డిగ్రీ, పీజీ కోర్సుల నిర్వహణలో అక్రమాలు

by Malleboina Mahesh |

రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థల అక్రమాలు, దుర్వినియోగాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

డిగ్రీ, పీజీ కోర్సుల నిర్వహణలో అక్రమాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థల అక్రమాలు, దుర్వినియోగాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ముఖ్యంగా యూనివర్శిటీలకు అనుబంధంగా నడుస్తున్న డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా, ఫార్మసీ, పీజీ కాలేజీలు లేని కోర్సులు ఏర్పాటు చేసి విద్యార్థుల భవిష్యత్తులను ప్రమాదంలో పడేస్తున్నారు. డిగ్రీ, పీజీ కోర్సుల్లో కాలేజీ యాజమాన్యాలు పలు కారణాలతో కోర్సులను దుర్వినియోగం చేస్తున్నారు. తెలంగాణలో ఓయూ గుర్తింపు ఉండి, ఇతర రాష్ట్రాల యూనివర్సిటీ కోర్సులను కొన్ని ప్రైవేటు కాలేజీలు నిర్వహిస్తున్నాయి. ఈ కాలేజీలు ఇచ్చే సర్టిఫికెట్లు విద్యార్థులకు ఎక్కడ ఉపయోగపడవని, పలువురు విద్యార్థి సంఘాలు వాపోతున్నాయి.

రూ. 8 లక్షల జరిమానా

ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉన్న రాంనగర్, మియాపూర్, లింగంపల్లిలోని సన్ డిగ్రీ కాలేజీలు ఉస్మానియా డిగ్రీ, హోటల్ మేనేజ్మెంట్ కోర్సులు నిర్వహిస్తున్నారు. వీటితోపాటు యూజీసీ, యూనివర్సిటీ నిబంధనలు ఉల్లంఘించి ఢిల్లీలోని లింగయ్య విద్యాపీఠ్ నుండి డిగ్రీ, ఎంబీఏ రెగ్యులర్ కోర్సులను, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నాలజీ నుండి డిప్లొమా కోర్సులను నిర్వహిస్తూ విద్యార్థుల నుంచి లక్షల రూపాయలను వసూలు చేస్తున్నారు. జూలైలో సన్ డిగ్రీ కళాశాలల పై సీజేఎస్ అధ్యక్షుడు మాసారం ప్రేమ్ కుమార్ ఫిర్యాదు చేయడంతో ఉస్మానియా ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టి రెండు సార్లు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అనంతరం భారీ ఎత్తున సన్ డిగ్రీ కళాశాలలకు రూ. 8 లక్షలను జరిమానా విధించి, మరల పునరావృతం అయితే గుర్తింపు రద్దుతో పాటు క్రిమినల్ కేసులను కూడా నమోదు చేయవచ్చు అని అఫిడవిట్‌ను తీసుకున్నారు.

అడిట్ సెల్ విభాగం తనిఖీలు..

ఓయూ అకడమిక్ ఆడిట్ విభాగం అధికారులు కొద్దిరోజుల క్రితం హైదరాబాద్‌లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఈ అక్రమాలు వెలుగు చూశాయి. అందులో భాగంగానే సన్ కాలేజీ ఇంటిగ్రేటెడ్ డిగ్రీని ఢిల్లీలోని లింగయ్య యూనివర్సిటీ పేరుతో నిర్వహిస్తోంది. రామ్‌నగర్‌లోని సన్ డిగ్రీ కాలేజీకు ఉస్మానియా యూనివర్శిటీ డిగ్రీ కోర్సులకు అనుమతులు ఇచ్చింది. కానీ, ఇందులో బీకామ్ కోర్సులకు అనుమతి లేదు. అయినా కాలేజీ యాజమాన్యం ఆ కోర్సులో చేరిన విద్యార్థులకు పాఠాలు చెప్పిస్తున్నారు. ఈ విషయమై సీజేఎస్, పలు విద్యార్థి సంఘాలు వీసీకి ఫిర్యాదు చేశారు. దీంతో అకడమిక్ ఆడిట్ విభాగం అధిపతి ప్రొఫెసర్ కిషన్ కాలేజీకు వెళ్లి తనిఖీ చేశారు.

విద్యార్థుల్లో కొందరు బీకాం డిగ్రీ చదువుకుంటున్నామని తెలపగా, మరికొందరు ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సులో చేరినట్లు చెప్పారు. దీంతో యాజమాన్యాన్ని బీకామ్ కోర్సులను ఎందుకు నిర్వహిస్తున్నారని గట్టిగా నిలదీశారు. యూనివర్సిటీ గుర్తింపును దుర్వినియోగం చేస్తున్నారంటూ కాలేజీలకు నోటీసులు జారీ చేశారు. గతంలో ఏపీ, తమిళనాడులోని కొన్ని యూనివర్శిటీలు ఇక్కడ దూర విద్యా కేంద్రాన్ని ఏర్పాటు చేసి, డిగ్రీ కోర్సులను అందించాయి. ఆ తర్వాత ఏపీ, కేరళ, తమిళనాడు సహా నార్త్ ఇండియాలో ఉన్న వర్శిటీల స్టడీ సెంటర్లను ప్రభుత్వం రద్దు చేసింది.

Next Story