్ని పార్టీల నాయకులతో మాట్లాడుతామని అన్నారు. అధికార బలం ఉందని బీసీ కోటా లేకుండా బిల్లు పాస్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని హెచ్చరించారు.

బీసీ కోటా వచ్చే వరకు జాగృతి పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేయాల్సిన పూలే విగ్రహం విషయంలో ప్రభుత్వం అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అసెంబ్లీలో పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని జాగృతి డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తాము అసెంబ్లీ ఆవరణలో విగ్రహం ఏర్పాటు చేయాలని కోరితే ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఈనెల 14న అంబేద్కర్ జయంతి రోజు నాటికైనా పూలే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పూలే ఆశయాల సాధన కోసం అహర్నిశలు పనిచేయటమే ఆయనకు నిజమైన నివాళి అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చిన సరే వెన్ను చూపకుండా పోరాడిన త్యాగధనులు పూలేనని చెప్పారు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్జిజన్లను రెగ్యులర్ చేయాలని తమ డిమాండ్ల సాధన కోసం కొత్తగూడెంలో ధర్నా చేస్తున్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. వారికి మద్దతుగా రాష్ట్రంలోని ఆర్టిజన్లంతా కొత్తగూడెంలో చేస్తున్న ధర్నాలో జాగృతి నాయకులుగా కూడా పాల్గొంటారని తెలిపారు.

Next Story