రాజ్యసభ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం.. వీహెచ్‌తో వేం నరేందర్ రెడ్డి భేటీ

by Kema Shiva Kumar |   (  Updated:2026-03-06 06:58:15  IST  )

రాజ్యసభ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ హనుమంత రావును కలవడం హాట్ టాపిక్‌గా మారింది.

రాజ్యసభ ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామం.. వీహెచ్‌తో వేం నరేందర్ రెడ్డి భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాజ్యసభ అభ్యర్థిగా ఎంపికైన సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి ఇవాళ కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావును మర్యాదపూర్వకంగా కలిశారు. రాజ్యసభ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేసిన అనంతరం, పార్టీలోని సీనియర్ల ఆశీస్సులు తీసుకునే క్రమంలో భాగంగానే ఈ భేటీ జరిగినట్లుగా తెలుస్తోంది. సీనియర్ నేత వీహెచ్ అనుభవాన్ని గౌరవిస్తూ.. భవిష్యత్తులో పార్టీ కార్యక్రమాల్లో కలిసి పనిచేసే అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించారు.

అయితే, రాజ్యసభ టికెట్ ఆశించిన వారిలో వీహెచ్ కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆయన ఢిల్లీలోనే మకాం వేసి ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో పాటు రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌‌లను కలిసి తనకే టికెట్ కేటాయించాలని కోరారు. అయితే, అధిష్టానం వేం నరేందర్ రెడ్డి వైపు మొగ్గు చూపడంతో సీనియర్ నేతల లాబీయింగ్‌కు తెరపడింది. అయితే, పార్టీలో ఎలాంటి అసమ్మతి లేకుండా సీనియర్లను ప్రసన్నం చేసుకుని వారి మద్దతును కూడగట్టే ప్రయత్నంలో భాగంగా ఇవాళ వేం నరేందర్ రెడ్డి, వీహెచ్‌తో భేటీ అయినట్లుగా తెలుస్తోంది.

Next Story