ఆస్ట్రేలియా పౌరులే టార్గెట్..! మాదాపూర్‌లో అంతర్జాతీయ నకిలీ కాల్ సెంటర్ ముఠా అరెస్ట్

by Ramesh Naini |

మాదాపూర్ కేంద్రంగా ఆస్ట్రేలియా పౌరులు లక్ష్యంగా అంతర్జాతీయ నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తున్న ముఠాను సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.

ఆస్ట్రేలియా పౌరులే టార్గెట్..! మాదాపూర్‌లో అంతర్జాతీయ నకిలీ కాల్ సెంటర్ ముఠా అరెస్ట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మాదాపూర్ కేంద్రంగా ఆస్ట్రేలియా పౌరులు లక్ష్యంగా అంతర్జాతీయ నకిలీ కాల్ సెంటర్ నిర్వహిస్తున్న ముఠాను సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు నకిలీ కాల్ సెంటర్ ద్వారా క్రిప్టో కరెన్సీలోకి లావాదేవీలు జరిపినట్లు సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీజీపీ సుధీంద్ర వెల్లడించారు. తొమ్మిది మందిని అరెస్టు చేసి 12 కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. బాలానగర్‌లోని స్పెషల్ ఆపరేషన్స్ టీమ్, సైబరాబాద్ కమిషనరేట్‌లోని సైబర్ క్రైమ్ పోలీసుల సహకారంతో మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీలో అంతర్జాతీయ నకిలీ కాల్ సెంటర్‌ను గుర్తించినట్లు తెలిపారు. కోల్‌కత్తాకు చెందిన కీలక నిందితులైన ప్రవీణ్, ప్రకాశ్‌లను కాల్ సెంటర్‌లో పనికి నియమించుకున్నారని తెలిపారు.

ఆస్ట్రేలియా పౌరులకు కాల్స్ చేసి, వారి బ్యాంకు ఖాతాల నుంచి పెద్ద మొత్తంలో డబ్బును ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయ పౌరుల ఖాతాలకు బదిలీ చేయమని వారిని మోసాలకు పాల్పడ్డారని పేర్కోన్నారు. చట్టవిరుద్ధంగా సంపాదించిన నిధులను హవాలా, క్రిప్టో కరెన్సీ రూపంలో భారత్‌కు మళ్లించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. రెండు సంవత్సరాల వ్యవధిలో రూ. 8-10 కోట్లు బదిలీ చేశారని సుధీంద్ర పేర్కొన్నారు. నిందితులను ఖమ్మం జిల్లాకు చెందిన యేపురి గణేష్, మారంపుడు చెన్న కేశవలుగా గుర్తించారు. మిగతా వారిని కలకత్తాకు చెందిన మౌమిత మండల్, ఈజాజ్ అహ్మద్, సాంబిట్ రాయ్, షానిక్ బెనర్జీ, మౌమితా మాలిక్, సిల్పి సమద్దర్, కునాల్ సింగ్లుగా గుర్తించారు. నిందితుడు గణేష్ పాస్‌పోర్ట్‌ను సీజ్ చేసినట్లు తెలిపారు. మిగతా నిందితులను అరెస్ట్‌కు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

Next Story