తెలంగాణ రాజకీయాల్లో గులాబీ పార్టీ సంక్షోభం.. కేసీఆర్ పట్టు కోల్పోతున్నారా?

by Naga Rani Yarlagadda |

రాజకీయాల్లో వ్యూహాలు రచించడంలో గండరగండుడుగా పేరున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఫెయిల్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అటు ప్రజాసమస్యలపై, ఇటు పార్టీలో జరుగుతోన్న పరిణామాలను ఆయన పట్టించుకోక పోవడమే ఇందుకు కారణాలుగా చూపుతున్నారు.

తెలంగాణ రాజకీయాల్లో గులాబీ పార్టీ సంక్షోభం.. కేసీఆర్ పట్టు కోల్పోతున్నారా?
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాజకీయాల్లో వ్యూహాలు రచించడంలో గండరగండుడుగా పేరున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఫెయిల్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. అటు ప్రజాసమస్యలపై, ఇటు పార్టీలో జరుగుతోన్న పరిణామాలను ఆయన పట్టించుకోక పోవడమే ఇందుకు కారణాలుగా చూపుతున్నారు. ప్రతిపక్షనేతగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైనా కనీసం నోరు విప్పట్లేదనే విమర్శలు మొదటి నుంచీ కేసీఆర్‌ను వెంటాడుతున్నాయి. అసెంబ్లీకి మొక్కుబడిగా వస్తారని, వచ్చినా చర్చల్లో పాల్గొనరనే అపవాదు ఆయనపై ఉన్నది. సొంత పార్టీలో జరుగుతున్న పరిణామాలను సైతం ఆయన కంట్రోల్ చేయలేకపోతున్నారని, అందుకే కూతురు కవిత ధిక్కార స్వరం వినిపిస్తున్నారనే చర్చ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

ఫామ్‌హౌజ్‌లోనే మకాం..

పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎవరైనా లీడర్, కేడర్‌కు నిత్యం అందుబాటులో ఉండటం సహజం. అందులో ప్రతిపక్షనేత పదవిలో ఉంటే ఇంకా బిజీగా ఉంటారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం అనునిత్యం ఏదో ఒక ప్రోగ్రామ్ నిర్వహిస్తూ ఉంటారు. అందుకు ఏపీలో చంద్రబాబు నాయుడును ప్రతి ఒక్కరూ ఉదహరిస్తూ ఉంటారు. ఎన్ని్కల్లో ఓడిపోయినా ఆయన నిత్యం ప్రజల్లో ఉంటూ మళ్లీ ఎన్నికలు వచ్చేంత వరకూ వారి మధ్యనే కనిపించారు. కానీ, కేసీఆర్ మాత్రం అధికారం పోయిన తర్వాత నుంచి ప్రజలకు అందుబాటులో లేరని, కేవలం ఫామ్‌హౌజ్‌లోనే ఉంటున్నారని విమర్శలున్నాయి. ప్రతిపక్షనేతగా ఉన్న ఆయన అసెంబ్లీలో జరిగిన చర్చల్లో ఇప్పటి వరకూ పాల్గొనలేదు. నామ్ కే వాస్తే అన్నట్టు కేవలం రెండు సార్లు మాత్రమే వచ్చి వెళ్లారు. అలాగే అపోజిషన్ లీడర్‌గా రాజ్‌భవన్‌లో జరిగే ఏ కార్యక్రమానికీ గులాబీ అధినేత అటెండ్ అవ్వలేదు.

పట్టించుకోకపోవడం వల్లే ఎమ్మెల్యేలు దూరం!

పార్టీలో జరుగుతోన్న పరిణామాలను కేసీఆర్ పట్టించుకోకపోవడం వల్లే పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ వీడారనే టాక్ ఉన్నది. నిజానికి ఆయన కాస్త టైమ్ తీసుకుని పార్టీ నుంచి వెళ్లేందుకు సిద్ధమవుతున్న ఎమ్మెల్యేలతో మాట్లాడి వారిలో భరోసా నింపే ప్రయత్నం చేసి ఉంటే కొందరైనా అందులోనే కొనసాగే వారనే అభిప్రాయాలున్నాయి. పార్టీ లీడర్లతో రెగ్యులర్‌గా సమావేశాలు పెట్టేందుకు కేసీఆర్‌కు ఇంట్రెస్ట్ ఉండదని ఆరోపణలున్నాయి. కనీసం సీనియర్ లీడర్లకు అయినా టైం ఇచ్చి, వారికి దిశానిర్దేశం చేసి ఉంటే పరిస్థితులు మరోలా ఉండేవని అభిప్రాయాలున్నాయి.

