- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐఆర్‌సీ చైర్మన్ మోహన్ నాయక్ అరెస్ట్.. తెలంగాణ ప్రతిష్ఠకు దెబ్బ
IRC అధ్యక్ష పీఠంపై కూర్చుని తెలంగాణ ఖ్యాతిని జాతీయ స్థాయిలో చాటాల్సిన ఒక అత్యున్నత స్థాయి అధికారి అవినీతి ఊబిలో కూరుకుపోయి రాష్ట్ర పరువును బజారున పడేశాడు.

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలోనే అత్యున్నత, అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్‌సీ) అధ్యక్ష పీఠంపై కూర్చుని, తెలంగాణ ఖ్యాతిని జాతీయ స్థాయిలో చాటాల్సిన ఒక అత్యున్నత స్థాయి అధికారి అవినీతి ఊబిలో కూరుకుపోయి రాష్ట్ర పరువును బజారున పడేశాడు. రోడ్లు, భవనాల శాఖ ఈఎన్‌సీ జే.మోహన్‌నాయక్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కి ఊచలు లెక్కపెడుతున్నాడు. గతేడాది నవంబర్‌లో భువనేశ్వర్ వేదికగా జరిగిన ఐఆర్‌సీ కౌన్సిల్ సమావేశంలో మోహన్‌నాయక్‌ను దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఐఆర్‌సీ పదవికి ఎంపిక చేసినప్పుడు రాష్ట్రానికే గర్వకారణంగా భావించారు. కానీ, సరిగ్గా 7 నెలలు గడవకముందే ఆయన అవినీతి బాగోతం బట్టబయలవడంతో తెలంగాణ ప్రతిష్ట మసకబారిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
నివ్వెరపోయిన ఏసీబీ
ఆర్&బి శాఖలో కీలక బాధ్యతల్లో ఉన్న మోహన్ నాయక్.. తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్ల రూపాయల అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ సోదాల్లో ప్రాథమికంగా తేలింది. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బినామీల పేరిట భూములు, విల్లాలు, ఫామ్‌హౌస్‌లు, కిలోల కొద్దీ బంగారం లభ్యమవడం అందరినీ విస్తుపోయేలా చేసింది. ఒకపక్క జాతీయ, రాష్ట్ర స్థాయి విధానాలపై సమీక్షలు చేయాల్సిన అధికారి.. మరోపక్క ఏసీబీ కస్టడీలో అవినీతి లెక్కలు చెప్పాల్సి రావడం గమనార్హం.
హైదరాబాద్‌లో ఐఆర్‌సీ సదస్సు
ఈ ఏడాది చివర్లో తెలంగాణకు ఒక అరుదైన అవకాశం దక్కనుంది. దేశవ్యాప్తంగా రవాణా రంగంలో అత్యంత కీలకమైన 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ వార్షిక సదస్సుకు భాగ్యనగరం వేదిక కానుంది. ఈ మహా సదస్సుకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల మంత్రులు, అత్యున్నత స్థాయి ఐఏఎస్ అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు హాజరుకానున్నారు. ఇంతటి భారీ సదస్సును ఐఆర్‌సీ చైర్మన్ హోదాలో, అటు లోకల్ బాస్ (ఈఎన్‌సీ, టీజీఆర్డీసీ ఎండీ)గా మోహన్ నాయక్ ముందుండి నడిపించాల్సి ఉంది. సొంత రాష్ట్రంలోనే దేశం గర్వించేలా ఈ సదస్సు నిర్వహించి తెలంగాణ సత్తా చాటాల్సింది పోయి, ఆయనే అవినీతి కేసులో ఇరుక్కుని జైలుపాలు కావడం రాష్ట్ర ప్రభుత్వానికి తీవ్ర తలవంపులు తెచ్చింది. ‘దేశవ్యాప్తంగా ఉన్న మంత్రులు, వీఐపీలు తరలివచ్చే సదస్సుకు ఆతిథ్యమిస్తున్న తరుణంలో.. ఐఆర్‌సీ చైర్మన్, టీజీఆర్డీసీ ఎండీ హోదాలో ఉన్న అధికారి అవినీతి తిమింగలంలా ఏసీబీకి దొరకడం జాతీయ స్థాయిలో రాష్ట్ర పరువు తీసినట్లయింది’ అని ఆర్&బి వర్గాలు వాపోతున్నాయి.
కొత్త చైర్మన్ నియామకం?
ప్రస్తుతం మోహన్ నాయక్ జైలులో ఉండటంతో ఐఆర్‌సీ చైర్మన్ పీఠంతో పాటు, టీజీఆర్డీసీ ఎండీ స్థానం కూడా ఖాళీ అయింది. ముఖ్యంగా ఈ ఏడాది చివర్లో హైదరాబాద్‌లోనే సదస్సు జరగాల్సి ఉండటంతో, అంతకంటే ముందే కొత్త చైర్మన్ నియామకం చేపట్టడం ఐఆర్‌సీ కౌన్సిల్‌కు అనివార్యంగా మారింది. ఐఆర్‌సీ నిబంధనల ప్రకారం తదుపరి సీనియర్ లేదా కౌన్సిల్ అత్యవసరంగా ఎంపిక చేసిన అధికారికి ఈ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మోహన్ నాయక్ ఉదంతం తర్వాత, ఈ ప్రతిష్ఠాత్మక పదవికి కొత్త వ్యక్తినే ఎంపిక చేస్తారా? లేక తాత్కాలికంగా వేరొకరికి బాధ్యతలు ఇస్తారా? అనేదానిపై దేశవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాష్ట్రానికి కేటాయించిన ఈ స్థానాన్ని ఆర్&బి శాఖలోని మరో ఈఎన్సీకి కేటాయించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఒక ఐఆర్‌సీ చైర్మన్ అవినీతి కేసులో జైలుకు వెళ్లడం సంస్థ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోనుంది. జాతీయ స్థాయిలో తెలంగాణ ఇంజనీర్ల ప్రతిభను చాటాల్సిన చోట.. అవినీతి మరకలతో రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చిన మోహన్ నాయక్ వ్యవహారంపై ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించేలా కనిపిస్తోంది.
తొలి టీజీఆర్డీసీ ఎండీ
ఐఆర్‌సీ చైర్మన్ అయిన మోహన్ నాయక్.. కేవలం జాతీయ స్థాయి పదవికే పరిమితం కాలేదు. అటు రాష్ట్రంలోనూ అత్యంత కీలకమైన స్థానంలో చక్రం తిప్పారు. తెలంగాణలో రహదారుల అభివృద్ధిని సరికొత్త పంథాలో తీసుకెళ్లేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, మొట్టమొదటిసారిగా రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీజీఆర్డీసీ)ను ఏర్పాటు చేసింది. దీనికి తొలి మేనేజింగ్ డైరెక్టర్ గా మోహన్ నాయక్‌నే ప్రభుత్వం నియమించింది. ఒకపక్క రాష్ట్ర రోడ్డు రవాణా రంగానికి దిక్సూచిగా నిలిచే కార్పొరేషన్ సారథిగా, మరోపక్క ఆర్‌అండ్‌బీ ఈఎన్సీగా.. ఇలా రాష్ట్రంలోనే అత్యంత కీలకమైన అధికారాలన్నీ ఆయన చేతుల్లోనే పెట్టారు. ఇంతటి నమ్మకాన్ని ఉంచిన ప్రభుత్వాన్ని, వ్యవస్థను మోహన్ నాయక్ అడ్డంగా ముంచేశాడు.






