మన కల్లు మంచిదేనా..?

by Yella Dhawani Reddy |   (  Updated:2025-07-15 02:03:16  IST  )

ఇటీవల కాలంలో కల్లు సేవించి మరణాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే.

మన కల్లు మంచిదేనా..?
X

దిశ, సంగారెడ్డి: ఇటీవల కాలంలో కల్లు సేవించి మరణాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. కల్లు దుకాణాలపై తనిఖీలు నిర్వహించాల్సిన ఎక్సైజ్ అధికారులు నిద్రమత్తులో జోగుతున్నారు. జిల్లాలో ఎలాంటి అనుమతులు లేకుండానే కల్లు డిపోలు ఏర్పాటు చేసి తయారు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో 2024లో రెండు కేసులు అల్ప్రాజోలం కేసులలో 1.01 కేజీలు స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. అదే విధంగా అల్పాజోలం తయారి కోసం ముడి సరుకులను తీసుకువచ్చి జిల్లాలోని మూత పడ్డ ఫార్మా కంపెనీల్లో తయారు చేశారు. దీనిని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. కల్తీకల్లు దందా జోరుగా జిల్లాలో సాగుతోంది. కల్తీ చేయడానికి అల్పాజోలం వినియోగించడం ద్వారా మరణాలు సంభివిస్తాయి. అల్పాజోలం కొకైన్ కంటే ప్రమాదకరమైన మత్తు పదార్థమని నార్కొటిక్ అధికారులు వివరించిన విషయం తెలిసిందే. ఈ డ్రగ్స్ దందాలో కెమికల్ ఇంజనీరింగ్, కెమిస్ట్రీ పీహెచ్‌డీ హోల్డర్స్ ఉంటున్నారు. జిల్లా పోలీసులు ఎంతో శమ్రించి అల్పాజోలం తయారి ముఠాలను అరెస్టు చేసినా ఎక్సైజ్ అధికారులు మాత్రం తమకేమిపట్టనట్లుగా వ్యవహిస్తున్నారు.

ఏ ప్రాంతంలో అయిన కల్లు దుకాణం ఏర్పాటు చేయాలంటే తప్పని సరిగా కల్లు దుకాణం ఏర్పాటు కోసం ఎక్సైజ్ అధికారుల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ, అందుకు భిన్నంగా ఓ గ్రామంలో ఒక దుకాణం ఏర్పాటు చేసేందుకు పర్మిషన్ తీసుకుని అదనంగా మరో రెండు దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన ఎక్సైజ్ అధికారులు వ్యాపారులు ఇచ్చే ఆమ్యామ్యాలకు ఆశపడి చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం కల్లు దుకాణదారులను ప్రోత్సహించేందుకు రాయితీలు అందిస్తున్న విషయం తెలిసిందే. కానీ గౌడ వృత్తిని నమ్ముకుని నమ్మకంగా కల్లును విక్రయిస్తున్నారు. కానీ ఈ వ్యాపారంలో కూడా కొందరు అక్రమ వ్యాపారులు జొరబడి వారి లాభాల కోసం అనుమతి లేకుండా యధేచ్చగా కల్లు దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలో ఇటీవల కాలంలో అల్పాజోలం జిన్నారం, ఫసల్ వాదీలో పోలీసులు పట్టుకున్నారు. లాభార్జనే ద్యేయంగా గ్రామాల్లోని అమాయక ప్రజల జీవితాలతో ఆటలాడుకునేందుకు మత్తుకోసం కల్లులో అల్పాజోలం కలుపుతూ కల్లుకు బానిసలను చేస్తున్నారు. రోజు తప్పనిసరిగా వారు తయారు చేసిన కల్లునే తాగేలా అలవాటు చేశారు. ప్రజలు ఆరోగ్యాలు పాడైపోతున్నాయి.

పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు..

ఎలాంటి అనుమతులు లేకుండా కల్లు దుకాణాలు ఏర్పాటు చేసి యదేచ్చగా కల్తీ కల్లు విక్రయాలు జరుగుతుంటే ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. గౌడవృత్తిదారులు తమ జీవనోపాధికోసం చెట్లు ఎక్కి కల్లును గీసి విక్రయిస్తుంటే లాబార్జనే ద్యేయంగా గౌడ కులస్తులు కాకపోయినా కూడా వారు కల్తీ కల్లును తయారి చేసి విక్రయిస్తున్నారు. యదేచ్చగా కల్లు డిపోలు ఏర్పాటు చేసుకుని అనుమతి లేని కల్లు దుకాణాలకు కల్లును సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. గత సంవత్సరం 2024లో జిల్లాలో పెద్ద ఎత్తున అల్ప్రాజోలం తయారు చేసిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. అయినా కూడా పూర్తి స్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం వల్ల యదేచ్చగా అనుమతి లేని కల్లు దుకాణాలు వెలుస్తున్నాయి. అక్రమ కల్లు దుకాణాలపై పలువురు ఫిర్యాదు చేస్తే వారిని వ్యాపారులు, అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. దీనిపై గ్రామాల్లో అడ్డుకున్న వారికి ఎంతో కొంత ముట్టజెప్పి వారి నోళ్లు మూయిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైన ఎక్సైజ్ అధికారులు అనుమతి లేని కల్లు దుకాణాలపై చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

అనుమతిలేని కల్లు దుకాణాలు ఏర్పాటు..

ఓ వైపు గ్రామీణ ప్రాంత ప్రజల అలవాట్లను ఆసరా చేసుకున్న కల్లు వ్యాపారులు గ్రామాల్లో అనుమతి లేని కల్లు దుకాణాలు ఏర్పాటు చేశారు. ఒక దుకాణం ఏర్పాటుకు లైసెన్స్ తీసుకుని దాని పేరుతో రెండు మూడు దుకాణాలు ఎలాంటి లైసెన్స్‌లు లేకుండానే ఏర్పాటు చేసుకున్నారు. సంగారెడ్డి సర్కిల్ పరిధిలో కంది, సంగారెడ్డి, సదాశివపేట, కొండాపూర్, మునిపల్లి మండలాలు వస్తాయి. కల్లు దుకాణదారులు కల్లును ప్యాకెట్ల ద్వారా మాత్రమే విక్రయిస్తారు. ఎక్కడో తయారు చేసిన కల్లును ప్లాస్టిక్ కవర్లలో నింపి వాటి ద్వారా కల్లు ప్రియులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అదే విధంగా ఇటుక బట్టీల వద్ద కూడా ఎలాంటి అనుమతి లేకుండానే కల్లు విక్రయాలు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. పట్టించుకోవాల్సిన ఎక్సైజ్ అధికారులు అక్రమ కల్లు దుకాణాదారులకు వత్తాసు పలుకుతున్నారు. అనుమతిలేని కల్లు దుకాణాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే వారితో మాట్లాడుకోవాలని అక్రమ వ్యాపారులకు ఎక్సైజ్ అధికారులు సలహాలు ఇవ్వడం గమనార్హం. కల్లు శాంపిళ్లను సేకరించడం ఎక్సైజ్ అధికారులు మర్చిపోయారు. సేకరించినా సైతం వాటిని ల్యాబ్ కు పంపకుండా కల్లు తయారు చేసే వారితో మాట్లాడుకుని సెటిల్ మెంట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికైనా జిల్లాలో అనుమతి లేని కల్లు డిపోలు, కల్లు దుకాణాలపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Next Story