- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రూ.100 కోట్లు..గోల్ మాల్ !
తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ప్రక్షాళనకు ప్రభుత్వం రంగం చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ మెడికల్ సర్వీసెస్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్(టీజీఎంఎస్ఐడీసీ) ప్రక్షాళనకు ప్రభుత్వం రంగం చేసింది. అవినీతికి అడ్డాగా మారడంతో సంస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలని సర్కార్ సన్నద్ధమైంది. ముందుగా కొన్నేళ్లుగా అక్కడే తిష్టవేసి అక్రమాలకు పాల్పడుతున్న అధికారులను ఇతర సంస్థలకు బదిలీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మరో రెండు మూడు రోజుల్లో భారీ మార్పులు చేర్పులు ఉంటాయని వైద్యశాఖ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. సర్కారు దవాఖానాలకు కావాల్సిన మందులు, వైద్యపరికరాలను టీజీఎంఎస్ఐడీసీ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. అయితే అక్కడ పనిచేస్తున్న కొందరు ఆఫీసర్లు కాంట్రాక్టర్లతో కుమ్మక్కై ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నట్టు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
కిట్టుకు రూ. 2 లక్షలు అదనం..
గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలకు వైద్యారోగ్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించడం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 81 రకాల వస్తువులను అందజేయాలి. సంస్థ పిలిచిన టెండర్లలో అర్హత సాధించిన ఏజెన్సీ ఒక్కో కిట్ ధరను రూ.2,90,600 వేలుగా నిర్ధారించి 4500 కిట్స్ ను సరఫరా చేశారు. కానీ అదే కిట్ బహిరంగ మార్కెట్ లో సుమారు రూ.90వేలకే లభిస్తుందన్న విషయాన్ని కొందరు సీఎంవో దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. ఈ కిట్ల కొనుగోళ్లలో సుమారు రూ.100 కోట్ల వరకు అదనంగా చెల్లించినట్టు ఫిర్యాదు చేశారని సమాచారం. ఈ విషయాన్ని సీరియస్ గా పరిగణించిన సీఎం రేవంత్ రెడ్డి కార్పొరేషన్ లో చోటుచేసుకుంటున్న అక్రమాలను నిగ్గుతేల్చి నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. దీంతో రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు ఏయే టెండర్లలో ఎంత మేరకు అక్రమాలు జరిగాయో వివరిస్తూ ప్రాథమిక నివేదిక ఇవ్వగా, బాధ్యులైన అధికారులను అక్కడి నుంచి తప్పించాలని సీఎం ఆదేశించినట్టు సెక్రటేరియట్ వర్గాల్లో చర్చ నడుస్తున్నది.
చక్రం తిప్పేదివారేనా?
బీఆర్ఎస్ హయం నుంచి టీజీఎంఎస్ఐడీసీలో తిష్టవేసిన కొందరు అధికారులు కాంగ్రెస్ సర్కారులోనూ చక్రం తిప్పుతున్నారు. సదరు అధికారుల పర్యవేక్షణలోనే మందులు, పరికరాలు కొనుగోళ్లు జరుగుతున్నాయి. దీంతో తమకు సన్నిహితులైన కాంట్రాక్టర్లకు టెండర్లు దక్కేలా నిబంధనలు రూపొందించి అక్రమాలకు పాల్పడుతున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్టు తెలిసింది. సంస్థలో జరుగుతున్న అక్రమాల్లో ప్రమేయం ఉన్న వ్యక్తుల చిట్టాను సీఎంవోకు అందించినట్టు సమాచారం. అందులో బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో వైద్యశాఖ, కార్పొరేషన్ లోని కీలక వ్యక్తుల వద్ద పనిచేసిన ఇద్దరు వ్యక్తులు ప్రస్తుతం వైద్యశాఖలో కీలక వ్యక్తి వద్ద పనిచేస్తున్నట్టు ప్రచారం జరుగుతున్నది. గత ప్రభుత్వంలో సీఎంవోలో పనిచేసిన ఓ అధికారి కార్పొరేషన్ లో కీలక రోల్ ప్లే చేశారు. కానీ ప్రభుత్వం మారినా సదరు వ్యక్తి అదేహోదాలో కొనసాగుతున్నారు. పాత ప్రభుత్వంలో మందుల కొనుగోళ్లలో ప్రమేయం ఉన్న ఓ సివిల్ సర్జన్, ఓ ఫార్మసిస్ట్, ఓ ఇంజినీర్, క్వాలిటీ కంట్రోల్ అధికారి ప్రస్తుత సర్కారులో సైతం చక్రం తిప్పుతున్నట్టు విమర్శులు ఉన్నాయి.
కీలక అధికారి.. ఖరీదైన ఇల్లు
వైద్యశాఖలో ఉన్నత స్థాయిలో పనిచేస్తున్న ఓ అధికారి ఇటీవల సైబారాబాద్ ఏరియాలో ఖరీదైన ఇల్లు నిర్మిస్తున్నారు. అయితే ఆ నిర్మాణం చూసిన వారు అవాక్కవుతున్నారు. కేవలం నెల జీతంపై ఆధారపడి నిర్మించే ఇల్లు కాదని కామెంట్ చేస్తున్నారు. అయితే హంగు ఆర్భాటాలతో నిర్మిస్తున్న ఇంటికి కావాల్సిన నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని డిస్కషన్ జరుగుతున్నది. కుటుంబసభ్యుల జీతం, బిజినెస్ తో నిర్మిస్తున్నారా? లేక కార్పొరేషన్ చేపట్టిన కొనుగోళ్లలో వచ్చిన వాటాతో నిర్మిస్తున్నారా? అని వైద్యశాఖలో గుసగుసలాడుతున్నారు.






