బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు.. రగిలిపోతున్న గులాబీ శ్రేణులు

by Naga Rani Yarlagadda |

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటమి వేళ బీఆర్ఎస్ అధినాయకత్వంపై ద్వితీయ శ్రేణి లీడర్లు, కేడర్ అసంతృప్తితో ఉన్నది.

బీఆర్ఎస్‌లో అంతర్గత విభేదాలు.. రగిలిపోతున్న గులాబీ శ్రేణులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో ఓటమి వేళ బీఆర్ఎస్ అధినాయకత్వంపై ద్వితీయ శ్రేణి లీడర్లు, కేడర్ అసంతృప్తితో ఉన్నది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి రెండేళ్లు గడిచినా ఇంతవరకు పార్టీ సభ్యత్వం చేపట్టలేదని చెబుతున్నారు. నూతన కమిటీలను నియమించలేదు. శిక్షణ శిబిరాలు ఆచరణలోకి రాలేదు. 8ఏళ్ల క్రితం వేసిన రాష్ట్ర కమిటే తప్ప కొత్తగా కమిటీ వేయలేదు. పార్టీ అధికారంలో లేనప్పుడు సభ్యత్వం చేసి కమిటీలు వేస్తే ఉత్సాహంగా పనిచేసే అవకాశం ఉంటుందని, తాము పార్టీలో ఏమని చెప్పుకోవాలి, ఏ హోదాలో పనిచేయాలని కేడర్​ఆవేదన వ్యక్తం చేస్తున్నది. పార్టీ సంస్థాగతంగా బలోపేతంపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడే దృష్టిసారిస్తే మంచి ఫలితాలు వస్తాయని, కొత్త నాయకత్వం వస్తుందని అభిప్రాయపడుతున్నారు. సోషల్​మీడియాలో రెండు ఫొటోలు పడేస్తే సరిపోదని సూచిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేల స్థానంలో ప్రత్యామ్నాయం ఎవరన్నది కేడర్ కు తెలియడం లేదు.

కొత్త వారికే ప్రాధాన్యం

బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలోకి పలువురు నేతలు వలస వచ్చారు. దీంతో అప్పటి వరకు కష్టపడ్డ నేతలంతా వెనక్కి వెళ్లారు. వారిని పట్టించుకునే పరిస్థితి రాలేదు. దీనితో పాత నాయకులు తీవ్రస్థాయిలో మనోవేదనకు గురయ్యారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకుని వారికే టికెట్ ఇచ్చారు. కేసీఆర్, కేటీఆర్​ను చూసి ప్రజలు ఓట్లు వేస్తే వారే సొంతంగా గెలిచినట్లు పాత లీడర్లను నిర్లక్ష్యం చేశారని మండిపడుతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతో మంది ఎలాంటి పదవులు ఆశించకుండా చురుగ్గా పాల్గొన్నారు. వరంగల్, రంగారెడ్డి, ఆదిలాబాద్​జిల్లాల్లో పార్టీలో మొదటి నుంచీ ఉన్న వారికి కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే రెండు దఫాలుగా మంత్రి పదవులు ఇచ్చారని గుర్తుచేస్తున్నారు.

కష్టపడ్డవారికి ఫలితమేది?

తమిళనాడులో డీఎంకే పార్టీ నిర్మాణంపై అధ్యయనం కూడా చేశారు. కానీ ఇంత వరకు బీఆర్ఎస్ కొత్త కమిటీలు వేయలేదు. మహిళా అధ్యక్షురాలిగా పనిచేసిన గుండు సుధారాణి కాంగ్రెస్​లో చేరారు. ఆమె బీఆర్ఎస్​లో చేరిన తర్వాత నామినేటెడ్​పోస్టు, పార్టీ పదవి రెండు ఇచ్చినప్పుడే నాయకత్వంపై విమర్శలు వచ్చాయి. అయినా ఇవేవీ పట్టించుకోకుండా ఆమెకు అధిక ప్రాధాన్యమిచ్చారని మహిళా నేతలు ఆగ్రహంతో ఉన్నారు. ఆమె టీడీపీ నుంచి బీఆర్ఎస్​లోకి వచ్చి తిరిగి అధికార కాంగ్రెస్​లోకి వెళ్లారని, కీలకమైన వరంగల్​మేయర్​పదవి ఇచ్చారని గుర్తుచేస్తున్నారు. పార్టీలో అలాంటి వారికి అధిక ప్రాధాన్యం ఇచ్చారని చెబుతున్నారు. పార్టీని మొదటి నుంచీ పట్టుకుని ఉన్నవారే ఇప్పుడు ప్రతిపక్షంలో మిగిలారని అంటున్నారు. ఇకనైనా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టిసారించాలని, బలమైన పునాదులు వేయాలని గులాబీ శ్రేణులు కోరుతున్నారు.

Next Story