రేవంత్ చేతికి మరో బ్రహ్మాస్త్రం.. స్థానిక ఎన్నికల వేళ బీఆర్ఎస్, బీజేపీలకు చెక్ పెట్టబోతున్నారా?

by Prasad Jukanti |

ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో తాజా పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులకు కారణం కాబోతున్నాయా?

రేవంత్ చేతికి మరో బ్రహ్మాస్త్రం.. స్థానిక ఎన్నికల వేళ  బీఆర్ఎస్, బీజేపీలకు చెక్ పెట్టబోతున్నారా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: నిన్నా మొన్నటి వరకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో రణరంగాన్ని తలపించిన తెలంగాణ రాజకీయం తాజాగా ఫార్ములా ఈ కార్ రేస్ కేసుతో హీటెక్కుతోంది. ఈ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‍ను ఏసీబీ విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇవాళ అనుమతి ఇచ్చారు. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో సరికొత్త పరిణామాలకు దారి తీయబోతోందా? ఇప్పటికే పీకల లోతు కష్టాల్లో గులాబీ పార్టీని ఈ ఎపిసోడ్ మరింత చిక్కుల్లోకి నెట్టబోతోందా? కేటీఆర్‍తో సీఎం రేవంత్ రెడ్డి రాజీ పడ్డారని అందుకే ఫార్ములా ఈ-రేస్ కేసులో కేటీఆర్ ప్రధాన నిందితుడని తేలినా అరెస్ట్ చేయకుండా మీన మేషాలు లెక్కిస్తున్నారంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలకు అధికార పక్షం చెక్ పెట్టబోతోందా? త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్ర రాజకీయాలను తాజా పరిణామాలు ఎటువైపు దారిచూపబోతున్నాయనేది ఉత్కంఠ రేపుతోంది.

కేసీఆర్‍కు మరో చాలెంజ్:

తెలంగాణ ఏర్పడ్డాక వరుసగా రెండు దఫాలు రాష్ట్ర రాజకీయాలను శాసించిన బీఆర్ఎస్ అధినేతకు తాజా పరిస్థితులు పెను సవాలుగా మారాయి. 2023లో అధికారానికి దూరమైన పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లోనూ గట్టెక్కించలేకపోయారు. ఆ తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీని కనీసం బరిలోకి దింపకపోగా రాష్ట్రంలో జరిగిన రెండు ఉప ఎన్నికలు కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాలు కోల్పోతూ వరుసగా డక్కా ముక్కీలు తింటోంది. ఈ క్రమంలో వచ్చే నెలలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగబోతోతున్న వేళ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍ను ఈ కార్ రేస్ కేసులో విచారించేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన అరెస్టు తప్పదా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే అధినేత కేసీఆర్ ఇంట్లో కవిత రూపంలో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో కవిత తన దారి తాను వెతుక్కుంటున్నారు. ఇటువంటి తరుణంలో కేటీఆర్ అరెస్ట్ అయితే పార్టీకి మరిన్ని కష్టాలు తప్పవా అనే చర్చ జరుగుతోంది. ఈ పరిణామాలను దాటుకుని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలవాల్సిన ఉన్న నేపథ్యంలో కేసీఆర్ ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగిస్తారు? ఇకనైనా ప్రజల ముందుకు వస్తారా లేక ఎప్పటిలాగే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే వరకే పరిమితం అవుతారా అనేది వేచి చూడాలి.

బీజేపీ ఆరోపణలకు చెక్ పెడతారా?:

కేసీఆర్ అరెస్ట్ విషయంలో చాలా కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. కాళేశ్వరం కేసు సంగతి అలా ఉంచితే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే ఏసీబీ హ్యాండిల్ చేస్తున్న ఈ కార్ రేస్ కేసులోని అవకతవకలపై కేటీఆర్‍ను ఎందుకు అరెస్టు చేయడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీజేపీ ప్రశ్నిస్తోంది. అయితే ఇంత కాలం గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడం వల్లే దర్యాప్తు ముందుగు సాగడం లేదని చెప్పిన అధికార పక్షం ఇక గవర్నర్ అనుమతితో బీజేపీ ఆరోపణలకు చెక్ పెట్టేలా నిర్ణయాలు తీసుకోబోతోందా అనేది ఆసక్తి రేపుతోంది. మరోవైపు ఈ కేసు అంతా వట్టిదేనని, ఈ వ్యవహారంలో ఎలాంటి తప్పులు లేవు కాబట్టే ప్రభుత్వం అరెస్టు చేయడం లేదని బీఆర్ఎస్ వాదిస్తోంది. ఇక దమ్ముంటే తనను అరెస్టు చేసుకోవాలని కేటీఆర్ పదే పదే ప్రభుత్వాన్ని సవాల్ చేస్తున్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలుపు ఉత్సాహంతో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తాజాగా గవర్నర్ తీసుకున్న నిర్ణయం ఇటు బీఆర్ఎస్, బీజేపీలకు రాజకీయంగా చెక్ పెట్టే అస్త్రం దొరికినట్లేనా అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఫార్ములా ఈ రేస్ కేసు ఎవరికి కలిసి వస్తుందో మరెవరికి బెడిసి కొడుతుందో చూడాలి మరి.

Next Story