సొంత కూతురు కవితను కట్టడి చేయలేక పోయారా?

25 ఏళ్ల గులాబీ పార్టీ ప్రస్థానంలో చాలా మంది కేసీఆర్‌ను విబేధించి బయటికి వచ్చారు. అందులో కొందరిని బలవంతంగా సాగనంపేందుకు పరిస్థితులు సృష్టించారనే విమర్శలుండగా.. ఇంకొందరు ఓపెన్‌గా కేసీఆర్‌పైనే విమర్శలు చేసి బయటికొచ్చారు. అయితే, తనకు ఇష్టం లేని లీడర్‌ను ఎప్పుడు పుల్‌స్టాప్ పెట్టాలో సరిగ్గా అంచనా వేసిన తర్వాత కేసీఆర్ డెసిషన్ తీసుకునే వారనే టాక్ ఉంది. కొన్ని సార్లు అవి వికటించిన సందర్భాలూ ఉన్నాయి. కానీ సొంత కూతురు కవిత పార్టీ పనితీరును బహిరంగంగా ప్రశ్నించే వరకు ఎందుకు వచ్చింది? దీనిని ఆయన ముందుగానే గ్రహించారా? ఒక వేళ తెలిసినా పట్టించుకోలేదా? అనే ప్రశ్నలు ఇప్పుడు పొలిటికల్‌గా చక్కర్లు కొడుతున్నాయి. కవిత బయటికు వెళ్లి పార్టీపై విమర్శలు చేస్తే ఆ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో కేసీఆర్‌కు తెలుసు. అందు కోసం ఆమెను వారించడమో లేదా బుజ్జగించడమో వంటి పనులు ఎందుకు చేయలేదు? ఒక వేళ ఆ ప్రయత్నాలు చేసి కేసీఆర్ ఫెయిల్ అయ్యారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇతర నేతలైతే వెంటనే చర్యలు

కవిత లేవనెత్తిన అంశాలను సమర్ధించే బీఆర్ఎస్ లీడర్లు ఉన్నారు. పార్టీ మనగడ కోసం ఆమె చేసిన సూచనలు సరైనవే అంటూ కొందరు అంటున్నారు. దీంత ఈ రకంగానూ కేసీఆర్‌‌కు కేడర్ నుంచి నిరసన ఎదురవుతోంది. అయితే, కవిత స్థానంలో మరో ఇతర నేత ఎవరైనా బహిరంగంగా వ్యాఖ్యలు చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. వెంటనే సదరు నేతకు నోటీసులు ఇవ్వడమో లేక పార్టీ నుంచి బహిష్కరించడమో వంటి చర్యలుండేవి. అలాంటి ఉదంతాలు గులాబీ పార్టీలో ఇప్పటి వరకు చాలా జరిగాయి. తొలిసారి ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో డిప్యూటీ సీఎంగా ఉన్న రాజయ్యను పదవి నుంచి బర్తరఫ్ చేశారు. ఎందుకు ఆ విధంగా చేశారో ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని విషయం. రెండో సారి పవర్‌లోకి వచ్చాక మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌పై వేటు వేశారు. ఈటలపైనా అంత కఠిన నిర్ణయం తీసుకోవడానికి కారణాలు ఎంటో అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయిందని టాక్ ఉంది.

ఉద్యమ కాలం నుంచి కేసీఆర్‌ది ఇదే తీరు

తెలంగాణ ఉద్యమ కాలం నుంచే కేసీఆర్ నెలల కొద్ది ఎవరికీ అందుబాటులో ఉండేవారు కాదు. అయన ఎక్కడున్నారో ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్న సందర్భాలున్నాయి. సడన్‌గా ఒక రోజు మీడియా ముందుకొచ్చి కొత్త స్ట్రాటజీతో అప్పటి ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టిన సందర్భాలు, ఆ తర్వాత ఆయన చుట్టూ రాజకీయాలు కొనసాగిన ఉదంతాలు ఉన్నాయి. ‘ఇదంతా ఉద్యమ కాలంలో జరిగింది. ఎందుకంటే ఆనాడు ప్రజల్లో తెలంగాణ రాష్ట్రం కావాలనే బలమైన ఆకాంక్ష ఉండేది. కేసీఆర్ ఏది చేసినా జై కొట్టారు. ఇప్పుడూ అదే తరహా వ్యూహాలు రచిస్తే పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే పరిస్థితులు లేవు’ అని పార్టీ లీడర్లు అంతర్గత సమావేశాల్లో కామెంట్స్ చేస్తున్నారు.

Next Story